అంగన్‌వాడీ పిల్లలకు యూనిఫాం

అంగన్‌వాడీ పిల్లలకు యూనిఫాం

 •   శిశు, మహిళా సంక్షేమశాఖ ప్రత్యేక కమిషనర్‌ చక్రవర్తి వెల్లడి 

 •  గుంటూరు వెస్ట్‌:  రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ సెంటర్లలో సుమారు 11 లక్షల 50 వేల మంది పిల్లలు ఉన్నారని, వారికి యూనిఫాం విధానాన్ని అమలు చేయబోతున్నట్టు శిశు, మహిళా సంక్షేమశాఖ ప్రత్యేక కమిషనర్‌ చక్రవర్తి వెల్లడించారు. స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవర్గాల సహకారంతో పిల్లలకు యూనిఫాం అందించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రానున్న మూడేళ్లలో అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు శిశు, మహిళా సంక్షేమశాఖ ప్రత్యేక కమిషనర్‌ కేఆర్‌బీహెచ్‌ఎన్‌ చక్రవర్తి తెలిపారు. శిశు, మహిళా సంక్షేమశాఖ జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా 30 వేల కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయన్నారు. 25 వేల కేంద్రాలకు భవనాలు నిర్మించాల్సి ఉండగా, 4 వేల భవనాలు నిర్మాణదశలో ఉన్నట్టు చెప్పారు. రూ.7.50 లక్షల వ్యయంతో ఒక్కొక్క భవనాన్ని నిర్మించనున్నట్టు చెప్పారు. ఇందులో రూ.5 లక్షలు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులు, 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.50 వేలు, శాఖాపరంగా రూ.2 లక్షలు ఖర్చుచేయనున్నట్టు తెలిపారు. ఇటీవల 6,600 భవనాల నిర్మాణాలకు పరిపాలనపరమైన అనుమతులు లభించాయని, 1500 భవనాల పనులు ప్రారంభించినట్టు తెలిపారు. 

  బోధనా పద్ధతులపై వర్కర్లకు శిక్షణ

   

    అంగన్‌వాడీ సెంటర్ల ద్వారా పిల్లలకు మంచివిద్యను అందించేందుకుగాను  ఈనెల 8వ తేదీ నుంచి ఇంగ్లీష్‌తోపాటు బోధనా పద్ధతులపై రాష్ట్రవ్యాప్తంగా వర్కర్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. అంగన్‌వాడీ సెంటర్లలో బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేసి పిల్లల హాజరు నమోదుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 

  యూనియన్లలో చేరమని ఒత్తిడి చేస్తే చర్యలు

   

   అంగన్‌వాడీ కార్యకర్తలను అధికార పార్టీ యూనియన్‌లో చేరమని సూపర్‌వైజర్లు, సీడీపీఓలు, ఇతర సిబ్బంది ఎవరైనా ఒత్తిడిచేస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు. యూనియన్లను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ కార్యకర్తలకు ఉంటుందన్నారు.  

   

   
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top