ముళ్ల పొదల తొలగింపుతో రెండో చిరుత లేదని తేలింది.
= కలియదిరిగిన అటవీ సిబ్బంది
= జేసీబీలతో ముళ్లపొదల తొలగింపు
= తేల్చిన అధికారులు
రాయదుర్గం : ముళ్ల పొదల తొలగింపుతో రెండో చిరుత లేదని తేలింది. పట్టణ నడిబొడ్డున గురువారం చిరు త రేపిన కలకలం నుంచి ప్రజలు ఇంకా తేరుకోలేదు. ఒక చిరుతను వలవేసి పట్టుకుని కళ్యాణదుర్గం రేంజ్ ఆఫీసుకు తీసుకెళ్లి, అక్కడి నుంచి బుక్కపట్నం అడవుల్లో వదిలేసినట్లు ఫారెస్ట్ అధికారులు ప్రకటించారు. అయితే గురువారం రాత్రి 10.30 గంటలకు అదే ముళ్లపొదల్లో మరో చిరుత ఉందని, మేము చూశామని ఫారెస్ట్ అధికారులకు స్థానికులు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కూడా సంఘటనా స్థలాన్ని రాత్రి పరిశీలించారు. రెవెన్యూ, పోలీస్, అటవీ శాఖ అధికారులను అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి హాని జరగకూడదని ఆదేశించారు. దీంతో ఫారెస్ట్ అధికారులు రాత్రంతా ముళ్లపొదల చుట్టూ పహారా కాశారు. శుక్రవారం ఉదయం బోను తెప్పించి పొదల్లో కలియతిరిగారు. చిరుత లేదని తేలింది. అయినా ప్రజల్లో అనుమానం తగ్గలేదు. దీంతో సీఐ చలపతిరావు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీపతినాయుడు, మునిసిపల్ చైర్మన్ రాజశేఖర్, కౌన్సిలర్ గాజుల వెంకటేశులు జేసీబీలను తెప్పించి ముళ్లపొదలను తొలగింపజేయడంతో ప్రజల్లో అనుమానం పోయింది. అయితే రాత్రిపూటే చిరుత కొండల్లోకి వెళ్లిపోయి ఉంటుందని ప్రజలు చర్చించుకున్నారు.