ఎకరం.. రూ.140 కోట్లపైనే! | Rayadurgam Land Price Soars to Rs 104 Crore Per Acre | Sakshi
Sakshi News home page

ఎకరం.. రూ.140 కోట్లపైనే!

Sep 20 2025 12:45 AM | Updated on Sep 20 2025 12:45 AM

Rayadurgam Land Price Soars to Rs 104 Crore Per Acre

బిడ్‌ దాఖలుకు పలు నిర్మాణ సంస్థలు సిద్ధం

ఎఫ్‌ఎస్‌ఐపై ఆంక్షలున్నా.. అధిక ధర పెట్టేందుకు రెడీ

ఐటీ, జీసీసీ, వాణిజ్య కేంద్రాలకు ఫుల్‌ డిమాండ్‌

ఇప్పటికే 34 మంది బిడ్డర్ల దరఖాస్తు

వచ్చే నెల 6న రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలో భూముల ఈవేలం

సాక్షి, హైదరాబాద్‌: భూముల వేలంతో భారీగా నిధులు సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కనిష్టంగా రూ.2 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. ఈ మేరకు హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన రాయదుర్గంలో భూములను వేలం వేయనుంది. నాలెడ్జ్‌ సిటీలోని 18.67 ఎకరాలను ఈవేలానికి తెలంగాణ ఇండ్రస్టియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (టీజీఐఐసీ) అన్ని ఏర్పాట్లు చేసింది. ఒక ఎకరానికి ప్రారంభ ధర రూ.101 కోట్లుగా నిర్ణయించింది. అయితే పలు నిర్మాణ సంస్థలు ఎకరాకు రూ.140 కోట్లకు పైగానే వెచ్చించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో కోకాపేట నియోపోలిస్‌ ఫేజ్‌2లో హెచ్‌ఎండీఏ నిర్వహించిన వేలంలో రికార్డ్‌ స్థాయిలో ఎకరం రూ.100 కోట్లు పలికిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అంతకు మించి ధర పలకడం ఖాయమని రియల్టీ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఆంక్షలున్నా.. తగ్గేదేలే..: సర్వే నంబర్‌ 83/1 ప్లాట్‌ నంబర్‌ 19లో 11 ఎకరాలు, ఇదే సర్వే నంబర్‌లో ప్లాట్‌ నంబరు 15 ఏ/2లో 7.67 ఎకరాలను టీజీఐఐసీ వేలం వేయనుంది. అయితే ఈ సర్వే నంబర్‌ ఎయిర్‌పోర్ట్‌ జోన్‌ పరిధిలోకి వస్తోంది. 2022లో ఏఏఐ నిబంధనలను సవరించింది. ఈ మేరకు ఈ ప్రాంతంలో అపరిమిత భవన నిర్మాణ ఎత్తు (ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌ఎఫ్‌ఎస్‌ఐ)కు అనుమతి లేదు.

ప్లాట్‌ నంబరు 19లో ఎఫ్‌ఎస్‌ఐ 80 మీటర్లు, ప్లాట్‌ నంబరు 15లో ఎఫ్‌ఎస్‌ఐ 65 మీటర్ల వరకు మాత్రమే అనుమతి ఉంది. ఎఫ్‌ఎస్‌ఐపై ఆంక్షలున్నప్పటికీ అధిక ధర పెట్టేందుకు బిడ్డర్లు వెనుకాడటం లేదని తెలుస్తోంది. 470 ఎకరాలలో విస్తరించి ఉన్న నాలెడ్జ్‌ సిటీలో వందకు పైగా ఐటీ, ఐటీఈఎస్‌ కంపెనీలున్నాయి. బిజినెస్‌ హబ్‌గా అత్యంత శరవేగంగా అభివృద్ధి చెందిన ఈ ప్రాంతం బహుళ జాతి సంస్థలు, గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ)కు నిలయంగా మారడంతో ఎలాగైనా భూమిని దక్కించుకోవాలనే బిడ్డర్లు పోటీపడుతున్నారు.

34 మంది బిడ్డర్లు దరఖాస్తు..
వచ్చే నెల 6న జరగనున్న ఈ వేలంలో పాల్గొనేందుకు దేశ, విదేశీ నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే నాన్‌ రీఫండబుల్‌ డాక్యుమెంట్‌ ఫీజు కింద ప్లాట్‌కు రూ.10 లక్షల చొప్పున చెల్లించి సుమారు 34 మంది బిడ్డర్లు టీజీసీఐఐసీకి దరఖాస్తు చేసినట్లు తెలిసింది. వీరితో పాటు పలువురు స్థానిక పెట్టుబడిదారులు, డెవలపర్లు జాయింట్‌ వెంచర్‌గా ఏర్పడి వేలంలో పాల్గొనన్నారు. పలు నిర్మాణ సంస్థలు ఎకరానికి రూ.140 కోట్లకు పైగానే బిడ్డింగ్‌ చేయనున్నట్లు తెలిసింది. బహుళ జాతి సంస్థల కార్యాలయాలు, ఐటీ, ఐటీఈఎస్‌ కంపెనీలు, వినోద కేంద్రాలు, బహుళ అంతస్తుల భవనాలు, అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో రాయదుర్గం అభివృద్ధి చెందిన ప్రాంతం కావడంతో ఇక్కడి స్థలాలకు డిమాండ్‌ అధికంగా ఉంది.

వేలంతో మార్కెట్‌లో బూమ్‌..
ఈ భూముల వేలంతో మార్కెట్‌లో బూమ్‌ ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ భూములు వేలంలో ఎంతకైతే ధర పలుకుతాయో చుట్టుపక్కల స్థలాలు కూడా అంతే ధర పలుకుతాయి. అయితే ఈ పరిణామం స్థానిక పెట్టుబడిదారులు, డెవలపర్లకు కొంత వరకు ఇబ్బందే అని నిపుణులు అంటున్నారు. అంత ధర పెట్టి ప్రాజెక్ట్‌లను చేపట్టినా అంతిమంగా ఆ భారం కొనుగోలుదారుల మీదనే పడుతుందని చెపుతున్నారు.

ఐటీ, ఐటీఈఎస్, కమర్షియల్, రిటైల్, రెసిడెన్షియల్, హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్, ఎంటర్‌టైన్‌మెంట్‌.. ఇలా మల్టీ జోన్‌ ప్రాంతమైన రాయదుర్గం నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు, మెట్రో, విమానాశ్రయంతో సులువైన కనెక్టివిటీ ఉంది. ఇక్కడినుంచి రాయదుర్గం మెట్రో స్టేషన్‌కు 5 నిమిషాలు, ఔటర్‌ జంక్షన్‌కు 6 నిమిషాలు, ఫైనాన్షియల్‌ డి్రస్టిక్ట్‌/విప్రో జంక్షన్‌కు, హెచ్‌ఐసీసీ/హైటెక్స్‌కు 15 నిమిషాలు, ఎయిర్‌పోర్ట్‌కు 40 నిమిషాల ప్రయాణ వ్యవధి ఉంటుంది. దీంతో ఇక్కడి భూములకు డిమాండ్‌ అధికంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement