బల్దియా పోలింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు | heavy arrangement to baldia polling | Sakshi
Sakshi News home page

బల్దియా పోలింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు

Mar 27 2014 2:31 AM | Updated on Aug 17 2018 2:53 PM

జిల్లాలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భైంసా, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ బల్దియాల్లో ఈనెల 30న ఎన్నికలు జరగనున్నాయి.

ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ :  జిల్లాలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భైంసా, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ బల్దియాల్లో ఈనెల 30న ఎన్నికలు  జరగనున్నాయి. ఇందుకోసం జిల్లా పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలు ప్రటిష్టాత్మకంగా తీసుకోనుండడంతో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అన్ని మున్సిపాలిటీల్లో పోలీసు బలగాలు మోహరించాయి. ఎన్నికలు మరో మూడు రోజుల గడువు ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి మద్యం, డబ్బు రవాణాకు చెక్ పెడుతున్నారు. ఎన్నికల ముగిసేంత వరకు పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉండాలని ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు అందాయి.

గత ఎన్నికల్లో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల విధులకు అదనపు ఎస్పీలు  02, డీఎస్పీలు 7, సీఐలు 15, ఎస్సైలు 80, ఏఎస్సైలు 70, హెడ్‌కానిస్టేబుళ్లు 220, కానిస్టేబుళ్లు 1,200, మహిళా కానిస్టేబుళ్లు 40, ఏఆర్‌ఎస్సైలు 28, ఏఆర్ కానిస్టేబుళ్లు 200, హోంగార్డులు 80, స్పెషల్‌పార్టీలు 04, కంట్రోల్ రూంలు 07, మోబైల్ పార్టీలు 12 నియమించారు. పోలింగ్ బూత్‌లవారీగా భద్రత ఏర్పాటు చేసి ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు చర్యలు తీసుకున్నారు.

 అరాచక శక్తులపై నిఘా
 పార్టీలు, నాయకుల నీడన ఉండి ఎన్నికల్లో అరాచకాలు సృష్టించే వారి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం గతంలో జరిగిన ఎన్నికల్లో ఏమైన శక్తులు పనిచేశాయా అన్న వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. ఒకే తప్పును మళ్లీ మళ్లీ చేసే నేరస్తులను బహిష్కరించే అవకాశాలు ఉంటాయి. ఓటరు తన ఓటు హక్కును స్వేచ్చాయుతంగా వినియోగించుకునే వాతావరణం కల్పించడే ధ్యేయంగా ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యల్లో ఇదోకటిగా చెప్పవచ్చు. ఎన్నికల ప్రచారంలో పోలీసులు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. ప్రచారంలో భాగంగా ఓటర్లను మభ్యపెట్టడం, భయభ్రాంతులకు గురిచేయడం చేస్తే వెంటనే అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టనున్నారు.

 సమస్యాత్మక కేంద్రాల్లో గొడవలకు చెక్
 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రతిసారీ ఘర్షణ జరగడం, చివరకు ఎన్నికలు వాయిదా పడడం సాధారణంగా మారింది. ఈ అనుభవాలు దృష్టిలో ఉంచుకొని ఈసారి అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతోపాటు అక్కడి పరిస్థితులు తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం వెబ్ కెమెరాలు ఏర్పాటు చేసింది. స్థానిక ఎన్నికలతోపాటు మున్సిపల్ ఎన్నికల్లో ఇదే విధానం ప్రవేశపెట్టేందుకు యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఈ విధానం ప్రవేశపెట్టడం రాజకీయ పార్టీలకు మింగుడు పడడం లేదు. భద్రత తక్కువగా ఉండడం, ఘర్షణలకు పాల్పడిన వారిని గుర్తించడం గతంలో ఒకింత కష్టమయ్యేది.

వెబ్ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఎటువంటి గొడవలు జరిగిన తెలిసిపోతుంది. రిగ్గింగ్ వంటి చర్యలకు పాల్పడే అవకాశం కూడా ఉండదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని వెబ్ నిఘాను ఉపయోగించవద్దని రాజకీయ నాయకులు కోరుతున్నట్లు సమాచారం. ఇప్పటికే నాయకులు, కార్యకర్తల మీద కేసులు ఉండడం మళ్లీ ఏమైన ఘర్షణలు జరిగితే వెబ్ కెమెరాకు చిక్కి అనవసరంగా ఇరుక్కుపోతామెమోనని ఆందోళన చెందుతున్నారు. ఏదైన ఈ వ్యవస్థ ద్వారా సమస్యాత్మక కేంద్రాల్లో గొడవలకు చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement