కొత్త చరిత్రకు శ్రీకారం

Editorial Column On YS Jagan PrajaSankalpaYatra - Sakshi

పల్లె సీమలనూ, పట్టణాలనూ, నగరాలనూ, మహా నగరాలనూ ఒరుసుకుంటూ సాగిన సుదీర్ఘ మహా జన ప్రభంజన యాత్ర పూర్తికాబోతోంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 2017 నవంబర్‌ 6న ఇడుపులపాయలోని దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్మృతివనం నుంచి ప్రారంభించిన ‘ప్రజా సంకల్పయాత్ర’ ఎన్నో అవాంతరాలను అధిగమించి నేడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియబోతున్నది. జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజానీకంలో ఉన్న ఆదరాభిమానాలు అందరికీ సుపరిచితమే అయినా పాదయాత్రకు ఈ స్థాయిలో జనం పోటెత్తు తారని మొదట్లో ఎవరూ ఊహించలేదు. మొదలైనప్పుడు ఉన్న ఉరవడి, ఉత్సాహం చివరికంటా కొనసాగడం ప్రతి ఒక్కరినీ అబ్బురపరిచింది. ప్రజలంతా ఎవరికి వారు పాదయాత్ర వివరాలు తెలుసుకుని ఆ దారిలో ఆయనకు స్వాగతం పలికేందుకు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నిర్వహించే బహి రంగసభల్లో ఆయన ఏం చెబుతారో వినేందుకు తరలివచ్చిన తీరు దేశ చరిత్రలోనే అపూర్వం. 

ఆయన అడుగులో అడుగేయాలని, ఆయనతో తమ గోడు చెప్పుకోవాలని, ఆయన ఇచ్చే భరోసాతో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని లక్షలమంది ప్రజలు ఆత్రంగా ఎదురు చూశారు. తనను కలుసుకోవాలని, మాట్లాడాలని ఆశపడుతున్నవారిలో కొందరు కదల్లేని స్థితిలో ఉన్నారని తెలుసుకుని జగన్‌మోహన్‌రెడ్డే స్వయంగా వారి ఇళ్లకు వెళ్లిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఆయన్ను కలిసి ఏదో చెప్పాలని బలంగా కోరుకుంటున్నా చుట్టూ ఉన్న జనప్రవాహాన్ని చూసి నిస్సహాయంగా ఉండిపోయిన వృద్ధులనూ, పిల్లలనూ గమనించి తానే వారి దగ్గరకెళ్లి అక్కున చేర్చుకున్న తీరు, చిరునవ్వుతో ఆప్యాయంగా సంభాషించిన తీరు చూసి అందరూ చకి తులయ్యారు. ఒకరా ఇద్దరా... పాదయాత్ర పొడవునా వందలు, వేలమంది ఆయన ముందు తమ గోడు వినిపించుకున్నారు.

చంద్రబాబు పాలనలో తమకెదురవుతున్న అన్యాయాలను చెప్పు కున్నారు. పాలకుల దన్నుతో ఊరూరా ఎటువంటి అక్రమాలు అడ్డూ ఆపూ లేకుండా సాగు తున్నాయో వివరించారు. వినతిపత్రాలిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తున్న తీరును తెలిపారు. కొందరైతే తామెదుర్కొంటున్న అనారోగ్య సమస్యలను చెప్పుకున్నారు. తమ పింఛన్లను కావాలని నిలిపివేశారని కొందరు... నివాసగృహం లేక సతమతమవుతున్నామని మరికొందరు... పెద్ద చదువులు చదివినా నిరుద్యోగం తమను పీల్చిపిప్పి చేస్తున్నదని ఇంకొందరు ఆయనకు చెప్పారు. అరకొర వేతనాలిచ్చి వెట్టి చాకిరీ చేయించుకోవడాన్ని... ఏళ్లు గడుస్తున్నా తమకు రావాల్సిన బకాయిల్ని చెల్లించకపోవడాన్ని... నోటిఫికేషన్లు ఇస్తామని, ఖాళీలు భర్తీ చేస్తామని హామీలిచ్చి మోసపుచ్చడాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చినవారున్నారు.

