విల పింఛెన్‌


కొవ్వూరు : భద్రత ఐదు రెట్లు అంటూ ప్రచార ఆర్భాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తోంది. అర్హత ఉన్నా సామాజిక పింఛన్లు అందక వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు కాళ్లరిగేలా అధికారులు, ప్రజాప్రతి నిధుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రతి సోమవారం మండల స్థాయిలో నిర్వహించే మీకోసం కార్యక్రమాల్లో వచ్చే వినతుల్లో మూడొంతులు పింఛన్లకు సంబంధించే ఉంటున్నాయి. కనిపించిన  ప్రతి అధికారికి దరఖాస్తులిస్తూ.. పింఛను ఇప్పించాలని వేలాదిమంది దీనంగా వేడుకుంటున్నా వారిపై చంద్రబాబు సర్కారు కనికరం చూపడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 24 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మీ కోసం కార్యక్రమంలో అందిన దరఖాస్తులను కలిపితే ఆ సంఖ్య 30 వేలకు పైనే ఉంటుందని అంచనా. 

 

కొత్త వారికి దక్కని చోటు

జిల్లాలో వివిధ సామాజిక పథకాల కింద 3,39,083 మందికి పింఛన్లు ఇస్తున్నట్టు సర్కారు చెబుతోంది. వీరిలో 1,56,827 మంది వృద్ధులు కాగా, 1,06,308 మంది వితంతువులు ఉన్నారు. 44,409 మంది దివ్యాంగులు, 1,977 మంది కల్లుగీత కార్మికులు పింఛన్లు పొందుతుండగా, 26,399 మంది అభయహస్తం పథకం కింద పింఛన్లు ఇస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మొత్తంగా అన్ని పథకాల కింద పింఛన్లు పొందుతున్న వారిలో 900 నుంచి 1,100 మంది ప్రతినెలా మృత్యువాత పడుతున్నట్టు డీఆర్‌డీఏ వర్గాలు చెబుతున్నాయి. సగటున నెలకు వెయ్యి మంది పింఛనుదారులు మరణిస్తున్నట్టు అంచనా. మరణించిన వారి స్థానంలో కొత్త వారికి పింఛన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. జిల్లాలో ఎక్కడా ఆ దాఖలాలు కనిపించడం లేదు. గడచిన ఏడాది కాలంలో మరణించిన వారి స్థానంలో కొత్తగా ఒక్కరికి కూడా పింఛను మంజూరు కాలేదు. 

 

పాత పింఛన్లకూ కొర్రీలు

 కొత్త పింఛన్ల మంజూరు విషయాన్ని పక్కనపెడితే..  ఇప్పటికే పింఛన్లు పొందుతున్న పాత వారికి వివిధ కారణాలతో చెల్లించకుండా ఎగవేస్తున్నారు. వరుసగా మూడు నెలలపాటు పింఛను సొమ్ము తీసుకోకపోతే వారి పేర్లను శాశ్వతంగా తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మొదట్లో గుర్తింపు కార్డుల ఆధారంగా పింఛను సొమ్ము చెల్లించేవారు. ఆ తరువాత వేలిముద్రలు, కనురెప్పలు (ఐరిస్‌) ద్వారా అందిస్తున్నారు. వేలిముద్రలు పడనివారు, పొరుగూళ్లకు వెళ్లిన వారు మరుసటి నెలలో అయినా సొమ్ము అందుకునే వీలుండేది. లబ్ధిదారుల్లో కొందరి పేర్లు మాయమవుతున్నాయి. కనురెప్పలు, వేలిముద్రలు పడని వారికి గ్రామాల్లో అయితే వీఆర్వోలు, పట్టణాల్లో అయితే బిల్లు కలెక్టర్ల వేలిముద్ర ద్వారా సొమ్ము ఇచ్చేవారు. తాజాగా, అందులోనూ అక్రమాలు జరుగుతున్నా నెపంతో కొర్రీలు వేస్తున్నారు. ఈ తరహా కేసులు 5 శాతం మించకూడదని సర్కారు ఆంక్షలు విధించగా, అధికారులు మరో అడుగు ముందుకేసి 2 శాతం మించకూడదనే నిబంధన పెట్టారు. ఫలితంగా వేలిముద్రలు, కనురెప్పలు పడని వారిలో చాలామంది సొమ్ము తీసుకోలేక సతమతం అవుతున్నారు.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top