దారి దోపిడీ కలకలం | theft in road side | Sakshi
Sakshi News home page

దారి దోపిడీ కలకలం

Dec 4 2016 10:48 PM | Updated on Aug 30 2018 5:38 PM

దారి దోపిడీ కలకలం - Sakshi

దారి దోపిడీ కలకలం

దేమకేతేపల్లి గ్రామపంచాయతీలోని యగ్నిశెట్టిపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో దారిదోపిడీ జరిగింది.

పల్సర్‌లో వచ్చి.. కత్తులు చూపించి..
3 సెల్‌ఫోన్లు, రూ.11వేల నగదు, 4 తులాల బంగారు అపహరణ


చిలమత్తూరు : దేమకేతేపల్లి గ్రామపంచాయతీలోని యగ్నిశెట్టిపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో దారిదోపిడీ జరిగింది. ముగ్గురు సభ్యులు గల ముఠా మారణాయుధాలు చూపి సెల్‌ఫోన్లు, నగలు, నగదు దోచుకుని బైక్‌పై ఉడాయించింది. ఈ ఘటన కలకలం రేపింది. కొత్త చామలపల్లికి చెందిన నాగేంద్రబాబు తన చిన్నాన్న చలపతి కుమార్తె శ్వేత వివాహం ఆదివారం కనుమలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉండటంతో శనివారం సాయంత్రమే అక్కడకు చేరుకున్నాడు. అదే రోజు రాత్రి 10.30 గంటల సమయంలో యగ్నిశెట్టిపల్లిలోని చుట్టాల ఇంటికి బంధువులు అనసూయమ్మ, నాగమణిలను పిలుచుకుని ద్విచక్రవాహనంలో బయల్దేరాడు. ఈ క్రమంలో ముగ్గురు దుండగులు పల్సర్‌ (కేఏ 04హెచ్‌ఎక్స్‌ 2806)బైక్‌లో ఓవర్‌ టేక్‌ చేసి నాగేంద్రబాబును అటకాయించారు. కత్తులతో బెదిరించి నాగేంద్రబాబు, అతని బంధువుల వద్ద గల మూడు సెల్‌ఫోన్లు, రూ.11 వేల నగదు, 4 తులాల బంగారు గొలుసులు లాక్కెళ్లారు.

దుండగుల బైక్‌ పట్టుబడిందిలా..
కనుమలోని వివాహ మండపం వద్దకు చేరుకున్న బాధితుడు నాగేంద్రబాబు అక్కడి నుంచి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్‌ఐ జమాల్‌బాషా, పోలీసులు కనుమ వద్దకు చేరుకుని బాధితులకు చెందిన మూడు సెల్‌ నంబర్లకు ఫోన్‌ చేయగా బ్రహ్మేశ్వరంపల్లి గ్రామస్తులు ఓ నంబర్‌ లిఫ్ట్‌ చేసి మాట్లాడారు. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు గ్రామంలో అనుమానాస్పదంగా వాహనంపై వెళ్తుంటే ఆపామని, వారు బైక్‌ను వదిలి అటవీ ప్రాంతంలోకి పరుగులు తీశారని, ఆ సమయంలో సెల్‌ ఫోన్‌ కింద పడిపోయిందని పోలీసులకు వివరించారు. గ్రామానికి చేరుకున్న ఎస్‌ఐ స్థానికుల సహాయంతో అర్ధరాత్రి 12 గంటల వరకు అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement