నీటి విడుదల

నీటి విడుదల

  • ఎస్సారెస్పీ నుంచి ఎల్‌ఎండీలోకి..

  • విడుదల చేసిన మంత్రులు ఈటల, పోచారం

  • కాకతీయ, వరద కాల్వల ద్వారా 8,200 క్యూసెక్కులు

  • ఎల్‌ఎండీలో 25 టీఎంసీల నీరు లక్ష్యంగా విడుదల

  • వరంగల్, కరీంనగర్‌ జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు నీరు

  • శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో 47 టీఎంసీలకు చేరిన నీరు

  • త్వరలోనే ఎస్సారెస్పీకి 50 టీఎంసీల నీరు : మంత్రి ఈటల

  • మల్లన్నసాగర్‌కు ప్రజలే అండ.. ఆరు గ్రామాల ప్రజలకు పాదాభివందనం : మంత్రి పోచారం

  • సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌/బాల్కొండ : నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరామ సాగర్‌ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) నుంచి కరీంనగర్‌ జిల్లాలోని లోయర్‌ మానేర్‌ డ్యాం(ఎల్‌ఎండీ)కు బుధవారం రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. కాకతీయ కెనాల్‌ ద్వారా 2,200  క్యూస్కెకులు, వరద కాలువ ద్వారా మరో 6,000  క్యూస్కెల నీటిని ఎల్‌ఎండీకి విడుదల చేశారు. గురువారం వరదకాల్వ నుంచి అదే 6,000 క్యూసెక్కుల నీరు వెళ్లనుండగా, కాకతీయ కాల్వ నుంచి మాత్రం 4,400 క్యూసెక్కులు పెరగనుందని అధికారులు తెలిపారు. ఎస్సారెస్పీలోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరడంతో మంగళవారం 46 టీఎంసీలకు చేరింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం, నీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌రావు సూచన మేరకు నీటిని విడుదల చేసినట్లు మంత్రులు ప్రకటించారు. ఎల్‌ఎండీలో 25 టీఎంసీల నీరు చేరితే.. అక్కడి నుంచి వరంగల్, కరీంనగర్‌ జిల్లాల్లోని 6 లక్షల ఎకరాలకు సాగు నీటిని సరఫరా చేయనున్నారు. ఈ సందర్భంగా ఎస్సారెస్పీ నీటి విడుదల అనంతరం మంత్రులు ‘మీడియా’తో మాట్లాడారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుపైన ఉన్న మహారాష్ట్ర ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి నీరు చేరినందున అక్కడి నుంచి పెద్ద ఎత్తున ఇన్‌ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. ఇప్పటికి ప్రాజెక్టులో 50 టీఎంసీల నీరు చేరుకున్నదని మంత్రులు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఈటెల రాజేందర్‌లు వివరించారు. ఇంకా వస్తున్న ఇన్‌ఫ్లో వల్ల ప్రాజెక్టులోకి పూర్తి స్థాయిలో నీరు వచ్చే అవకాశం ఉన్నదని ఆశిస్తున్నామని, తద్వారా ఎల్‌ఎండీ ప్రాజెక్టులోకి 25 టీఎంసీల నీటిని విడుదల చేయడానికి అవకాశం ఉందన్నారు. ఈ శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి వచ్చే నీటి వల్ల వరంగల్, కరీంనగర్‌తోపాటు నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాలకు కూడా సాగునీరు లభిస్తుందన్నారు.

    నిజమాబాద్‌ జిల్లా దేశానికే ఆదర్షం : ఈటల

    పంటలు పండించడంలో నిజమాబాద్‌ జిల్లా దేశానికే ఆదర్శమని  ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. బుధవారం బాల్కొండ మండలంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు.. జిల్లాలో అంకాపూర్, అంక్సాపూర్‌ వంటి గ్రామాల్లో పసుపు, ఇతర పంటలు పండించడంతో జిల్లా దేశానికే ఆదర్శమైందన్నారు. తెలంగాణాలోని ప్రతి గ్రామం అంకాపూర్‌ల సాగులో ముందుండాలనే మల్లన్న సాగర్‌ నిర్మాణం చేపడుతున్నామన్నారు. వ్యవసాయ రంగంలో ప్రతి ఎకరానికి నీరందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ఉన్నారన్నారు. ప్రతి పక్షాలకు రాజకీయ భవిష్యత్తు ఉండదని కాంగ్రెస్, టీడీపీ పార్టీలు మల్లన్న సాగర్‌కు అడ్డుపడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఎలా ఉంటుందో ప్రస్తుతం చూస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమానికి నిజమాబాద్‌ జిల్లా మొదటి నుంచి అండగా నిలిచిందన్నారు. అందుకే జిల్లాలో 9 మంది నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించారన్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయుటకు కృషి చేస్తానన్నారు.

    మల్లన్నసాగర్‌కు ప్రజలే అండ : పోచారం

    మల్లన్న సాగర్‌ను అడ్డుకుంటే కాంగ్రెస్, టీడీపీలకు పుట్టగతులుండవని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నిండాలంటే ఆగస్టు వరకు ఆగాల్సి వచ్చిందంటే గోదావరి ఎగువ ప్రాంతంలో అనేక ప్రాజెక్ట్‌లు నిర్మించడం వల్లనే అన్నారు.  అలా కాకుండా రైతులకు సకాలంలో నీరందించాలనే శాశ్వత పరిష్కారం కోసం మల్లన్న సాగర్‌ నిర్మాణం చేపడుతున్నామన్నారు. కాళేశ్వరం వద్ద ప్రాణహిత నుంచి జూన్‌–జూలై చివరి వరకు 1000 టీఎంసీల నీరు సముద్రం పాలైందన్నారు. అలా వృథా కాకుండా నీటిని మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించి మల్లన్న సాగర్‌కు మళ్లించుటకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. మల్లన్న సాగర్‌ నిర్మాణంలో ముంపునకు గురవుతన్న ఆరు గ్రామాల ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని ప్రకటించారు. మల్లన్న సాగర్‌ నుంచి నీళ్లు తెచ్చి ఎస్సారెస్పీ నింపుతామన్నారు. ఈ కార్యక్రమాల్లో మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి, కోరుట్ల ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర రైతు విభాగం అ«ధ్యక్షుడు వేముల సురేందర్‌రెడ్డి, ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌ సీఈ శంకర్, ఎస్‌ఈ సత్యనారాయణ, ఈఈ రామారావు, ఆర్డీవో యాదిరెడ్డి, జెన్‌కో డైరెక్టర్‌ వెంకటరత్నం, సీఈ మురళీధర్‌రావు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ముత్యాల లక్ష్మారెడ్డి, కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌ కమిటీల చైర్మన్లు ఎడవల్లి కొండాల్‌ రెడ్డి, రమేష్‌యాదవ్, ఎంపీపీ అర్గుల్‌ రాధా, వైస్‌ ఎంపీపీ  శేఖర్, టీఆర్‌ఎస్‌ మండల శాఖ అధ్యక్షుడు సామవెంకట్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి ముస్కు భూమేశ్వర్, యూత్‌ అధ్యక్షుడు ఆకుల రాజారెడ్డి పాల్గొన్నారు.

    ఎల్‌ఎండీలో 2.4 టీఎంసీల నీరు.. అందుకే నీటి విడుదల : ఎస్సారెస్పీ ఏసీఈ శంకర్‌

    ఎస్సారెస్పీ నుంచి బుధవారం కాకతీయ, వరద కాలువల ద్వారా మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. కాకతీయ కాలువ ద్వారా క్రమంగా నీటి విడుదలను పెంచుతామని ప్రాజెక్ట్‌ చీఫ్‌ ఇంజినీర్‌ శంకర్‌ తెలిపారు. ఎల్‌ఎండీ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 2.4 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉందన్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు ఎగువ భాగన ఉన్న ప్రధాన ప్రాజెక్ట్‌లు విష్ణుపురి, బాబ్లీ ల నుంచి నీటిని దిగువకు వదులుతున్నారన్నారు. గైక్వాడ్‌ ప్రాజెక్ట్‌ కూడ 75 శాతం నిండిందన్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో ఉన్న నీటితో ఎస్సారెస్పీ మొదటి దశలో 9.68 లక్షల ఎకరాలకు సాగు నీరందించుటకు ప్రణాళిక చేస్తున్నట్లు తెలిపారు. లక్ష్మీ లిప్ట్‌ వద్ద పనులు చేపట్టడానికి వీలు లేకుండా నీరు వచ్చి చేరడం వల్ల అనుకున్న సమయంలో లిఫ్ట్‌ పనులు పూర్తి చేయలేక పోయామన్నారు. రెండు మోటర్లు సిద్ధమయ్యయయన్నారు. ఆ రెండు మోటర్ల ద్వారా నీటిని సరఫరా చేసి లక్ష్మీ కాలువ ఆయకట్టు రైతుల ప్రయోజనాలు కాపాడుతామని తెలిపారు. కాగా, ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వలన 25 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. బుధవారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1077.60(46.20 టీఎంసీల) అడుగుల నీరు నిల్వ ఉందని తెలిపారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల చేపట్టడంతో ప్రాజెక్ట్‌ దిగువ భాగన ఉన్న జల విద్యుతుత్పత్తి కేంద్రంలో ఒక్క టర్బయిన్‌ ద్వార విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభమైంది. ఒక్క టర్బయిన్‌ ద్వారా 9 మెగావాట్ల విద్యుతుత్పత్తి జరుగుతుందని జెన్‌కో అధికారులు తెలిపారు. 

    కరీంనగర్‌ జిల్లా నుంచి కదలివచ్చిన నేతలు

    శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్‌ వెంట కరీంనగర్‌ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు తరలి వచ్చారు. చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి, కోరుట్ల ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌ రెడ్డి, హుజూరాబాద్, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌ కమిటీల చైర్మన్లు ఎడవల్లి కొండాల్‌ రెడ్డి, రమేష్‌లు, కన్నూరు సంపత్‌రావు, పొనగండి మల్లయ్య, యేబూసి రామస్వామి, టి.రాజేశ్వర్‌రావు, చెల్పూరు ప్రభాకర్‌లతోపాటు హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాలకు చెందిన పలువురు ఎస్సారెస్పీ నీటి విడుదల సందర్భంగా మంత్రి వెంట పోచంపాడుకు వచ్చారు.

     
Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top