కొత్త నగర పంచాయతీల ఏర్పాటు అటకెక్కినట్లేనా..? | Sakshi
Sakshi News home page

కొత్త నగర పంచాయతీల ఏర్పాటు అటకెక్కినట్లేనా..?

Published Mon, Dec 19 2016 12:25 AM

కొత్త నగర పంచాయతీల ఏర్పాటు  అటకెక్కినట్లేనా..?

 
అనంతపురం అర్బన్  :  జిల్లాలో కొత్తగా మూడు మేజర్‌ పంచాయతీలను నగర పంచాయతీలుగా (మునిసిపాలిటీలు) మార్పు ప్రక్రియ అటకెక్కినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం కోరిన ప్రకారం కొత్తగా ఏర్పాటు చేయాల్సిన నగర పంచాయతీలకు సంబంధించిన ఫైలును ప్రభుత్వానికి జిల్లా పంచాయతీ అధికారులు ఆరు నెలల క్రితమే పంపించారు. అయితే ఏర్పాటు ప్రక్రియ చేపడుతున్నారా? లేదా అనేదానిపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అధికారులకు ఎలాంటి సమాచారం లేదని తెలిసింది. జిల్లాలో 25 వేలు జనాభా దాటిన మూడు మేజరు పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్పు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. అంతే కాకుండా ఉరవకొండ, పెనుకొండ, ఎ.నారాయణపురం మేయర్‌ పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్పు చేయాలని ప్రభుత్వమే నిర్ణయించిం ది. ఇందుకు సంబంధించి జనాభా, భౌగోళిక పరిస్థితి, విస్తీర్ణం, ఆదాయ, వ్యయాల వివరాలను నివేదించాలని అదేశించింది. ప్రభుత్వం కోరిన విధంగా అన్ని వివరాలతో ఫైలును ఇక్కడి జిల్లా పంచాయతీ కార్యాలయం అధికారుల పంపించారు. 
ఆరు నెలలు దాటింది   
కొత్తగా ఏర్పాటు కానున్న ఉరవకొండ, పెనుకొండ, ఎ.నారాయణపురం నగర పంచాయతీలకు సంబంధించి సమగ్ర సమాచారం, వివరాలతో కూడిన ఫైలును ప్రభుత్వానికి పంపించి, ఆరు నెలలు దాటినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే వీటి ఏర్పాటు ప్రక్రియకు సంబంధించిన జీఓను ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదు. దీన్ని బట్టి చూస్తే కొత్త నగర పంచాయతీల ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం పక్కకు పెట్టినట్లు కనిపిస్తోంది.     

Advertisement

తప్పక చదవండి

Advertisement