నట్టేట ముంచాడు చంద్రబాబుపై మండిపాటు | district core committee meeting at adilabad | Sakshi
Sakshi News home page

నట్టేట ముంచాడు చంద్రబాబుపై మండిపాటు

Apr 18 2014 1:34 AM | Updated on Mar 29 2019 9:24 PM

నట్టేట ముంచాడు చంద్రబాబుపై మండిపాటు - Sakshi

నట్టేట ముంచాడు చంద్రబాబుపై మండిపాటు

సీమాంధ్రలో బీజేపీతో పొత్తు ఉండదన్న చంద్రబాబు ప్రకటనపై జిల్లాలోని బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి.

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ జిల్లా నాయకత్వం   
ఇక కమలం సహకారం ప్రశ్నార్థకం

 
 సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : సీమాంధ్రలో బీజేపీతో పొత్తు ఉండదన్న చంద్రబాబు ప్రకటనపై జిల్లాలోని బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. దేశ ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నామని ప్రకటించిన చంద్రబాబు.. రాజకీయ అవకాశం కోసం తమ పార్టీకి కూడా వెన్నుపోటు పొడవడాన్ని బీజేపీ నాయకత్వాన్ని ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. చంద్రబాబు తన నైజాన్ని మరోమారు రుజువు చేసుకున్నారని బీజేపీ జిల్లా ముఖ్య నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 ఈ మేరకు ఫలితం అనుభవిస్తారని వారు హెచ్చరిస్తున్నారు. ఈ నిర్ణయంపై జిల్లాలోని టీడీపీ అభ్యర్థులకు ఇస్తున్న తమ మద్దతు ఉపసంహరించుకునే విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని బీజేపీ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమ కమిటీ రాష్ట్ర కోకన్వీనర్ రావుల రాంనాథ్  ‘సాక్షి’తో పేర్కొన్నారు. తాజా పరిణామాలపై రాష్ట్ర పార్టీ తీసుకునే నిర్ణయం మేరకు వ్యవహరిస్తామని ఆయన తెలిపారు. కాగా రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ..

 జిల్లాలో మొదటి నుంచి బీజేపీ-టీడీపీ నాయకులు ఎడమొహం పెడమొహం మాదిరిగానే వ్యవహరిస్తున్నారు. పైగా సిట్టింగ్ ఎంపీ రాథోడ్ రమేష్ వద్ద ముడుపులు తీసుకుని జిల్లాలోని గిరిజనుల సీట్లన్నింటిని టీడీపీకి కట్టబెట్టారని బీజేపీ జిల్లా నాయకులు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయ్యనగారి భూమయ్యపై ఏకంగా దాడికి యత్నించిన విషయం సంచలనం సృష్టించిన విషయం విధితమే.

ఈ ఘటన ఆ రెండు పార్టీల ముఖ్య నేతల మధ్య తెర వెనుక జరిగిన వ్యవహారాలను బట్టబయలు చేసింది. పైగా టీడీపీకి రాజీనామా చేసి.. బీజేపీలో కొత్తగా చేరిన పాయల్ శంకర్, రమాదేవి వంటి నాయకులకు బీజేపీ సీట్లు కట్టబెట్టడం.. ఈ అభ్యర్థులు సీనియర్ నాయకులను పక్కన బెట్టడం పట్ల తీవ్ర మనస్థాపం చెందిన బీజేపీ సీనియర్ నాయకులు బుధవారం మూకుమ్మడి రాజీనామాలు ప్రకటించారు. తాజాగా ఇప్పుడు చంద్రబాబు వెన్నుపోటుతో బీజేపీ శ్రేణులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి.

 జిల్లా కోర్ కమిటీ సమావేశం
 మద్దతు విషయంలో చంద్రబాబు మాటమార్చిన నేపథ్యంలో అనుసరించాల్సిన వైఖరిపై నిర్ణయం తీసుకునేందుకు బీజేపీ జిల్లా కోర్ కమిటీ సమావేశం కావాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కాగా కొందరు ముఖ్య నాయకులు టీడీపీకి ఈ ఎన్నికల్లో మద్దతు కొనసాగించాలనే భావనలో ఉన్నారు.

ముఖ్యంగా టీడీపీ ఎంపీ అభ్యర్థి రాథోడ్ రమేష్‌తో సన్నిహిత సంబంధాలున్న బీజేపీ నాయకులు మద్దతు కొనసాగించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వ్యవహారం బీజేపీ శ్రేణులను గందరగోళానికి గురిచేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement