టపాసుల నిషేధం | article on ban on crackers | Sakshi
Sakshi News home page

టపాసుల నిషేధం

Oct 11 2017 1:24 AM | Updated on Sep 2 2018 5:24 PM

article on ban on crackers - Sakshi

దీపావళి పండగ సమీపిస్తున్నదంటే పిల్లల సందడి ఎక్కువుంటుంది. పెద్దలు కూడా పిల్లల్లా మారి హడావుడి చేసే పండగ అది. గత కొన్నేళ్లుగా సరిగ్గా ఈ సమ యంలోనే వాతావరణ కాలుష్యం ప్రముఖంగా చర్చకొస్తున్నది. ఈ దఫా కూడా అది మొదలైంది. వరసగా రెండో ఏడాది కూడా సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్‌)లోనూ, దాని శివార్లలోనూ 20 రోజులపాటు టపాసుల విక్రయాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. టపా సుల విక్రేతలకు జారీచేసిన తాత్కాలిక లైసెన్స్‌లను సైతం రద్దు చేసింది. నవంబర్‌ 1 తర్వాతే వీటిని ఎత్తేస్తామని స్పష్టం చేసింది. నిరుడు ఈ తరహాలోనే ఇచ్చిన ఆదే శాలను గత నెల 12న ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం సవరించింది. టపాసు లమ్మే టోకు వ్యాపారులు, డీలర్లు, చిల్లర వర్తకుల సంఖ్యను పరిమితం చేస్తూ ఆ మేరకు మాత్రమే లైసెన్సులివ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఆ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఇప్పుడు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తాజా తీర్పునిచ్చింది. ఈ తీర్పు సంఘ్‌ పరివార్‌కు చెందిన త్రిపుర గవర్నర్‌ తథా గత రాయ్‌కి ఆగ్రహం కలిగించింది. ‘త్వరలో హిందూ దహన సంస్కారాలు సైతం నిషిద్ధమవుతాయి కాబోలు’ అంటూ ట్వీట్‌ చేశారు. పైగా ఇలా అనడం ద్వారా రాజ్యాంగ పరిమితులను తానేమీ అతిక్రమించడం లేదని వివరణనిచ్చారు. నిజా నికి సుప్రీంకోర్టు టపాసులు పేల్చడాన్ని నిషేధించలేదు. వాటి అమ్మకాలను మాత్రమే నిషేధించింది. ఇప్పటికే టపాసులు కొనుక్కున్నవారు పండగరోజు వాటిని పేల్చడానికి ఎలాంటి అడ్డంకీ లేదు. ఈసారి ఛత్తీస్‌గఢ్‌లోని బీజేపీ ప్రభుత్వం కూడా టపాసులపై పాక్షిక నిషేధం పెట్టింది. భారీ శబ్దాలతో పేలే టపాసుల వాడకాన్ని అంగీకరించబోమని చెప్పింది.

సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఢిల్లీతోపాటు ఎన్‌సీఆర్‌ పరిధిలో ఉన్న హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లోని 14 జిల్లాలకు వర్తిస్తాయి. ఢిల్లీ వాసులు టపాసులు కొనుక్కోవాలంటే ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, సమయాన్ని వెచ్చించి కనీసం 140 నుంచి 200 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది. సుప్రీం కోర్టు ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి నేపథ్యముంది. ఢిల్లీ నగరంలో గత ఏడాది దీపావళి రోజున కాలుష్యం తీవ్రత కనీవినీ ఎరుగని రీతిలో ఉంది. సాధా రణ దినాల్లో ఉండే కాలుష్యంతో పోలిస్తే అది ఎంతో అధికం. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు 29 రెట్లు ఎక్కువ. ఒక్క రోజులో ఇంత చేటు కాలుష్యం మరే నగరంలోనూ నమోదు కాలేదని నిపుణులు చెబుతున్నారు. మిగిలిన నగరాల మాటెలా ఉన్నా ఢిల్లీ నగరంలో టపాసులు పేల్చడానికి వ్యతిరే కంగా ఏడెనిమిదేళ్లనుంచి స్వచ్ఛంద సంస్థల ప్రచారోద్యమం సాగుతోంది.

ఇంత చేస్తున్నా 2014లో దీపావళినాడు చైనా రాజధాని బీజింగ్‌ను మించి ఢిల్లీలో కాలు ష్యం ఉన్నట్టు బయటపడింది. ఆ మరుసటి ఏడాది అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మన దేశ పర్యటనకొచ్చినప్పుడు ఢిల్లీలో ఆయన బసచేసినచోట అమర్చడానికి అమెరికా రాయబార కార్యాలయం 1,800 ఎయిర్‌ ప్యూరిఫయర్స్‌ను కొనుగోలు చేసింది. జాతీయ వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ)లో ఆ నగరం 318 పాయింట్ల వద్ద ఉన్నదని కేంద్ర కాలుష్యమండలి నిరుడు ప్రకటించినప్పుడు అందరూ దిగ్భ్రాంతిచెందారు. ఎందుకంటే ఏ ప్రాంతమైనా 300 పాయింట్లు దాటి కాలుష్యాన్ని నమోదుచేస్తే అది ‘రెడ్‌ జోన్‌’లో ఉన్నట్టు లెక్క.    

