
బళ్లారిలో రూ.10 కోట్లు స్వాధీనం
కర్ణాటకలోని బళ్లారి, హొస్పేట పట్టణాల్లో శుక్రవారం ఓ వడ్డీ వ్యాపారి నివాసం, కార్యాలయాలలో సోదాలు నిర్వహించిన ఎన్నికల అధికారులు రూ.8.76 కోట్ల నగదు, రూ.5 కోట్ల విలువైన చెక్కులను స్వాధీనం చేసుకున్నారు.
సాక్షి, బళ్లారి: కర్ణాటకలోని బళ్లారి, హొస్పేట పట్టణాల్లో శుక్రవారం ఓ వడ్డీ వ్యాపారి నివాసం, కార్యాలయాలలో సోదాలు నిర్వహించిన ఎన్నికల అధికారులు రూ.8.76 కోట్ల నగదు, రూ.5 కోట్ల విలువైన చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. ఆదాయపు పన్ను శాఖ, ఎన్నికల సంఘం అధికారులతోపాటు జిల్లా అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేకాధికారి పొన్నురాజ్ విలేకరులకు వెల్లడించిన వివరాల మేరకు... బళ్లారి గణేష్ కాలనీకి చెందిన బాబూలాల్ పరశురాం పూరియా అలియాస్ చోర్ బాబూలాల్ అనే వడ్డీ వ్యాపారి, ఆయన కుమారుడు రమేష్ పరశురాం పూరియా ఇళ్లలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకూ సోదాలు నిర్విహి౦చారు. రూ.8.52 కోట్ల నగదు, 600 గ్రాముల బంగారం, రూ.5 కోట్ల చెక్కులు, రూ.5 కోట్ల విలువైన బాండ్లు స్వాధీనం చేసుకున్నారు. చోర్ బాబూలాల్‌కు అన్ని పార్టీల నేతలతో సంబంధాలున్నాయి.
అయితే అతని ఇంట్లో బీజేపీకి చెందిన రెండు కరపత్రాలు లభించడంతో వాటిని పోలీసులు మీడియా ముందు ఉంచడం గమనార్హం. అలాగే శుక్రవారం రాత్రి హొస్పేట పట్టణంలో ఎన్నికల సంఘం అధికారులు విక్రమ్ జైన్ అనే వ్యక్తి దుకాణంలో తనిఖీలు చేయగా రూ.1.22 కోట్లు పట్టుబడ్డాయి. తర్వాత జైన్ ఇంటివద్ద కూడా కారులో రూ.22 లక్షలను స్వాధీనం చేసుకుని ఆయనను అరెస్టు చేశారు. వీరిపై ఐపీసీ 171-ఈ, 188 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.