వీరందరూ ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయినవారే. తన పరిధిలో తీర్చగలిగినవాటిని అక్కడికక్కడే పరిష్కరించటం, అధికారం సిద్ధించాక చేయగలిగేవాటి విషయంలో ఓపిక పట్టమని కోరడం, భవిష్యత్తుపై విశ్వాసాన్ని నింపడం దారి పొడవునా కనబడింది. ఆయన్ను నిరుపేదలు,రైతులు, చేతివృత్తులవారు, కార్మి కులు, మధ్యతరగతి ప్రజలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, దళితులు, మైనారిటీలు, ఆదివాసీలు కలిశారు. ఆత్మీయ సమావేశాల్లో వివిధ వర్గాలవారు తమకు జరుగుతున్న అన్యాయాలను తెలిపారు. సర్కారీ అపసవ్య విధానాలను వీరందరూ వివరిస్తుంటే, అందువల్ల ఏర్పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెడుతుంటే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ఓర్పుతో విన్నారు. అవ గాహన చేసుకున్నారు. పరిష్కార మార్గాలు ఆలోచించారు.

సరికొత్త విధానాలకు రూపకల్పన చేశారు. పేదరికం కోరల్లోంచి బయటకు రావాలంటే కుటుంబాల్లో పిల్లలు పెద్ద చదువులు చదివి డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని... అందుకు అవసరమైన చేయూత అందేవిధంగా విధివిధానాలు రూపొందిస్తామని వాగ్దానం చేశారు. సకల వర్గాలనూ స్పృశించేలా రూపకల్పన చేసిన నవ రత్నాల్లోని అంశాలను ఆయన వివరిస్తుంటే జనం కరతాళ ధ్వనులతో బహిరంగసభలు మార్మోగాయి.
కాళ్లు బొబ్బలెక్కినా, ఎండలు మండిపోతున్నా, ఏకధాటిగా వర్షం కురుస్తున్నా, శీతగాలులు కోతపెడుతున్నా ఏ రోజూ జగన్‌మోహన్‌రెడ్డి వెరవలేదు. తన సంకల్పం నుంచి కాస్తయినా పక్కకు తప్పుకోలేదు. తాను అడుగుపెట్టిన ప్రాంతంలోని సమస్యలను అవగాహన చేసుకోవడం, వాటిని ప్రస్తావిస్తూ బహిరంగసభల్లో మాట్లాడటం, ప్రజలకు అర్ధమయ్యే రీతిలో వర్తమాన రాజకీయాలను వివరించటం, వారిలో చైతన్యాన్ని నింపడం ఆయనొక యజ్ఞంలా నిర్వహించారు.

ఇన్ని సభల్లో మాట్లాడినా, వేలమందితో నిత్యం సంభాషిస్తున్నా ఏనాడూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయు డుపై  పరుషవాక్కులు పలకలేదు. తన హుందాతనాన్ని మరవలేదు. కానీ బాబు దీనికి భిన్నం. పాదయాత్ర తొలినాళ్లలో అది విజయం సాధించడం అసాధ్యమన్న భ్రమల్లో ఆయన మునిగి పోయారు. రోజులు గడుస్తున్నకొద్దీ ఆ సంకల్పయాత్ర అంతకంతకు బలం పుంజుకోవడాన్ని గమ నించి తన అధికార బలంతో అనేక రూపాల్లో జగన్‌మోహన్‌రెడ్డి ఆత్మసై్థర్యాన్ని దెబ్బతీయాలని చూశారు. కానీ చివరకు చంద్రబాబే మనోసై్థర్యాన్ని కోల్పోయారు.

తన పునాదులు కదులుతున్న వైనాన్ని గమనించి ప్రత్యేక హోదాతోసహా అనేక అంశాల్లో ‘యూ–టర్న్‌’లు తీసుకుని నవ్వుల పాలయ్యారు. వీటన్నిటికీ పరాకాష్టే విశాఖ విమానాశ్రయంలో జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన విఫల హత్యాయత్నం. మొత్తానికి పధ్నాలుగు నెలలపాటు కొనసాగిన ఈ ప్రజా సంకల్పయాత్ర కోట్లాది జన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. దేశ చరిత్రలో ఒక అరుదైన ఘట్టంగా, అపు రూపమైన అధ్యాయంగా ఆవిష్కృతమవుతుంది. నాయకుడంటే ఎలా ఉండాలో, ఎంత పరిణతితో మాట్లాడాలో ఈ ప్రజా సంకల్పయాత్ర ద్వారా జగన్‌మోహన్‌రెడ్డి చాటిచెప్పారు. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top