భర్త ఇంటి ముందు దీక్ష
చేజర్ల : ప్రేమించి పెళ్లి చేసుకున్న తనను వేధించి, మరో యువతితో ఉడాయించిన భర్త ఇంటి ముందు తనకు న్యాయం చేయాలని కోరుతూ కుమార్తెతో కలిసి భార్య ఆదివారం ధర్నాకు దిగింది.
-
పురుగు మందు డబ్బాతో ఆత్మహత్యే శరణ్యం అంటున్న తల్లి కూతుళ్లు
చేజర్ల : ప్రేమించి పెళ్లి చేసుకున్న తనను వేధించి, మరో యువతితో ఉడాయించిన భర్త ఇంటి ముందు తనకు న్యాయం చేయాలని కోరుతూ కుమార్తెతో కలిసి భార్య ఆదివారం ధర్నాకు దిగింది. పురుగు మందు డబ్బా చేతబట్టి తనకు న్యాయం చేయాలని, లేకపోతే ఆత్మహత్యే శరణ్యమని గొల్లుమంది. ఈ ఘటన మండలంలోని మడపల్లి ఎస్సీ కాలనీలో చోటు చేసుకుంది. స్థానికులు, మహిళ బంధువుల కథనం మేరకు.. మడపల్లి ఎస్సీ కాలనీకి చెందిన జువ్వుగుంట బాబు నెల్లూరు డిపో–1లో ఆర్టీసీ కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. 13 ఏళ్ల క్రితం మండలంలోని టీకేపాడుకు చెందిన ఆదిలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. ఆ తర్వాత వారి కాపురంలో కలతలు చోటు చేసుకున్నాయి. ఈక్రమంలో మండలంలోని చిత్తలూరుకు చెందిన అనితఅనే యువతితో బాబుకు పరిచయం కావడంతో ఇద్దరూ జూన్15వ తేదీన ఉడాయించాడు. అయితే అప్పటి నుంచి పోలీసుల చుట్టూ తిరుగుతూనే ఉంది. తనకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీని కలిసినా ఫలితం లేదని వాపోయింది. అధికారుల చుట్టు తిరిగితిరిగి విసిగిపోయిన ఆదిలక్ష్మి ఆదివారం తన కూతురు మేఘాతో కలిసి పురుగు మందు చేత పట్టి భర్త ఇంటి ముందు దీక్షకు దిగింది. తనకు న్యాయం జరిగేంత వరకు దీక్షను ఆపనని భగ్నం చేయాలని చూస్తే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించింది. తన అత్త, మామలు సైతం భర్తకు మద్దతు పలుకుతున్నారని వాపోయింది. అనిత తరచూ తనకు ఫోన్ చేసి రెండో భార్యగా ఒప్పుకోవాలని, తనతో కలిసి రావాలని లేదంటే తనను, కుమార్తెను చంపేస్తానని బెదిరిస్తుందని ఆందోళన వెలిబుచ్చింది. ఈ విషయమై ఎస్సై సుభాని మాట్లాడుతూ బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో అతన్ని అరెస్ట్ చేస్తామని చెప్పారు.