ఈ టపాసులతో ఢిల్లీకి, మొత్తంగా ఉత్తరాదికి ఒక సమస్య ఉంది. ఇంచుమించు దీపావళి సమయానికి నెమ్మది నెమ్మదిగా మంచు ఆవరించడం మొదలవుతుంది. సరిగా అప్పుడే గాలి మందగమనం ప్రారంభమవుతుంది. కనుకనే టపాసులు, బాణాసంచా కాల్చడం వల్ల వెలువడే పొగ చాలాసేపు ఆ మంచులో నిలకడగా ఉండిపోతుంది. అది మనం పీల్చే గాలితో పాటు శరీరంలోకి ప్రవేశిస్తుంది. పిల్లల్లో ఎంతో ఆసక్తిని కలిగించే పాము బిళ్ల కాలిస్తే వెలువడే పొగ 464 సిగరెట్లను ఒకేసారి తగలెడితే వచ్చే పొగతో సమానమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూచక్రాలు, విష్ణు చక్రాలు వగైరా కూడా దాదాపు దీనికి సమానంగా కాలుష్యాన్ని వెదజల్లుతాయి. ఈ పొగలో నైట్రోజన్‌ ఆక్సైడ్, సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ వంటి అత్యంత ప్రమాదకర సూక్ష్మాణు వులుంటాయి.

ఇవి ఆస్త్మా, బ్రాంకైటీస్,  కేన్సర్, శ్వాసకోశ వ్యాధి, చర్మవ్యాధులు వగైరాలను కలగజేస్తాయి. వాయు కాలుష్యం వల్ల ఏటా 3,000 అకాల మరణాలు సంభవిస్తున్నాయని పర్యావరణ కాలుష్య నియంత్రణ సంస్థ తెలిపింది. అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వులు సృష్టించే అయోమయాన్ని కూడా చెప్పు కోవాలి. ఇంచుమించు నెలక్రితం ఒక ధర్మాసనం పరిమితంగా టపాసుల లైసెన్స్‌ లివ్వొచ్చునని చెప్పింది. ఆ ఉత్తర్వులొచ్చాక వ్యాపారులంతా కోట్లాది రూపాయలు వెచ్చించి సరుకు తెచ్చుకున్నారు. ఈలోగా మళ్లీ నిషేధం అమల్లోకి రావడంతో వారికి ఏం చేయాలో పాలుబోని స్థితి. పండగ సమీపిస్తున్నకొద్దీ టపాసుల ధర పెరుగుతూ పోతుంది కనుక చవగ్గా ఉంటాయని చాలామంది ముందే కొంటారు. అలాంటివారు కాల్చడానికి నిషేధం ఏమీ లేదు. ఎటొచ్చీ ఆలస్యంగా కొనేవారికి మాత్రమే సమస్య. ఢిల్లీలో దీపావళి సమయంలో 50 లక్షల కిలోల టపాసులు కాలుస్తారని న్యాయస్థానానికి విన్నవించారు. ఈ సరుకంతా ఇప్పుడు విధించిన నిషేధం కారణంగా నల్లబజారులోకి ప్రవేశిస్తుంది.

టపాసుల పరిశ్రమపై ఆధార పడి బతుకీడ్చేవారు వేలాదిమంది ఉంటారు. నిషేధం ఉంటుందని చాలా ముందు గానే తెలిపి, దానిపై విస్తృతస్థాయిలో ప్రచారం చేస్తే... టపాసులు తయారు చేయడం, దిగుమతి చేసుకోవడం గణనీయంగా తగ్గుతుంది. కార్మికులు సైతం ప్రత్యామ్నాయాలు వెదుక్కుంటారు. ఆఖరి నిమిషంలో నిషేధానికి బదులు నిర్ణీత సమయానికి మించి టపాసులు పేల్చరాదన్న నిబంధన పెడితే కొంతవరకూ ఫలితం ఉంటుంది. కనీసం వచ్చే ఏడాదైనా చాలా ముందుగా ఇలాంటి నిషేధాలపై ఆలోచన చేసి అందరికీ అవగాహన కలిగిస్తే ఇలాంటి అయోమయ స్థితి ఏర్పడదు. అలాగే ప్రభుత్వాలు కూడా ఆ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement