నాకు, బిడ్డలకు న్యాయం చేయండి!
తోటపల్లిగూడూరు:
భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తనను అత్త, బావలు కలిసి ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధికారులు న్యాయం చేసి ఆదుకోవాలంటూ నరుకూరు చెందిన ఓ మహిళ తన ఇంటి ముందు దీక్షకు దిగింది
-
బిడ్డలతో ఇంటి ముందు దీక్షకు దిగిన ఓ మహిళ
తోటపల్లిగూడూరు:
భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తనను అత్త, బావలు కలిసి ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధికారులు న్యాయం చేసి ఆదుకోవాలంటూ నరుకూరు చెందిన ఓ మహిళ తన ఇంటి ముందు దీక్షకు దిగింది. ఈ మేరకు గురువారం బాధితరాలు నాశిన సరిత మాట్లాడుతూ పదేళ్ల కిందట నరుకూరు సెంటర్‌కు చెందిన నాశిన సుబ్బయ్యతో తన వివాహమైందన్నారు. అత్త(అమ్మమ్మ) నాశిన రమణమ్మ చీటీలు కడుతూ పలువురికి కొంత బాకీ అయిందన్నారు. ఈ క్రమంలో చీటీలు కట్టుకునే వారు ఏడాది కిందట తాము ఉన్న ఇంటిని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. దాంతో ఇటు భర్తను కోల్పోయి, అటు ఇంటిని దూరం చేసుకొని పిల్లలతో కలిసి తోటపల్లిగూడూరులో ఉన్న తల్లిదండ్రుల వద్ద ఉంటున్నానన్నారు. ఆయితే తమ ఇంటిని స్వాధీనం చేసుకునే సమయంలో తన బావ అయిన హరి ఇంటిలో సగ భాగం ఇప్పిస్తామని స్థానికులైన కొందరు పెద్దలు మధ్యస్తం చేశారన్నారు. ఏడాది గడుస్తున్నా తన బావ ఇంటిలో సగ భాగం తమకు దక్కలేదన్నారు. మద్యస్థం చేసిన పెద్దలు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. పోలీసులను ఆశ్రయించినా వారు స్పందించ లేదన్నారు. ఇక విధిలేని పరిస్థితిలో బిడ్డలతో కలిసి తన ఇంటి ముందే దీక్షకు దిగడం జరిగిందన్నారు. స్థానికులు స్వాధీనం చేసుకున్న ఇంట్లోనైనా, తన భావ హరి ఇంట్లోనైనా సగం భాగం ఇవ్వందే దీక్ష విరమించబోనన్నారు. రెండు రోజులుగా చిన్న బిడ్డలతో కలసి దీక్ష చేస్తున్నా ఎరూ పట్టించుకోకపోడం బాధగా ఉందన్నారు. జిల్లా ఉన్నతాధికారులైనా ఈ విషయంపై స్పందించి తనకు, తన బిడ్డలకు న్యాయం చేయాలనీ బాధితురాలు కోరుతోంది.