నప్పే కొలువు.. నచ్చే కంపెనీ.. | World Competition jobs | Sakshi
Sakshi News home page

నప్పే కొలువు.. నచ్చే కంపెనీ..

Oct 9 2016 2:54 AM | Updated on Sep 4 2017 4:40 PM

నప్పే కొలువు.. నచ్చే కంపెనీ..

నప్పే కొలువు.. నచ్చే కంపెనీ..

నేటి పోటీ ప్రపంచంలో నైపుణ్యాలున్న వారికి అవకాశాలు అపారం.మరి ఆ అవకాశాల్లో దేన్ని ఎంపిక చేసుకోవాలో తెలియని సందిగ్ధత.

నేటి పోటీ ప్రపంచంలో నైపుణ్యాలున్న వారికి అవకాశాలు అపారం.మరి ఆ అవకాశాల్లో దేన్ని ఎంపిక చేసుకోవాలో తెలియని సందిగ్ధత. మరోవైపు రూ.లక్షల ప్యాకేజీతో ఉద్యోగంలో చేరినా..  కొద్దిరోజుల్లోనే నిరాసక్తతకు గురవుతున్న పరిస్థితి. ఈ క్రమంలో అన్ని విధాలా సరితూగే  కొలువును ఎంపిక చేసుకోవాలన్నది నిపుణుల సూచన. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ సీజన్ ఊపందుకుంటున్న తరుణంలో సరైన కొలువు ఎంపికకు నిపుణుల సూచనలు..
 
 ఆసక్తికి ప్రాధాన్యం
ఉద్యోగ ఎంపికలో అభ్యర్థులు మొదట తమ వ్యక్తిగత ఆసక్తికి ప్రాధాన్యమివ్వాలి. ఉదాహరణకు ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో ఎంబీఏ చేసిన విద్యార్థులకు అకౌంటింగ్, ఆడిటింగ్ నుంచి పోర్ట్ ఫోలియో మేనేజ్‌మెంట్ వరకు జాబ్ ప్రొఫైల్స్ ఉన్నాయి. వీటిలో తాము ఇష్టంగా పనిచేస్తూ, నైపుణ్యాలు పెంపొందించుకుంటూ మెరుగైన పనితీరుతో కెరీర్‌లో దూసుకెళ్లేందుకు దోహదపడే కొలువులో చేరడం మేలు. దీంతోపాటు జాబ్ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సిన మరో ప్రధానాంశం వ్యక్తిగత సామర్థ్యం. ఆయా జాబ్ ప్రొఫైల్స్ పరంగా విధుల్లో మంచి పనితీరు కనబరిచే సామర్థ్యం ఉందా? అనే దానిపైనా స్పష్టత అవసరం.
 
 సీనియర్లను సంప్రదించి..
 మంచి ఉద్యోగం ఎంపిక విషయంలో అభ్యర్థులు అప్పటికే ఆయా సంస్థల్లో పనిచేస్తున్న సీనియర్లు లేదా ఆయా రంగాల నిపుణులను సంప్రదించాలి. తమ ఆసక్తి, అకడమిక్ నైపుణ్యాలను తెలియజేసి, సరైన గెడైన్స్ తీసుకోవాలి. అవసరమైతే కెరీర్ కౌన్సిలర్లను సంప్రదించాలి. ప్రస్తుతం సరైన ఉద్యోగం ఎంపికకు అందుబాటులోకి వచ్చిన ముఖ్యమైన సాధనం.. సైకోమెట్రిక్ టెస్ట్‌లు. వివిధ జాబ్‌సెర్చ్ పోర్టల్స్, కెరీర్ కన్సల్టెన్సీలు సైకో మెట్రిక్ టెస్ట్‌లను నిర్వహిస్తున్నాయి. వీటిలో అభ్యర్థుల ప్రదర్శన ఆధారంగా ఆయా డొమైన్ ఏరియాలో సరితూగే ప్రొఫైల్స్‌ను సూచిస్తున్నాయి. వీటిని కూడా ఉపయోగించుకోవచ్చు.
 
 స్వీయ విశ్లేషణ
 అభ్యర్థులు తమ ప్రాక్టికల్ నైపుణ్యాలకు సంబంధించి స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. ముఖ్యంగా ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్‌మెంట్, లా తదితర విభాగాలకు చెందిన జాబ్ ప్రొఫైల్స్‌కు క్షేత్ర నైపుణ్యాలు అవసరం. ఒకవేళ సరైన స్థాయిలో ప్రాక్టికల్ స్కిల్స్ లేవనుకుంటే.. నిర్వహణ పరమైన ప్రొఫైల్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు న్యాయశాస్త్ర పట్టభద్రులను పరిగణనలోకి తీసుకుంటే.. న్యాయవాద వృత్తిలో రాణించే నైపుణ్యాలు లేవని భావిస్తే.. కంపెనీల లీగల్ విభాగాల్లో లీగల్ అడ్వయిజర్స్, లీగల్ మేనేజర్స్ తదితర ఉద్యోగాల్లో చేరొచ్చు. కొన్ని ఉద్యోగాలకు రెగ్యులర్ అప్‌డేషన్ స్కిల్స్ పెంపొందించుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా టెక్నికల్, సాఫ్ట్‌వేర్, మ్యానుఫ్యాక్చరింగ్ విభాగాల్లో కొత్త మార్పులు, టెక్నాలజీపై అవగాహన పెంచుకుంటేనే కెరీర్‌లో ముందంజలో నిలిచేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు కొత్త అంశాలు నేర్చుకునే ఆసక్తి ఉంటేనే అలాంటి జాబ్ ప్రొఫైల్స్‌ను ఎంపిక చేసుకోవాలి.
 
 పని సంస్కృతి
 వ్యక్తిగత ఆసక్తి, ప్రాక్టికల్ సామర్థ్యం, రెగ్యులర్ అప్‌డేషన్ తదితర అంశాల్లో మెరుగ్గా ఉన్నా.. కొన్ని సందర్భాల్లో సంస్థల విధివిధానాలు, పని సంస్కృతి కూడా కెరీర్‌పై ప్రభావం చూపుతాయి. కాబట్టి ఒక సంస్థకు దరఖాస్తు చేసుకునే ముందు ఆయా కంపెనీల పని సంస్కృతి గురించి తెలుసుకోవాలి. అది తమ వ్యక్తిగత, మానసిక స్థితికి అనుకూలంగా ఉంటేనే ముందడుగు వేయాలి. ప్రస్తుతం సంస్థకున్న బ్రాండ్ ఇమేజ్ కారణంగా రాజీపడి ఆఫర్‌ను అంగీకరిస్తే.. భవిష్యత్తులో సంస్థలో ఇమడలేక వెనుదిరగాల్సి వస్తుంది.
 
 ప్లేస్‌మెంట్స్ ఆఫర్
  ప్రస్తుతం యువతకు కొలువుకు తొలి మార్గం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్. ఇందులో పాల్గొనడానికి ముందు అభ్యర్థులు తమకు సరితూగే జాబ్ ప్రొఫైల్‌పై స్పష్టత ఏర్పరచుకోవాలి. ఈ క్రమంలో క్యాంపస్ ప్లేస్‌మెంట్ సెల్స్‌ను వీలైనంత ముందుగా సంప్రదించి.. డ్రైవ్స్ నిర్వహించనున్న సంస్థలు, వాటి విధానాలు, అవి ఆఫర్ చేయనున్న జాబ్స్, ప్రొఫైల్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే క్యాంపస్ డ్రైవ్స్‌లో పాల్గొనే సంస్థలు రెండు, మూడు రోజుల వ్యవధిలోనే      ఆ ప్రక్రియను ముగిస్తాయి. ఈ స్వల్ప వ్యవధిలో సదరు సంస్థ తమకు సరితూగుతుందనే అంచనాకు రావడం ఉద్యోగార్థులకు అంత సులభం కాదు.
 
 ప్యాకేజీల మాయలో పడొద్దు..
  ప్రతి వ్యక్తికి కెరీర్ పరంగా నిర్దిష్టంగా కొన్ని లక్ష్యాలు ఉంటాయి. వాస్తవానికి సంస్థలు కూడా ఉద్యోగ ఇంటర్వ్యూల సమయంలో ‘మీ ఫ్యూచర్ గోల్ ఏమిటి?’ అని ప్రశ్నించడం రివాజుగా మారింది. ఒక ఉద్యోగాన్ని ఎంపిక చేసుకునేముందు తాము అప్పటికే ఏర్పరచుకున్న భవిష్యత్తు లక్ష్యం సాధించేందుకు ఆయా సంస్థల్లో అవకాశాలు ఎంతవరకు ఉంటాయో విశ్లేషించుకోవాలి. ఇటీవల కాలంలో యువత చేస్తున్న ప్రధాన పొరపాటు.. అధిక ప్యాకేజీలకు ఆకర్షితులై సంస్థలు ఇచ్చే ఆఫర్స్‌ను వెంటనే అంగీకరించడం. కానీ, తర్వాత కొద్దిరోజులకే సంస్థ వాతావరణంలో ఇమడలేక కెరీర్ మార్చుకోవాలని ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. కాబట్టి ప్యాకేజీకే ప్రాధాన్యం అనే ధోరణి వీడి.. వ్యక్తిగత ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
 
 పరిగణనలోకి
 తీసుకోవాల్సిన అంశాలు
 వ్యక్తిగత ఆసక్తి
 సంస్థల విధివిధానాలు
 సంస్థలో అంతర్గత పని సంస్కృతి
 ఆఫర్ చేసిన జాబ్ ప్రొఫైల్, జాబ్ రోల్
 కెరీర్ వృద్ధి అవకాశాలు
 విధుల పరంగా లభించే ప్రాధాన్యం
 నైపుణ్యాల ప్రదర్శనకు లభించే
 అవకాశం
 డెసిషన్ మేకింగ్‌లో లభించే ప్రాధాన్యం
 
 ప్రస్తుతం నైపుణ్యాలున్న యువతకు అవకాశాలు అనేకం. వాటిని ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. మంచి సంస్థను అన్వేషించే క్రమంలో అప్రమత్తంగా ఉండాలి. జాబ్ సెర్చ్ పోర్టల్స్, కన్సల్టెన్సీల ద్వారా ఉద్యోగాన్వేషణ చేస్తున్న అభ్యర్థులు ముందుగానే తమ ‘ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్’ను పేర్కొనడం మేలు. దీనివల్ల వారికి వచ్చే జాబ్ అలెర్ట్స్ సంబంధిత రంగాలకు సంబంధించినవే ఉంటాయి. క్యాంపస్ హైరింగ్స్ అయినా.. ఓపెన్ జాబ్ మార్కెట్లో అయినా.. ఉద్యోగం ఎంపిక పరంగా వ్యక్తిగత ఆసక్తికి తొలి ప్రాధాన్య
 మివ్వాలి.
 - ఎం.రామకృష్ణ,
 ఎండీ, జెడ్‌సీఎస్ కన్సల్టింగ్ లిమిటెడ్.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement