 
															అడగండి చెబుతా..
ఎన్నికల సమయంలో ఎన్నెన్నో ప్రశ్నలు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు.. కార్డులో తప్పులు.. ఉద్యోగుల ఇబ్బందులు.. వేలిపై సిరా మరకలు.. ఇంకా ఎన్నో సందేహాలు.. ఇలాంటివాటికి పరిష్కార మార్గాలను భన్వర్‌లాల్ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తారు.
	ఎన్నికల సమయంలో ఎన్నెన్నో ప్రశ్నలు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు..  కార్డులో తప్పులు.. ఉద్యోగుల ఇబ్బందులు.. వేలిపై సిరా మరకలు.. ఇంకా ఎన్నో సందేహాలు.. ఇలాంటివాటికి పరిష్కార మార్గాలను భన్వర్‌లాల్ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తారు. మీ ప్రశ్నలు మాకు పంపండి  
	- ఎలక్షన్ సెల్, సాక్షి, రోడ్ నం.1
	 బంజారాహిల్స్, హైదరాబాద్,
	లేదా ్ election@sakshi.comకు మెయిల్ చెయ్యండి.
	 
	   సర్పంచ్ ఎన్నికల ముందు నా ఓటర్ ఐడీ కార్డు పోయింది. ఓటరు లిస్టులో పేరుమాత్రం ఉంది. కార్డు లేదని ఆ ఎన్నికల్లో ఓటు వేయనీయలేదు. వచ్చే ఎన్నికల్లో నేను ఓటు వేయాలంటే ఏం చేయాలి? ఓటరు గుర్తింపు కార్డు మళ్లీ పొందడం ఎలా?
	 - పూణెం పాపయ్య, గూడూరు శివారు మర్రిమిట్ట, వరంగల్ జిల్లా
	
	జ.    ఓటర్ గుర్తింపు కార్డు పోయినా మీ పేరు ఓటర్ల జాబితాలో ఉందటున్నారు కాబట్టి మీరు ఓటు వేయవచ్చు. పోలింగ్‌కన్నా వారం ముందు మా సిబ్బంది మీకు ఓటర్ స్లిప్ ఇస్తారు. అందులో మీ ఓటు వివరాలన్నీ ఉంటాయి. ఆ స్లిప్ తీసుకెళ్లి మీరు ఓటు వేయవచ్చు. అలాగే మీ సమీపంలోని ఈ-సేవ కేంద్రానికి వెళ్లి రూ.10 రుసుము చెల్లించడం ద్వారా మీ ఓటరు గుర్తింపు కార్డును పొందవచ్చు.
	
	     ఈవీఎంల ద్వారా రిగ్గింగ్‌కు అవకాశం ఉండదా..?
	 - రఘురాం,   పాండురంగాపురం, ఖమ్మం జిల్లా..
జ. ఉండదు.
	
	    ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అనేక హామీలు ఇస్తున్నారు. తర్వాత వాటిని నెరవేర్చడం లేదు. హామీలు నెరవేర్చని అభ్యర్థులను తర్వాత ఎన్నికల్లో అనర్హులుగా ప్రకటించ వచ్చు కదా?
	 - పి.వి.రమణ,  గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడు,
	 ఏన్కూరు, ఖమ్మం జిల్లా, 9441260582
	
	 జ.    హామీలు నెరవేర్చని అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించే చట్టం మనకు లేదు. ప్రజాస్వామ్య దేశంలో చట్టాలు పార్లమెంటు మాత్రమే చేస్తుంది. మీరు ఓటు వేసేటప్పుడు ‘హామీలు నెరవేర్చని అభ్యర్థులను అనర్హులను చేసే’ చట్టం తెస్తామన్న హామీ ఇచ్చే అభ్యర్థులనే ఎన్నుకోండి. హామీలు నెరవేర్చని అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించే అధికారం ఎన్నికల సంఘానికి లేదు కానీ, హామీలను నెరవేర్చని అభ్యర్థులను ఇంటికి పంపె శక్తి మీ ఓటుకు ఉంది.
	నేను కొత్తగా ఓటు నమోదు చేసుకున్నాను. అయితే నా పేరు తెలుగు వెర్షన్‌లో తప్పుగా వచ్చింది. నాకు ఓటేసే అవకాశం ఉంటుందా లేదా?
	 -టి.లక్ష్మీప్రసన్న భారతి, అరసవల్లి, శ్రీకాకుళం జిల్లా
	 జ.    ఓటరు జాబితాలో మీ పేరు తప్పుగా వచ్చినా, మీ పేరును ధృవీకరిచే ఆధార్, రేషన్ కార్డు లాంటి సపోర్టు డాక్యుమెంట్‌ను పోలింగ్ అధికారులకు చూపడం ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
	
	    నా ఓటర్ గుర్తింపు కార్డుపై నా ఫొటోకు బదులు వేరేవారి ఫోటో అచ్చయింది. ఓటు వేయాలంటే నేనేం చేయాలి?
	 -లీలాకృష్ణ, హైదరాబాద్
	
	 జ.    ఓటర్ల జాబితాలో వేరే ఫోటో ఉన్నప్పటికీ, మీ ధృవీకరణను తెలిపే ఆధార్ లాంట్ సపోర్టింగ్ డాక్యుమెంట్ తీసుకెళితే ఓటు వేయడానికి అనుమతిస్తారు.
	
	    మా నాన్న వెంకట్రావు 2011లో మృతి చెందారు. ఓటర్ల జాబితాలో పేరు తొలగించాలని లెటర్ పెట్టాను. అయినా ఇప్పటికీ ఆయన పేరు ఓటర్ల జాబితాలో ఉంది. ఆయన పేరుతో వేరొకరు ఓటు వేసే అవకాశం లేకుండా ఆయన పేరు తొలగించాలంటే ఏం చేయాలి?    
	 -దుర్గాప్రసాద్, అరసవెల్లి
	
	 జ.    పోలింగ్ సమయానికి మా ఎన్నికల సిబ్బంది ‘ఆబ్స్‌ంట్-షిప్డెడ్-డెడ్’(ఏఎస్‌డీ) జాబితా తయారు చేస్తారు. ఆ జాబితాను పోలింగ్ రోజు పోలింగ్ బూత్ సిబ్బందికి ఇస్తారు. ఆ జాబితాలోని వారు ఎవరైనా ఓటు వేయడానకి వస్తే వారి ధృవీకరణను ప్రత్యేకంగా పరిశీలిస్తారు. ఆ పేరుతో వేరేవారు వచ్చి ఓటు వేసే అవకాశం లేకుండా చేస్తారు. ఈ జాబితాను ‘బూత్ లెవల్ ఆఫీసర్’ తయారు చేస్తార్తు. మీరు మీ బూత్ లెవల్ ఆఫీసర్ వద్దకు వెళ్లి చనిపోయిన మీ తండ్రి వివరాలు నమోదు చేయించండి.
	
	  స్థానిక సంస్థల్లో ఓటు వేసినప్పుడు వేలిపై సిరా గుర్తు వేస్తారు. అది రెండు నెలలవరకూ పోదు. ఆ గుర్తు అలాగే ఉంటే  రోజుల వ్యవధిలో వస్తున్న అసెంబ్లీ,పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేయడానికి ఇబ్బంది కదా? వేలిపై సిరా గుర్తుతో పోలింగ్‌కు వెళితే అభ్యంతరాలు వస్తే ఏం చేయాలి?
	 - గురజాల రోహిణి, రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా..
	
	 జ.    ఈ విషయంలో ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లకు ఏ వేలిపై సిరా గుర్తు వేస్తున్నారో అన్న విషయాన్ని ఎన్నికల సంఘంకు తెలుపుతాం. ఆ వేలు కాకుండా వేరే వేలుపై సార్వత్రిక ఎన్నికల్లో సిరా గుర్తు వేసేలా ఎన్నికల సంఘం అనుమతి ఇస్తుంది. ఈవిషయా న్ని త్వరలో అధికారికంగా ప్రకటిస్తాం.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
