పుణేలో రీపోలింగ్ జరపాలి | Amol Palekar moves to high court over deleted voters list | Sakshi
Sakshi News home page

పుణేలో రీపోలింగ్ జరపాలి

May 2 2014 11:00 PM | Updated on Sep 2 2017 6:50 AM

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రీపోలింగ్ జరపాలని బోంబే హైకోర్టులో మరో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

ముంబై: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రీపోలింగ్ జరపాలని బోంబే హైకోర్టులో మరో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. నటుడు, దర్శకుడు అయిన అమోల్ పాలేకర్, అతడి భార్య సంధ్యా గోఖలే కలిసి ఈ పిల్‌ను వేశారు. ఏప్రిల్ 17వ తేదీన పుణేలో జరిగిన లోక్‌సభ ఎన్నిక సమయంలో తమ ఓట్లు గల్లంతుపై వీరిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. తాము ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకున్నామని, అప్పుడు ఓటర్ల లిస్టులో ఉన్న తమ పేర్లు లోక్‌సభ ఎన్నికల సమయంలో గల్లంతు కావడంపై వారు కోర్టును ఆశ్రయించారు. కాగా ఈ కేసు మే 6వ తేదీన విచారణకు రానుంది.

 లోక్‌సభ ఎన్నికల్లో పుణే నియోజకవర్గం నుంచి ప్యూపుల్స్ గార్డియన్ పార్టీ తరఫున మాజీ ఐఏఎస్ అధికారి అయిన అరుణ్ భాటియా పోటీచేశారు. అయితే పుణేలో వేలాది మంది నిజమైన ఓటర్ల పేర్లు గల్లంతు కావడంతో వారు తమ ఓటుహక్కును వినియోగించుకోలేకపోయారని ఆయన ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. పుణేలో తిరిగి పోలింగ్ నిర్వహించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని ఆ పిల్‌లో కోరారు. కాగా, భాటియా వేసిన పిటిషన్‌కు అమోల్ పాలేకర్ పిటిషన్‌ను జతపరిచేందుకు జస్టిస్ అభయ్ ఓకా అంగీకరించారు.

కాగా, ఓటర్ల జాబితానుంచి పేర్లు గల్లంతైన పలువురికి ఓటర్ కార్డులున్నాయని, ఇటీవలే జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వారందరూ తమ ఓటుహక్కు వినియోగించుకున్నారని, కాని ఏప్రిల్ 17న జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో వారి పేర్లు గల్లంతు కావడం ఆశ్చర్యమేసిందని భాటియా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఓటర్ల లిస్టు తయారీ సమయంలో ఎన్నికల అధికారులు నియమ నిబంధనలను సక్రమంగా పాటించలేదని ఆయన ఆరోపించారు. పేర్లు గల్లంతైన ఓటర్లలో చాలామంది కొన్నేళ్లుగా అవే ఇళ్లల్లో నివాసముంటున్నవారేనని ఆయన నివేదించారు.

జనాభా గణన సమయంలో అధికారులు ఎటువంటి నియమనిబంధనలు పాటించారో, పేర్లు తొలగించేటప్పుడు సదరు ఓటర్లకు వారు సమాచారమిచ్చారా లేదా వంటి విషయాలపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికైనా ప్రస్తుతం గల్లంతైన ఓటర్ల పేర్లను సవరించి తిరిగి ఓటర్ల జాబితాను ప్రచురించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని హైకోర్టును కోరారు. ఇదిలా ఉండగా, ఇటువంటి కేసులే ఒకటి ముంబై నుంచి, మరొకటి పుణే నుంచి హైకోర్టులో విచారణకు వచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement