రాజన్న రాజ్యం తెచ్చుకుందాం | Ys sharmila paramarsha yatra | Sakshi
Sakshi News home page

రాజన్న రాజ్యం తెచ్చుకుందాం

Oct 7 2015 12:36 AM | Updated on Jul 25 2018 4:07 PM

రాజన్న రాజ్యం తెచ్చుకుందాం - Sakshi

రాజన్న రాజ్యం తెచ్చుకుందాం

ప్రజల కష్టాలను తీర్చిన మహానేత వైఎస్సార్‌కు మరణం లేదు. ఆయన అందరి హృదయాల్లో కొలువై ఉన్నారు

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘‘ప్రజల కష్టాలను తీర్చిన మహానేత వైఎస్సార్‌కు మరణం లేదు. ఆయన అందరి హృదయాల్లో కొలువై ఉన్నారు. వైఎస్ ఆశయాల సాధన కోసం జగనన్న నాయకత్వంలో మనమంతా రాజన్న రాజ్యం సాధించుకోవాలి..’’అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి  షర్మిల అన్నారు. నిజామాబాద్ జిల్లాలో రెండోరోజు పరామర్శ యాత్రలో భాగంగా  మంగళవారం కామారెడ్డి నియోజక వర్గంలోని మాచారెడ్డి, దోమకొండ, భిక్కనూరు మండలాల్లో ఆరు కుటుంబాలను షర్మిల పరామర్శించారు. మొదట మాచారెడ్డి మండలం మొండివీరన్న తండాలో మెగావత్ మీఠ్య కుటుంబ సభ్యులను కలిశారు.

అనంతరం అన్నారం గ్రామంలో మండ్ల నడిపి బాలమణి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అక్కడ్నుంచి అటవీప్రాంతం గుండా సోమారంపేట చేరుకొని అక్కడి తండాలో గుగులోత్ గజన్ కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత దోమకొండ మండలం బీబీపేటలో వడ్ల శ్రీనివాస్, భిక్కనూరు మండలం కాచాపూర్‌లో మర్రి చిన్నపోచయ్య, భిక్కనూరు రైల్వేస్టేషన్ గ్రామంలో అరిగె మమత కుటుంబ సభ్యులను కలసి ధైర్యం చెప్పారు. వారి కష్ట సుఖాలు తెలుసుకున్నారు. ఏ ఒక్కరూ అధైర్యపడొద్దని, తాము అండగా ఉంటామని భరోసానిచ్చారు. మారుమూల గ్రామాల మీదుగా సాగిన షర్మిల పరామర్శ యాత్రలో జనం అడుగడుగునా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలుచోట్ల ప్రజలతో మాట్లాడుతూ.. వైఎస్ సేవలను గుర్తుచేశారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కోట్లాది మందికి ప్రయోజనం చేకూర్చాయని, తెలుగు ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకుంటారన్నారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు వైఎస్సార్ పేరు మార్మోగుతుందని అన్నారు.

 రెండ్రోజుల్లో 242 కిలోమీటర్లు...
 నిజామాబాద్ జిల్లాలో షర్మిల మొదటి విడత పరామర్శ యాత్ర మంగళవారం ముగిసింది. రెండ్రోజుల్లో సుమారు 242 కి.మీ.  ప్రయాణించిన షర్మిల.. బాల్కొండ, నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో 12 కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.సిద్ధార్థరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ ఇన్నారెడ్డి, రాష్ట్ర డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు పి.ప్రపుల్లారెడ్డి, మైనారిటీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ ముజతబు అహ్మద్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు బోయినపల్లి శ్రీనివాసరావు, నాడెం శాంతికుమార్, జి.రాంభూపాల్‌రెడ్డి, ఎ.గోపాల్‌రావ్, అయిలూరి వెంకటేశ్వర్‌రెడ్డి తదిత రులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement