ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ విజేతలు జొకోవిచ్, సెరెనా

ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ విజేతలు జొకోవిచ్, సెరెనా


 క్రీడలు:

పతక విజేతలకు పెరిగిన నగదు బహుమతి

ఒలింపిక్, ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించే క్రీడాకారులకు ఇచ్చే నగదు బహుమతిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకానికి ఇచ్చే రూ. 50 లక్షలను రూ. 75 లక్షలకు పెంచారు. రజతానికి రూ. 30 లక్షల నుంచి రూ. 50 లక్షలకు, కాంస్య పతకానికి రూ. 20 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచారు. ఆసియా, కామన్వెల్త్ క్రీడలకు సంబంధించి స్వర్ణ పతకానికి రూ.30 లక్షలు, రజతానికి రూ.20 లక్షలు, కాంస్య పతకానికి రూ.10 లక్షలు అందజేస్తారు. గతంలో ఇవి వరుసగా రూ. 20 లక్షలు, రూ.10 లక్షలు, రూ. ఆరు లక్షలుగా ఉండేవి. 2016లో రియోడి జెనీరోలో ఒలింపిక్స్ జరగనున్నాయి.

 

 భారత్‌లో 2016-టీ 20 ప్రపంచకప్

 క్రికెట్ టీ 20 ప్రపంచకప్-2016 భారత్‌లో జరగనుంది. దుబాయ్‌లో జనవరి 29న జరిగిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సమావేశంలో దీనికి ఆమోదం లభించింది. 2016లో మార్చి 11 నుంచి ఏప్రిల్ 3 వరకు మ్యాచ్‌లు జరుగుతాయి.

 

 ప్రపంచకప్‌కు భారత మేనేజర్‌గా అయూబ్

 ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో భారత జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించిన హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్షద్ అయూబ్‌కు వెంటనే మరో అరుదైన అవకాశం లభించింది. వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే జట్టుకు అయూబ్ మేనేజర్‌గా ఎంపికయ్యారు.

 

 భారత హాకీ జట్టు కోచ్‌గా పాల్ వాన్ యాస్

 భారత పురుషుల హాకీ జట్టు కొత్త కోచ్‌గా నెదర్లాండ్స్ మాజీ కోచ్ పాల్ వాన్ యాస్‌ను... మహిళల టీమ్‌కు ఆంథోని థోర్న్‌టన్ (న్యూజిలాండ్)ను ఎంపిక చేశారు. టెర్రీ వాల్ష్, నీల్ హావ్‌గుడ్ స్థానంలో ఈ ఇద్దరు బాధ్యతలు తీసుకుంటారు. మూడేళ్ల పాటు (2018) ఈ ఇద్దరు కాంట్రాక్ట్‌లో ఉండనున్నారు.

 

 ఆసియా కప్ విజేత ఆస్ట్రేలియా

 తొలిసారి ఫుట్‌బాల్ ఆసియా కప్‌ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. జనవరి 31న జరిగిన ఫైనల్లో కొరియాపై విజయం సాధించింది.

 

 ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతలు

 పురుషుల సింగిల్స్: ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా).. ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచాడు. ఫిబ్రవరి 1న జరిగిన ఫైనల్లో జొకోవిచ్ ఆరో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)పై విజయం సాధించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను అత్యధికంగా ఐదుసార్లు నెగ్గిన తొలి క్రీడాకారుడిగా జొకోవిచ్ రికార్డు సాధించాడు. మొత్తంమీద జొకోవిచ్ కెరీర్‌లో ఇది ఎనిమిదో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్.

 

 పురుషుల డబుల్స్: సిమోన్ బొలెలీ-ఫాబియో ఫాగ్‌నిని (ఇటలీ) జంట విజేతగా నిలిచింది.

 మహిళల సింగిల్స్: అమెరికా టెన్నిస్ క్రీడాకారిని సెరెనా విలియమ్స్ విజేతగా నిలిచింది. సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ మరియా షరపోవా (రష్యా)పై విజయం సాధించింది. 33 ఏళ్ల సెరెనాకిది ఆరో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్.మహిళల డబుల్స్: బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా), లూసీ సఫరోవా (చెక్) జంట విజయం సాధించింది.

 

 మిక్స్‌డ్ డబుల్స్: లియాండర్ పేస్(భారత్), మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఏడో సీడ్ పేస్-హింగిస్ ద్వయం.. డిఫెండింగ్ చాంపియన్ జంట డానియల్ నెస్టర్(కెనడా)-క్రిస్టినా మ్లడెనోవిచ్ (ఫ్రాన్స్)ను ఓడించింది.

 

 తిరువనంతపురంలో 35వ జాతీయ క్రీడలు

 35వ జాతీయ క్రీడలు కేరళలోని తిరువనంతపురంలో జనవరి 31న ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 14 వరకు జరిగే ఈ క్రీడల్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 10 వేల మంది పాల్గొంటున్నారు. ఈ జాతీయ క్రీడల అధికారిక మస్కట్ ది గ్రేట్ ఇండియన్ హార్న్‌బిల్.


అంతర్జాతీయం:  

 ఇటలీ నూతన అధ్యక్షుడిగా సెర్గియో మతారెల్లా

ఇటలీ రాజ్యాంగ కోర్టు జడ్జి సెర్గియో మతారెల్లా(73) ఆ దేశ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో నిర్వహించిన నాలుగో దఫా ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా జనవరి 31న ఎన్నికయ్యారు. మొత్తం 1009 ఓట్లకు 665 ఓట్లు సాధించి మతారెల్లా విజయం సాధించారు. సిసిలీ మాఫియా చేతిలో తన సోదరుని హత్యానంతరం మతారెల్లా క్రిస్టియన్ డెమోక్రటిక్ తరఫున 1980లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. పలు కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు.

 

 అడిస్ అబాబాలో ఏయూ సదస్సు

 54 దేశాలకు సభ్యత్వం ఉన్న ఆఫ్రికన్ యూనియన్ (ఏయూ) రెండు రోజుల వార్షిక సదస్సు ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాలో జరిగింది. ఆఫ్రికా ఖండం భద్రతకు, రక్షణకు, అభివృద్ధికి తీవ్రవాదం ముఖ్యంగా బోకో హరమ్ తీవ్రవాద సంస్థ చర్యలు ముప్పుగా పరిణమించడంపై సదస్సులో చర్చించా రు. ఇది నైజీరియా నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని అణచివేతకు దళాలను పంపాలని సభ్యదేశాలు నిర్ణయించాయి.

 

 రాష్ట్రీయం:

 వరంగల్ ఇక ‘గ్రేటర్’

 వరంగల్ నగరాన్ని ‘గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్’గా మారుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం జనవరి 28న ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ ఏర్పాటుతో 42 గ్రామ పంచాయతీలు వరంగల్‌లో విలీనమయ్యాయి, దీంతో నగర జనాభా 10 లక్షలకు చేరుకుంది. జీహెచ్‌ఎంసీ తర్వాత రాష్ట్రంలో రెండో గ్రేటర్ నగరంగా వరంగల్‌కు గుర్తింపు లభించింది.

 

 ఉత్తమ వర్సిటీగా హెచ్‌సీయూకు అవార్డు:

 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ‘ఉత్తమ విశ్వ విద్యాలయం’ విభాగంలో విజిటర్స్ అవార్డుకు ఎంపికైంది. ఈ మేరకు జనవరి 29న రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు సందర్శకునిగా వ్యవహరిస్తున్న రాష్ట్రపతి ‘ఉత్తమ విశ్వవిద్యాలయం’, ‘నవీకరణ’, ‘పరిశోధన’ విభాగాలలో వాటికి విజిటర్స్ అవార్డులు అందజేస్తారు.

 

 శాప్ చైర్మన్‌గా పీఆర్ మోహన్: ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్‌గా పీఆర్ మోహన్ నియమితులయ్యారు. ఈ మేరకు యువజన సర్వీసులు, క్రీడల శాఖ కార్యదర్శి శశాంక్ గోయల్ జనవరి 28న ఉత్తర్వులు జారీ చేశారు.

 

 ఆస్ట్రియా సంస్థతో నీటిపారుదల సంస్థ ఒప్పందం: ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో సాంకేతికపరంగా సహకారానికి ఆస్ట్రియా విద్యుత్, పర్యావరణ సాంకేతిక సంస్థ జీఎంబీహెచ్‌తో ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ (ఏపీఐడీసీ) ఫిబ్రవరి 2న ఒప్పందం కుదుర్చుకుంది.

 

 జాతీయం

 

 గాంధీనగర్‌లో ‘ఈ-గవర్నెన్స్’ సదస్సు

 గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జనవరి 30, 31 తేదీల్లో ఈ-గవర్నెన్స్‌పై 18వ జాతీయ సమావేశాలు జరిగాయి. వీటి ఇతివృత్తం ‘డిజిటల్ గవర్నెన్స్-న్యూ ఫ్రాంటియర్’. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పించన్ల మంత్రిత్వశాఖలోని పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం; కమ్యూనికేషన్స్, ఐటీ మంత్రిత్వశాఖలోని ఎలక్ట్రానిక్స్, ఐటీ విభాగం సంయుక్తంగా సమావేశాలను నిర్వహించాయి. ఈ-గవర్నెన్స్ కోణంలో ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగంలో యువతకు నైపుణ్యాభివృద్ధిపై ప్రధానంగా చర్చించారు.

 

 2013-14లో జీడీపీ వృద్ధి 6.9 శాతం

 దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ని 2013-14లో 6.9 శాతానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 30న సవరించింది. దీన్ని గతంలో 4.7 శాతంగా పేర్కొంది. జీడీపీ గణాంకాలకు సంబంధించి ఆధార సంవత్సరాన్ని (బేస్ ఇయర్) 2004-05 నుంచి 2011-12కు

 మార్చడంతో జీడీపీలో మార్పు వచ్చింది. 2012-13 జీడీపీ వృద్ధి రేటు 4.5 శాతం నుంచి 5.1 శాతానికి చేరింది. 2010లో 2004-05ను బేస్ ఇయర్‌గా నిర్ణయించారు. ఇప్పటి వరకు ఆధారసంవత్సరాన్ని పదేళ్లకోసారి మార్చేవారు. దీన్ని ఐదేళ్లకోసారి మార్చాలని జాతీయ గణాంకాల కమిషన్ (ఎన్‌ఎస్‌సీ) సిఫార్సు చేయడంతో తాజా మార్పు జరిగింది.

 

 ‘స్వచ్ఛ భారత్’పై తపాలాబిళ్లలు

 మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని జనవరి 30న కేంద్ర ప్రభుత్వం ‘స్వచ్ఛ భారత్ మిషన్’ ఇతివృత్తంతో న్యూఢిల్లీలో స్మారక తపాలాబిళ్లలను విడుదల చేసింది. ఇవి కేంద్ర కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ద్వారా విడుదలయ్యాయి. స్వచ్ఛ భారత్‌పై చిన్నారులకు పోటీలను నిర్వహించి, తపాలాబిళ్లల డిజైన్లను తపాలా శాఖ ఖరారు చేసింది.

 

వార్తల్లో వ్యక్తులు

     భారత విదేశాంగ కార్యదర్శిగా జైశంకర్

     అమెరికాలో భారత రాయబారిగా పనిచేస్తున్న ఎస్.జైశంకర్‌ను భారత విదేశాంగ కార్యదర్శిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం జనవరి 28న నిర్ణయం తీసుకుంది. 1977 ఐఎఫ్‌ఎస్ బ్యాచ్‌కు చెందిన జైశంకర్ రెండేళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారని వెల్లడించింది.

 

     సంగీత నాటక అకాడమీ చైర్మన్‌గా శేఖర్‌సేన్

     కేంద్ర సంగీత నాటక అకాడమీ నూతన చైర్మన్‌గా ప్రముఖ సంగీతకారుడు, నాటక దర్శకుడు శేఖర్‌సేన్ నియమితులయ్యారు. ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. దీనికి సంబంధించి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ జనవరి 28న ఉత్తర్వులిచ్చింది.

 

     హెచ్‌ఏఎల్ చైర్మన్‌గా తెలుగు వ్యక్తి

     {పభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ (హెచ్‌ఏఎల్) చైర్మన్‌గా తెలుగు వ్యక్తి టి.సువర్ణ రాజు(56) జనవరి 30న బాధ్యతలు స్వీకరించారు. పదవీ విరమణ పొందిన ఆర్‌కే త్యాగి స్థానంలో ఆయన నియమితులయ్యారు. టెక్నాలజీ దిగ్గజంగా, విజ్ఞాన ఖనిగా హాల్ సంస్థను తీర్చిదిద్దడంపై దృష్టి సారిస్తానని సువర్ణ రాజు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు సమీపంలోని పి.వేమవరం రాజు స్వగ్రామం.

 

     సీఆర్‌పీఎఫ్ డెరైక్టర్ జనరల్‌గా దుర్గా ప్రసాద్

     కేంద్ర రిజర్వ్ పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్) ప్రత్యేక డెరైక్టర్ జనరల్‌గా ఐపీఎస్ అధికారి కె.దుర్గాప్రసాద్ జనవరి 29న బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఆయన 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. గతంలో ప్రత్యేక భద్రతా దళం (ఎస్‌పీజీ) డెరైక్టర్‌గా పనిచేశారు.

 

     ఐటీబీపీ డీజీగా కృష్ణ చౌదరి

     ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) నూతన డెరైక్టర్ జనరల్‌గా ఐపీఎస్ అధికారి కృష్ణ చౌదరి జనవరి 30న నియమితులయ్యారు. కృష్ణ చౌదరి 1979 బ్యాచ్ బీహార్ కేడర్ ఐపీఎస్ అధికారి. 1962, అక్టోబర్ 24న ఏర్పడిన ఐటీబీపీ.. దేశ సరిహద్దుల వద్ద భద్రతా విధులను నిర్వహిస్తోంది.

 సైన్స్ అండ్ టెక్నాలజీ

 

     అగ్ని-5 విజయవంతం

     ఐదువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని-5’ను సైన్యం మొబైల్ లాంచర్ నుంచి జనవరి 31న విజయవంతంగా ప్రయోగించింది. టన్ను బరువుగల అణ్వస్త్రాన్ని మోసుకుపోగల దీన్ని మొబైల్ లాంచర్ నుంచి ప్రయోగించడం ఇదే తొలిసారి. ఒడిశాలో వీలర్ ఐలాండ్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి క్షిపణిని ప్రయోగించారు. సాధారణంగా క్షిపణులను ఒకే చోట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శాశ్వత ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగిస్తారు. దీన్ని సులువుగా గుర్తించడంతో పాటు శత్రువులు దాడి చేసేందుకు అవకాశముంటుంది. అదే మొబైల్ లాంచర్ వెర్షన్ రహస్యంగా తరలించి, ప్రయోగించవచ్చు. అగ్ని-5 క్షిపణి బరువు 50 టన్నులు, పొడవు 17 మీటర్లు, వెడల్పు 2 మీటర్లు.

 

 క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన పాకిస్థాన్

 అణ్వస్త్రాన్ని మోసుకెళ్లే సామర్థ్యమున్న రాద్ క్రూయిజ్ క్షిపణిని పాకిస్థాన్ ఫిబ్రవరి 2న విజయవంతంగా పరీక్షించింది. ఇది 350 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top