టీడీపీ వారికే ప్రభుత్వ పథకాల లబ్ధి
ఎస్సీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నా ప్రయోజనం లేకపోయిందని, టీడీపీకి చెందిన వారైతేనే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని పొన్నూరు నియోజవర్గం పెదకాకాని మండలం
	గడప గడపకూ వైఎస్సార్‌లో ప్రజల ఆవేదన
	పట్నంబజారు (గుంటూరు):
	ఎస్సీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నా ప్రయోజనం లేకపోయిందని, టీడీపీకి చెందిన వారైతేనే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని పొన్నూరు నియోజవర్గం పెదకాకాని మండలం కొప్పరావూరు వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త రావి వెంకటరమణ గ్రామంలో గడప గడపకు వైఎస్సార్ నిర్వహించగా ఆయన ఎదుట సమస్యలు ఏకరువు పెట్టారు. పింఛన్లు, రేషన్‌కార్డులు, రుణాలు టీడీపీకి చెందినవారైతేనే అందుతున్నాయన్నారు. జిల్లాలోని పొన్నూరు, సత్తెనపల్లి, గుంటూరు పశ్ఛిమ నియోజకవర్గాల్లో శనివారం గడప గడపకూ వైఎస్సార్ జరిగింది. నాయకులు  ప్రతి గడపకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. పరిష్కారానికి పాటుపడతామనే భరోసా ఇచ్చారు. ప్రజా బ్యాలెట్‌ను అందజేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు.
	
	పింఛను అందక ఇబ్బందులు..
	సత్తెనపల్లి నియోజకవర్గం సత్తెనపల్లి మండలం దీపాలదిన్నెపాలెంలో వైఎస్సార్ సీపీ  రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గడప గడపకూ వైఎస్సార్ నిర్వహించారు. ఇంటి కోసం ఒకటికీ పదిమార్లు దరఖాస్తు చేసుకున్నా మంజూరు చేయటం లేదని,  గూడు లేక అవస్ధలు పడుతున్నామని గ్రామానికి చెందిన ఎలుకా నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. 80 ఏళ్లు నిండినా వృద్ధాప్య పింఛన్ అందడం లేదని సూర్యదేవర భానుమతి అనే వృద్ధురాలు వాపోయింది.
	
	సొంతింటి కల నెరవేరేదెప్పుడు..?
	గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్ బ్రాడీపేట 14వ అడ్డరోడ్డు పరిసర ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి గడప గడపకూ వైఎస్సార్ చేపట్టారు. ఇంటి స్థలం  కోసం దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ కా>ర్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు పేదలకు అందని ద్రాక్షలా మారాయన్నారు. రేషన్ కార్డు కోస దరఖాస్తు  చేసుకుంటే పట్టించుకునే నాథుడే లేరని మరికొందరు వాపోయారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
