చౌక ధరల దుకాణాలు 'విలేజ్ మాల్స్'గా పరిగణిస్తూ, అన్ని రకాల సరుకులు విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని ఇన్‌చార్జి కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు.
అనంతపురం అర్బన్ : చౌక ధరల దుకాణాలు 'విలేజ్ మాల్స్'గా పరిగణిస్తూ, అన్ని రకాల సరుకులు విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని ఇన్‌చార్జి కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. ఇక నుంచి ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం, గోధుమ పిండి, చక్కెర, కిరోసిన్‌తో పాటు కందిపప్పు, ఉప్పు, ఉల్లిపాయలు, సబ్బులు, ఇతర నిత్యావసర వస్తువులు విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈ అంశంపై బుధవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో బ్యాంకర్లు, పౌర సరఫరాల శాఖ, సంస్థ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రతి చౌక దుకాణానికి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ఇవ్వాలని లక్ష్మీకాంతం బ్యాంకర్లకు సూచించారు. డీలర్లను బిజినెస్ కరస్పాండెంట్లుగా నియమించాలన్నారు. పాయింట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్) యంత్రాల వినియోగం, ఆన్‌లైన్ లావాదేవీలుపై గురువారం డివిజన్ వారీగా ఎంపీడీఓలు, ఏపీఎంలు, ఏపీఓలకు జిల్లా కేంద్రంలో శిక్షణ ఇవ్వాలన్నారు.