‘స్వర్గం’ నుంచి తీపి కబురు

Editorial Column On Maldives President Elections - Sakshi

భూలోక స్వర్గధామంగా పేరున్న హిందూ మహా సముద్రంలోని ఒక చిన్న దేశం మాల్దీవుల్లో ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్‌ ఓటమి పాలయ్యారు. విపక్ష కూటమి అభ్యర్థి ఇబ్రహీం మహమద్‌ సోలీహ్‌ ఘన విజయం సాధించారు. యామీన్‌కు 41.7 శాతం ఓట్లు రాగా, విపక్ష అభ్యర్థి సోలిహ్‌ 58.3 శాతం ఓట్లతో భారీ ఆధిక్యత కనబరిచారు. మొత్తం ఓటర్లలో 89.2 శాతంమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాల్దీవులు 1,190 పగడపు దీవుల సముదాయం...అందులో నివాసయోగ్యమైనవి కేవలం 185 దీవులు మాత్రమే. ఆ దేశ జనాభా నాలుగు లక్షలు మించదు. అందులో మూడు లక్షలమంది సున్నీ ముస్లింలు. అంత చిన్న దేశం ఎన్నికలకు సాధారణంగా పెద్ద ప్రాధాన్యత ఉండదు.

కానీ అధ్యక్షుడు యామీన్‌ నియంతగా మారి సకల వ్యవస్థలనూ ధ్వంసం చేసినందువల్లా... దేశాన్నే జైలుగా మార్చి తన మాటే శాసనంగా చలామణి చేయిస్తున్నందువల్లా తాజా ఎన్నికలు అందరిలోనూ ఎంతో ఉత్కంఠ కలిగించాయి. సింహాసనాన్ని అధిష్టించి ఉన్న నియంత మరో అయిదేళ్లు దాన్నే అంటిపెట్టుకుని ఉండి దేశాన్ని మరింత భ్రష్టు పట్టిస్తాడా లేక జనం ఛీత్కారాలతో నిష్క్రమిస్తాడా అని అందరూ ఆసక్తితో గమనించారు. ఒకరకంగా ఈ ఫలితాన్ని చాలామంది ఊహించలేదని చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు మొదలుకొని సైన్యం, పోలీసు విభాగాల వరకూ అన్నిటినీ యామీన్‌ తన చూపుడు వేలుతో శాసించాడు. ఉదారంగా నజరానాలిచ్చి, లొంగకపోతే కేసులతో వేధించి మీడియాను గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఈ ఎన్నికల సందర్భంగా విపక్షానికి మీడియాలో దాదాపు చోటు దొరకలేదు.

తనకు ప్రధాన ప్రత్యర్థులుగా ఉంటారని భావించిన మాజీ అధ్యక్షుడు అబ్దుల్‌ గయూంతోపాటు పలువురు రాజకీయ ప్రత్యర్థులను ఉగ్రవాదం ఆరోపణలతో జైళ్లకు పంపాడు. మతం మాటున బలపడాలన్న కాంక్షతో దేశంలో ఛాందసవా దాన్ని పెంచుతూపోయాడు. రాజకీయ ప్రత్యర్థులను తప్పుడు ఆరోపణలతో నిర్బంధించరాదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఆగ్రహోదగ్రుడై ఆ తీర్పునిచ్చిన ఇద్దరు జడ్జీలను జైలుకు పంపాడు. మరో మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ నషీద్‌కు ఒక కేసులో కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించగా ఆయన అనారోగ్యం సాకుతో తొలుత బ్రిటన్‌ వెళ్లిపోయి, ఆ తర్వాత శ్రీలంకలో ప్రవాస జీవితం గడుపుతున్నారు.
యామీన్‌ నిష్క్రమణ మన దేశానికి సంబంధించినంతవరకూ అత్యంత కీలక పరిణామం.

అది మన దేశానికి కేవలం 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ భారత్‌ అనుకూల ప్రభుత్వం లేకపోవడం భద్రతాపరంగా మనకు సమస్య. యామీన్‌ రాకముందు మన దేశానికి అక్కడ పలుకుబడి ఉండేది. 1988లో అప్పటి అధ్యక్షుడు అబ్దుల్‌ గయూంను గద్దె దించడానికి శ్రీలంక తమిళ మిలిటెంట్లతో కలిసి కొందరు కుట్ర చేసి కీలక ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకున్నప్పుడు నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ మన సైన్యాన్ని తరలించి ఆ కుట్రను భగ్నం చేశారు. గయూం పాలన సాగినన్నాళ్లు, ఆ తర్వాత నషీద్‌ హయాంలోనూ మన దేశంతో సత్సంబంధాలు కొనసాగినా యామీన్‌ వచ్చాక పరిస్థితులు మారాయి. 2013 నుంచి క్రమేపీ ఆ దేశం చైనా వైపు మొగ్గు చూపటం ప్రారంభించింది.

దానికి అనుగుణంగా చైనా భారీయెత్తున పెట్టుబడులు, ఉదా రంగా రుణాలు ఇచ్చింది. ఆసియా, ఆఫ్రికా, యూరప్‌లను కలుపుతూ చైనా నిర్మించతలపెట్టిన ‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇన్షియేటివ్‌’(బీఆర్‌ఐ)లో మాల్దీవులు కూడా భాగస్వామి. కనుకనే అక్కడ ఓడరేవు నిర్మాణానికి చైనా ప్రణాళిక రూపొందించింది. ఇంతక్రితం పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లో నిర్మించిన ఓడరేవులు వాటికి భారంగా మారగా, చివరకు చైనాయే వాటిని లీజుకు తీసుకుంది. మున్ముందు మాల్దీవుల్లో కూడా అలాంటి స్థితే ఏర్పడితే మన దేశం చుట్టూ చైనా నావికాదళం మోహరించి నట్టవుతుంది. కనుకనే ఈ పరిణామాలు భారత్‌కు మింగుడు పడలేదు. అయితే చైనా రుణం పెనుభారం కావడంతో స్థానికుల్లో వ్యతిరేకత బయల్దేరింది. చిత్రమేమంటే మలేసియాలో సైతం ఇలాంటి పరిణామాలే అక్కడి చైనా అనుకూల పాలకులను గద్దె దించాయి.  

వందిమాగధ బృందాల పొగడ్తల రొదలో తన ప్రభుత్వ ఆర్థిక విధానాలపై ప్రజల్లో ఉన్న వ్యతి రేకతను అధ్యక్షుడు యామీన్‌ పసిగట్టలేకపోయారు. మీడియాలో అసమ్మతి స్వరం వినబడకుండా చేయడం ఆయనకే ముప్పు తెచ్చింది. 30 ఏళ్లు అవిచ్ఛిన్నంగా దేశాన్నేలిన అబ్దుల్‌ గయూం, 2008లో తొలిసారి జరిగిన ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల్లో గెలుపొందిన నషీద్‌ సైతం నియం తృత్వాన్ని చలాయించారు. అబ్దుల్‌ గయూం తన పాలనాకాలంలో నషీద్‌పై అనేక కేసులు పెట్టి ఆయన్ను జైలు పాలుచేస్తే... ఆ తర్వాత నషీద్‌ సైతం ఆ పోకడలే పోయారు. 2012లో ఆయన కూడా ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అరెస్టు చేయించారు. పర్యవసానంగా ఆ మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో నషీద్‌ ఓడిపోయి, యామీన్‌ అధ్యక్షుడిగా గెలిచారు. కానీ ఆయనా అదే బాటలో నడిచారు.

ఇప్పుడు యామీన్‌ తాజాగా ఎన్నికైన ఇబ్రహీం మహ్మద్‌ సోలిహ్‌కు గడువు ప్రకారం నవంబర్‌లో సక్రమంగా అధికారం అప్పగిస్తారా లేక సైనిక కుట్రకు పాల్పడతారా అన్నది అను మానమే. నిజానికి తాజా ఎన్నికల ఫలితాలను ప్రకటించడంలో ఎన్నికల సంఘం జాప్యం చేసింది. ప్రధాని నరేంద్రమోదీ చొరవ తీసుకుని అధికారికంగా ఫలితాలు వెలువడకుండానే సోలిహ్‌కు అభి నందనలు తెలిపారు. దాంతో యామీన్‌ సర్కారు ఓటమిని అంగీకరించక తప్పలేదు. కాబోయే అధ్యక్షుడు మన దేశానికి సన్నిహితుడు. అంతమాత్రాన ఉదాసీనత పనికి రాదు. మాల్దీవులను సమాన స్థాయిలో గౌరవించి,  ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఆ దేశం ఎలాంటి సాయం కోరుకుంటున్నదో గమనించి వ్యవహరించాలి. అక్కడి పౌరుల్లో భారత్‌ వ్యతిరేకతను రెచ్చ గొట్టడానికి మున్ముందు యామీన్‌ ప్రయత్నిస్తారు. ఆ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. 
 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top