8న జిల్లా బంద్‌

union budget against this month eight district Bandh :Left Front parties - Sakshi

కాకినాడ రూరల్‌: కేంద్ర బడ్జెట్‌లో నవ్యాంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేశారని, దీనికి నిరసనగా ఈనెల 8న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని జిల్లాలోని పది వామపక్షాలు పిలుపునిచ్చాయి. ఆదివారం సాయంత్రం కాకినాడలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన వామపక్షాల సమావేశంలో పలువురు నాయకులు బడ్జెట్‌పై చర్చించి రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం, విశాఖ రైల్వేజోన్‌ను ప్రకటించకపోవడం, ప్రత్యేక హోదా ఇవ్వకపోగా, ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వకపోవడాన్ని వామపక్ష నాయకులు తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై రాష్ట్ర వ్యాప్తంగా పది వామపక్షాలు రాష్ట్ర బంద్‌కు పిలుపు నిచ్చాయన్నారు.

అందులో భాగంగా జిల్లాలో కూడా బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంతి చంద్రబాబునాయుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో లాలూచీ పడి, రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని, ఇప్పుడు కేంద్రబడ్జెట్‌పై మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే 8వ తేదీన రాష్ట్ర బంద్‌లో పాల్గొనేలా తమ శ్రేణులకు పిలుపు నివ్వాలని వామపక్షాలు డిమాండ్‌ చేశాయి. సమాశానికి సీపీఎం (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం దుర్గాప్రసాద్‌ అధ్యక్షత వహించగా సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సీపీఎం జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు జె వెంకటేశ్వరరావు, వామపక్షాల నాయకులు ఎం రాజశేఖర్, తోకల ప్రసాద్, నక్కా కిషోర్, అంజి, జె కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest East Godavari News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top