దౌత్యంలో కొత్తపుంతలు! | India to maintain for good relationship with other countries | Sakshi
Sakshi News home page

దౌత్యంలో కొత్తపుంతలు!

May 23 2014 1:10 AM | Updated on Sep 2 2017 7:42 AM

మన పొరుగును మనం ఎంపిక చేసుకోలేం. అక్కడున్నవారితో ఎలాంటి సంబంధాలు నెలకొల్పుకొనాలో, ఉన్న సంబంధాలను ఎలా మెరుగుపరుచుకోవాలో మాత్రమే నిర్ణయించుకోగలం.

సంపాదకీయం:  మన పొరుగును మనం ఎంపిక చేసుకోలేం. అక్కడున్నవారితో ఎలాంటి సంబంధాలు నెలకొల్పుకొనాలో, ఉన్న సంబంధాలను ఎలా మెరుగుపరుచుకోవాలో మాత్రమే నిర్ణయించుకోగలం. అలాగని కేవలం మనం మాత్రమే ఆ సంబంధాలను నిర్దేశించలేం. అందులో అవతలివారి వ్యవహారశైలి కీలకపాత్ర పోషిస్తుంది. మనతో ఇబ్బందు లున్నాయనుకున్నా, మనల్ని ఇబ్బందిపెట్టాలనుకున్నా ఈ పొరుగుదే శాలు ఎవరికో మిత్ర దేశాలుగా మారి పొగపెడుతుంటాయి. ఇలాంటి అంశాలన్నిటినీ జాగ్రత్తగా పరిశీలిస్తూ, గరిష్ట స్థాయిలో ప్రయోజనాలు రాబట్టేలా వ్యవహరించడమే దౌత్యకళ. మనకు చైనా, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు, మారిషస్‌లు ఇరుగుపొరుగు దేశాలు. ఇందులో చైనా తప్ప మిగిలిన వన్నీ దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం(సార్క్) సభ్యదే శాలు. చైనాతో మాత్రమే కాదు... సార్క్ దేశాలతో కూడా వివిధ కారణాలరీత్యా మన సంబంధాలు గత కొన్నేళ్లుగా అంత పొందిగ్గా లేవు.
 
  దేశంలో సుస్థిరత, అభివృద్ధి సాధ్యంకావాలంటే అంతర్గతంగా పరిస్థితులు బాగుండటమే కాదు... ఇరుగుపొరుగుతో కూడా సత్సం బంధాలు అవసరం. చిత్రమేమంటే ఇంత కీలకమైన విదేశీ వ్యవహా రాల విషయంలో మొన్నటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా విడు దలైన వివిధ పార్టీల మేనిఫెస్టోలు ముక్తసరిగానే ఉండిపోయాయి. అయితే, నరేంద్ర మోడీ మాత్రం పాకిస్థాన్, చైనాల విషయంలో గట్టిగా మాట్లాడారు. చైనాకు మన భూభాగంలో ఒక్క అంగుళం కూడా వదిలేది లేదన్నారు. అధీనరేఖ వద్ద మన జవాన్లు మరణిస్తుంటే న్యూయార్క్‌లో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో ‘బిర్యానీ ముచ్చట్లు’ పెడతారా అని మన్మోహన్‌సింగ్‌ను దుయ్యబట్టారు. అధికారంలోకొస్తే బంగ్లాదేశ్‌నుంచి సాగుతున్న అక్రమ వలసలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
 
 దేశాధినేతలుగా అధికార పగ్గాలు చేప ట్టినవారికి శుభాకాంక్షలు చెప్పడం, తమ దేశంలో పర్యటించమని కోరడం దౌత్యస్థా యిలో సాధారణంగా జరిగేదే. మరీ శత్రుపూరిత వైఖరితో ఉండే దేశాలు తప్ప మిగిలిన దేశాలన్నీ ఈ దౌత్య సంప్రదాయాన్ని పాటి స్తాయి. కానీ, అందుకు భిన్నంగా తన పదవీస్వీకార ప్రమాణానికి రమ్మని సార్క్ దేశాల అధినేతలను... మరీ ముఖ్యంగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను నరేంద్ర మోడీ ఆహ్వానించడం అందరినీ ఆశ్చర్యచకి తులను చేసింది. ఎందుకంటే, ఈ సంప్రదాయం మన దేశంలో లేదు. నిరుడు నవాజ్ షరీఫ్ పాక్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు మన్మోహన్‌కు ఆహ్వానం పంపారు. ఆయన వెళ్లలేదు సరేగానీ... ‘పాక్‌తో మెతకగా వ్యవహరిస్తున్న’ మన్మోహన్ అలాంటి ఆలోచనేదీ పెట్టుకోరనే భావిస్తున్నట్టు బీజేపీ వ్యాఖ్యానించింది. 

ఈ నేపథ్యంలో నవాజ్‌ను రమ్మనడం ద్వారా నరేంద్ర మోడీ దేశ ప్రజలనూ, పరాయి దేశాధినేతలనూ మాత్రమే కాదు... తన సొంత పార్టీని కూడా దిగ్భ్రాం తిపరిచివుంటారు. ఊహకందని విధంగా వ్యవహరిస్తూ ఇప్పటికే మోడీ చాలా చేశారు. ఆ క్రమంలో ఇది మరొకటి అనుకోవాలి. మోడీ ప్రధాని అయితే ఇంటా, బయటా ఘర్షణాత్మక వాతావరణం ఏర్ప డుతుందని, లేనిపోని సమస్యలతో దేశం సతమతమవుతుందని కాంగ్రెస్, వామపక్షాలు హెచ్చరించివున్నాయి. పొరుగుదేశాల్లోనూ, మరీ ముఖ్యంగా పాకిస్థాన్‌లోనూ మోడీపై ఈమాదిరి అభిప్రాయాలే ఉన్నాయి. కానీ, ఒక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టడం ద్వారా అలాంటి అభిప్రాయాలన్నిటినీ ఆయన పూర్వపక్షం చేశారు.
 
  దక్షిణాసియా ప్రాంత దేశాలు మనవైపు కొన్నాళ్లుగా అనుమా నపు దృక్కులతోనే చూస్తున్నాయి. చాలా దేశాల్లో అస్థిరత రాజ్యమే లుతున్నది. మన్మోహన్ రెండో దఫా పగ్గాలు చేపట్టాక అన్ని రంగాలూ పడకేసినట్టే విదేశాంగ విధానం కూడా స్తబ్దుగా ఉండిపోవడమో లేక మిత్రపక్షాలను సంతృప్తిపరిచే విధంగా దౌత్య నిర్ణయాలు తీసుకోవ డమో అలవాటైంది. నిరుడు నవంబర్‌లో శ్రీలంకలో జరిగిన కామ న్వెల్త్ దేశాధినేతల సమావేశానికి ద్రవిడ పార్టీల ఒత్తిడి కారణంగా మన్మోహన్ గైర్హాజరయ్యారు. బంగ్లాదేశ్‌తో ఖరారైన తీస్తా నదీజలాల ఒప్పందానికి తృణమూల్ హెచ్చరికతో చివరి నిమిషంలో నీళ్లొది లారు.
 
  మన్మోహన్ తన పదేళ్ల పదవీకాలంలో ఏ ప్రధాని చేయనంతగా విదేశీ పర్యటనలు చేశారు. 70కిపైగా దేశాలను చుట్టివచ్చారు. కానీ ఫలితం మాత్రం నిరాశాజనకమే. ఒకప్పుడు మనకు అత్యంత సన్ని హితంగా మెలిగిన నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు ఇటీవ లికాలంలో దూరం జరుగుతున్న సూచనలు కనబడుతూనే ఉన్నాయి. మన బలహీనతలను బాగా గమనించిన చైనా ఒక్క పాక్‌తో సన్నిహి తంగా ఉండటం మాత్రమే కాదు...శ్రీలంక, నేపాల్ వగైరా దేశాలను కూడా మచ్చిక చేసుకుంటున్నది. భారత్‌కు వాణిజ్యపరంగా ‘అత్యంత అనుకూల దేశం’ ప్రతిపత్తిని ఇస్తామని హామీ ఇచ్చిన పాకిస్థాన్ వెన క్కుతగ్గింది.
 
  వీసాల మంజూరులోనూ ఇదే ధోరణి. ఇటీవలే కారణం చెప్పకుండా మన దేశానికి చెందిన ఇద్దరు పాత్రికేయులను దేశం విడిచివెళ్లమని ఆదేశించింది. ఆందోళనకరమైన ఈ స్థితిని మార్చాల్సి న అవసరం ఉన్నదని దౌత్య నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ తాజా నిర్ణయం ఆ దిశగా ఒక ముందడుగవు తుంది. గతంలో కాంగ్రెసేతర ప్రభుత్వాలున్నప్పుడే పాకిస్థాన్‌తో మన సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి గనుక నరేంద్రమోడీ ఏలుబడిలో కూడా అలాంటి పరిస్థితి ఏర్పడుతుందన్న ఆశ కలుగుతున్నది. ఇప్ప టికైతే ఇది ప్రమాణస్వీకారానికి రావాలన్న ఆహ్వానమే అయినా ద్వైపాక్షిక బంధాలను ఏర్పరుచుకోవడానికి, పటిష్టపరుచుకోవడానికి ఇది ప్రాతిపదిక కావాలని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఆశిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement