పునాది స్థాయిలో స్వపరిపాలనను పటిష్టంచేస్తే దేశంలో ప్రజా స్వామ్యం పరిఢవిల్లుతుందన్న ప్రప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సదాశయ స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపహాస్యం పాలైంది.
పునాది స్థాయిలో స్వపరిపాలనను పటిష్టంచేస్తే దేశంలో ప్రజా స్వామ్యం పరిఢవిల్లుతుందన్న ప్రప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సదాశయ స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపహాస్యం పాలైంది. అధికారం ఉన్నదికదా అన్న అహంకారంతో... వెన్నెముకలేని అధికార యంత్రాంగం స్వాభిమానం విడిచి చెప్పినట్టల్లా ఆడుతుందన్న భరో సాతో ఎంపీపీ, జెడ్పీటీసీలను తన ఖాతాలో వేసుకోవడానికి టీడీపీ సర్కారు ప్రదర్శించిన గూండాగిరీ అందరినీ దిగ్భ్రమకు గురిచేసింది.
కెమెరా కళ్లు తమనే గమనిస్తున్నాయన్న వెరపులేకుండా ప్రత్యర్థి పక్షం సభ్యులను బలవంతంగా తమ పక్షంలోకి లాక్కుపోవడానికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసీలు చేసిన ప్రయత్నాలు వారి అసలు రంగును పట్టి ఇచ్చాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీవంటివారు చూస్తుండగానే మైకులు విరిచి, విిసిరేసిన ఎమ్మెల్యే ఒకరైతే... జెడ్పీటీసీ సభ్యుల్ని ఈడ్చుకెళ్లడానికి చూసిన ఎమ్మెల్యే మరొకరు.
ఈ దుశ్శాసనపర్వంలో బెదిరింపులు, దుర్భాషలకు లెక్కేలేదు. తనపై టీడీపీ దౌర్జన్యంచేసిందని, పార్టీ సహచరులు జోక్యం చేసుకోనట్టయితే వారు తనను చంపేసివుండేవారని మహిళా జెడ్పీటీసీ ఒకరు ఆరోపిం చారంటేనే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థమవుతుంది. టీడీపీకి మెజారిటీ లభించినచోట ఎలాంటి వివాదమూ లేకుండా ఎన్నికలు పూర్తయ్యాయి. ఆ పార్టీకి అధికారం దక్కే అవకాశంలేని ఎంపీపీ, జెడ్‌పీల్లో మాత్రమే సమావేశాలు రణరంగమయ్యాయి.
దీన్నిబట్టే ఘర్ష ణలకు మూలకారకులెవరో, వారి అంతరంగం ఎలాంటిదో అర్థమవు తుంది. కళ్లముందు మహిళా ప్రజాప్రతినిధుల చీరలు లాగుతున్నా, వారి చేతిగాజులు పగులుతున్నా కలెక్టర్‌లు, ఎస్‌పీలు గుడ్లప్పగించి చూసిన వైనం విస్మయకరం. తగినంత పోలీసు బందోబస్తు ఉన్నా టీడీపీ దౌర్జన్యాలను నిలువరించలేని ఈ ఉన్నతాధికారులు... నిబంధన లకు విరుద్ధంగా ఎన్నికలు వాయిదా వేయడమో, టీడీపీ అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించడమో చేసి తమ ప్రభుభక్తిని చాటుకున్నారు.
తమను ఉన్నత స్థానంలో కూర్చోబెట్టిన అత్యున్నత సివిల్ సర్వీస్ వ్యవస్థనే నగుబాటుపాలు చేశారు. కోరం ప్రకటిం చాక ఏ సాకునైనా చూపి ఎన్నికల వాయిదా ఎలా సాధ్యమన్న ఇంగిత జ్ఞానం వారికి లేకపోవడం దారుణం. పదేళ్లపాటు గద్దెపై ఉండి సాగించిన అరాచకాలకు విసుగెత్తిన కారణంగానే బాబును రాష్ట్ర ప్రజలు మరో పదేళ్లపాటు అధికారంలేకుండా శిక్షించారు. అయినా పుట్టుకతో వచ్చిన బుద్ధిని ఆయన వదులుకోలేకపోయారని తాజా పరిణామాలు నిరూపించాయి.
ఇటీవలి సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో వందలాది కోట్లు వెదజల్లి, అబద్ధపు హామీలు పుక్కిటబట్టి అరకొర మెజారిటీతో సాధించుకున్న అధికారానికి ఈ ఫలితాలు అదనంగా తోడ్పడేదేమీ లేదు. మరెందుకని టీడీపీ ఈ స్థాయికి దిగజారిందన్నది అంతుబట్టని విషయం. 13 జిల్లాల్లో 9 జిల్లాల జెడ్‌పీలు టీడీపీకి వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్‌కు రావలసిన 4 స్థానాలు ఆ పార్టీకి దక్కకుండా చేయడం కోసమే ఇంతగా బరితెగింపు. వైఎస్సార్ జిల్లాలో టీడీపీ ఆటలు సాగకపోయినా కర్నూలులో అధికారుల ప్రాపకంతో జెడ్‌పీ చైర్మన్ పదవిని ఆ పార్టీ సొంతంచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ జెడ్పీటీసీలు ప్రమాణస్వీకారం చేయకున్నా ఆ పార్టీ వారందరినీ బయటకు నెట్టి ఎన్నికలు జరిగినట్టు, అందులో టీడీపీ అభ్యర్థి నెగ్గినట్టు వెరపులేకుండా ప్రకటించిన అధికా రుల సాహసానికి జనమంతా విస్తుపోయారు.
శుక్రవారం జరిగిన ఎంపీపీ ఎన్నికల్లోనూ ఇదే తంతు సాగింది. దౌర్జన్యాలు, అపహరణలు, బలవంతంగా ఓట్లేయించుకోవడంవంటివి చోటుచేసుకున్నాయి. తాము గెలిచే అవకాశం లేదని గ్రహించినచోటల్లా సమావేశమందిరాల్లో టీడీపీ కిష్కింధకాండ సృష్టించింది. కుర్చీలు, బల్లలు విరగ్గొట్టి, కాగితాలు చించేసి సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారు. ఒకచోటైతే నిండు గర్భిణిగా ఉన్న ఎంపీటీసీపై దౌర్జన్యం చేశారు. అధికారులు తాబేదార్లుగా వ్యవహరించిన జమ్మలమడుగువంటి చోట ఎన్నిక జరగకుండా అడ్డుకున్నారు. ఎంపీపీ ఎన్నికల నిర్వహణ కిందిస్థాయి అధికారులవల్ల అలా అఘోరించిందనుకున్నవారికి జెడ్‌పీ ఎన్నికల తీరు చూస్తే నోటమాట రావడంలేదు.
తెలంగాణ రాష్ట్రంలో కూడా అధిక స్థానాలు గెలుచుకున్నా మున్సి పాలిటీల్లోగానీ, ఎంపీపీ, జెడ్‌పీల్లోగానీ కాంగ్రెస్ అధికారాన్ని దక్కించు కోలేకపోయింది. కానీ, అధికార టీఆర్‌ఎస్ పక్కా వ్యూహంతో, ఎంఐఎం వంటి పార్టీల మద్దతుతో తన స్థానాన్ని సుస్థిరపరచుకుంది. అంతేతప్ప టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో సాగించినట్టుగా బరితెగింపు రాజకీ యాలకు పాల్పడలేదు. అపహరణలకు, దౌర్జన్యాలకు దిగజారలేదు. ఆంధ్రప్రదేశ్‌లో బాహాటంగా గూండాయిజాన్ని ప్రోత్సహించిన బాబు... తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఓటేసిన తమ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలను పార్టీనుంచి సస్పెండ్ చేయడం మహావింత. ఈ రెండు రోజులూ చానళ్లలో టీడీపీ దౌర్జన్యాన్ని గమనించినవారికి అలా సస్పెండ్ చేసే నైతికార్హత బాబుకున్నదా అనే అనుమానం తలెత్తు తుంది.
ఈ మొత్తం వ్యవహారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరి గణించి తగిన చర్యలు తీసుకోనట్టయితే ఆ సంస్థ ప్రతిష్ట దెబ్బతిం టుంది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరికలను బేఖాతరుచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిష్పాక్షికంగా వ్యవహరించిన అక్కడి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీరా పాండేను ఆదర్శంగా తీసుకోవాలి. స్థానిక సంస్థల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పూనుకోవాలి. గవర్నర్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని ఎన్నికల ప్రక్రియను అపహాస్యం పాలుచేసినవారిపై చర్యలు తీసుకోవాలి.