పాపం పల్లవి..

పాపం పల్లవి..


  మృత్యువుతో పోరాడి తిరిగిరాని లోకాలకు..

 ప్రేమ వేధింపులకు మరో యువతి బలి

 చాంద(టి)లో విషాదం

 అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు


పాపం పల్లవి.. కన్ను మూసింది. ప్రేమ వేధింపులతో జీవితాన్నే చాలించింది. కాలిన గాయాలతో ఏడు రోజులుగా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి.. చివరికి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఎంతో జీవితం ఉన్న పల్లవిని ఓ యువకుడి రూపంలో మృత్యువు ఇలా వెంటాడింది. పుట్టినప్పుడే తల్లి ప్రేమకు దూరమై.. పెంచి పెద్ద చేసిన నానమ్మ, తాతయ్యలకూ ఇప్పుడు దూరమైంది. వారికి తీరని శోకాన్ని మిగిల్చింది.ఆదిలాబాద్ రూరల్ : ఆదిలాబాద్ మండలం చాంద(టి) గ్రామానికి చెందిన పల్లవి(17) ఈ నెల 14న ఇంట్లోనే వేకువజామున ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకుంది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు రిమ్స్‌కు తరలించి చికిత్స అందజేశారు. తండ్రి దేవిదాస్ ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. తన ఆత్మహత్యకు యువకుడి వేధింపులే కారణమని పల్లవి రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో వాంగ్మూలం ఇచ్చినట్లు అప్పట్లో పోలీసులు తెలిపారు. కాగా, ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో రిమ్స్ వైద్యుల సలహా మేరకు పల్లవిని అదే రోజు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందినా పరిస్థితి మెరుగు కాకపోవడంతో బుధవారం రాత్రి మృతిచెందింది. దీంతో చాందా(టి)లో విషాదం అలుముకుంది. గురువారం గ్రామ శివారులో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, ఫిర్యాదు చేసిన వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వేధింపులకు పాల్పడిన జైనథ్ మండలం లేఖర్‌వాడకు చెందిన యువకుడు చంద్రశేఖర్‌ను అరెస్టు చేసి ఇదివరకే రిమాండ్‌కు తరలించారు. పల్లవి జీవితమే విషాదం

పల్లవి జీవితంలో అన్నీ విషాదాలే ఉన్నాయి. ఆమె పుట్టిన రెండు నెలలకే తల్లి మృతిచెందింది. ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేసే తండ్రి దేవిదాస్ అప్పట్లోనే మరో వివాహం చేసుకోవడంతో పల్లవి తన తాతయ్య, నానమ్మ బాపురావు, లసుంబాయిల వద్దే పెరిగింది. వారు కూడా తల్లి లేని పిల్లను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఆమె జీవితంపై అందమైన కలలు కన్న వారికి ఒక్కసారిగా పల్లవి మృతి విషాదం నింపింది. ఆమె వివాహం తమ చేతులమీదుగా చేద్దామనుకున్న వారికి ఈ సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒకవేళ ఆస్తి పంపకాలు చేస్తే తల్లి లేని పిల్ల పల్లవి వివాహంలో ఇబ్బందులు అవుతాయని భావించిన తాత, నానమ్మలు తమ ముగ్గురు కుమారులకు ఆస్తి పంపకాలు చేయకపోవడం ఇక్కడ వారి మమకారాన్ని స్పష్టం చేస్తోంది. ప్రేమ భూతానికి బలి..

పల్లవి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివేది. రోజు బస్సు, ఆటోల ద్వారా రాకపోకలు సాగించేది. ఈ క్రమంలో ఆదిలాబాద్ పట్టణంలో పల్లవిని చూసిన జైనథ్ మండలం లేఖర్‌వాడకు చెందిన చంద్రశేఖర్ తనను ప్రేమించాలని ఆమె వెంట పడ్డాడు. ఈ పరిణామాలతో పల్లవి మనోవేదనకు గురైంది. యువకుడు వేధిస్తున్నాడని ఇంట్లో తెలియజేయడంతో తండ్రి కానిస్టేబుల్ దేవిదాస్ ఆదిలాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఘటనకు ఐదు రోజులు ముందు ఫిర్యాదు చేశారు. కానీ ఫిర్యాదు దర్యాప్తులో పోలీసులు జాప్యం చేశారని పల్లవి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. త్వరగా స్పందించి ఇలా జరిగేది కాదని వారి వాదన.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top