గుండెపోటుతో కార్మికుడి మృతి | Worker died of a heart attack | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో కార్మికుడి మృతి

Jul 19 2016 6:47 PM | Updated on Mar 28 2018 11:26 AM

గుండెపోటుతో కార్మికుడి మృతి - Sakshi

గుండెపోటుతో కార్మికుడి మృతి

ఫ్యాక్టరీలో అర్ధరాత్రి విధులు నిర్వహిస్తున్న ఓ కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. బాధితుడికి సకాలంలో వైద్యం అందకనే మృతి చెందాడని, కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలంటూ మృతదేహంతో గ్రామస్తులు ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగారు.

⇒  ఆందోళనకు దిగిన బంధువులు
మృతదేహంతో ఫ్యాక్టరీ వద్ద ధర్నా
బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని యాజమాన్యం హామీ

శంషాబాద్‌ రూరల్‌ : ఫ్యాక్టరీలో అర్ధరాత్రి విధులు నిర్వహిస్తున్న ఓ కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. బాధితుడికి సకాలంలో వైద్యం అందకనే మృతి చెందాడని, కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలంటూ మృతదేహంతో గ్రామస్తులు ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మండల పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెద్దగోల్కొండ గ్రామానికి చెందిన దేశపాగ శంకరయ్య(50) రాయికుంటలో ఉన్న శ్రీకృష్ణ ఫార్మాసుటికల్‌ ఫ్యాక్టరీలో ఏడాదిన్నర కాలంగా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి అతడు విధుల్లో ఉన్నాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో శంకరయ్యకు ఛాతీలో నొప్పి వచ్చింది. గమనించిన తోటి కార్మికులు అతడిని ఫ్యాక్టరీ అంబులెన్స్‌లో శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స చేయడానికి నిరాకరించడంతో నగరంలోని ఈఎస్‌ఐ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు శంకరయ్య అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న స్థానికులు, వివిధ పార్టీల నాయకులు మంగళవారం ఫ్యాక్టరీ వద్ద పెద్దఎత్తున గుమిగూడారు. శంకరయ్య మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీలో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో లేవని, ఈ కారణంగానే శంకరయ్య మృతి చెందాడని ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుని న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్రిక్తత తలెత్తే అవకాశం ఉందని పోలీసులు ఫ్యాక్టరీ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీపీ అనురాధ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మధ్యాహ్నం వరకు ఆందోళన కొనసాగగా.. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో పలు దఫాలుగా యాజమాన్యం చర్చలు జరిపింది. శంకరయ్య కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహానికి స్థానిక క్లష్టర్‌ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి అనంతరం కుటుంబీకులకు అందజేశారు. మృతుడికి భార్య, నలుగురు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement