సింగూరు సిన్నబోయింది..

సింగూరు సిన్నబోయింది..


♦ ప్రాజెక్టు ఎండిపోవడంతో ముంచుకొచ్చిన ముప్పు

♦ తాగడానికి అనువైన నికర జలాలు 0.9 టీఎంసీలే

♦ మెతుకుసీమలోని 511 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి

♦ మంజీరలో అందని నీళ్లు.. పరిశ్రమలకూ బందే..

 

 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సింగూరు ప్రాజెక్టు ఎండిపోవడంతో మెదక్ జిల్లాలోని 500 గ్రామాలు తాగునీటికి తిప్పలు పడుతున్నాయి. దీనికితోడు జంటనగరాలకు తాగునీటిని అందించే మంజీర రిజర్వాయర్‌లోనూ నీటి నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో కేవలం 1.45 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇందులో 0.9 టీఎంసీలు మాత్రమే తాగడానికి అనుకూలం. మిగిలినదంతా బురదే. మెదక్ జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లోని 511 గ్రామాలకు తాగునీటిని అందించే ఇన్‌టెక్ వెల్స్‌కు దూరంగా నీళ్లు వెళ్లిపోవడంతో ఆయా గ్రామాల వారు నీటి సమస్యతో సతమతమవుతున్నారు. కొండాపూర్, జహీరాబాద్, రేగోడ్, తూప్రాన్, వర్గల్ మండలాలకు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.సంగారెడ్డి, సదాశివపేట, గజ్వేల్, దుబ్బాక  మండలాలకు మూడు, నాలుగు రోజులకోసారి నీరు వదులుతున్నారు. ఇందులో కూడా రోజువారీగా సరఫరా చేయాల్సిన సగటు జలాల్లో కేవలం 30 శాతమే వదులుతున్నారు. దీంతో మంచి నీటికోసం జనం అవస్థలు పడుతున్నారు. డ్యామ్‌లో నీటి నిల్వలు లేకపోవడంతో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఉన్న నీటిని విద్యుత్ మోటార్ల ద్వారా తోడి హైదరాబాద్‌కు పంపిణీ చేస్తున్నారు. ఇలాగే నిరంతరాయంగా నీటిని తోడేస్తే కేవలం 10 రోజుల్లో ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోతుందని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సింగూరు నుంచి నీటిని తోడటం తక్షణమే నిలిపి వేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరినట్టు తెలిసింది.  జంటనగరాల ప్రజల తాగునీటి అవసరాల కోసం కృష్ణా, గోదావరి జలాలను తరలించాలని హరీశ్ సీఎంకు సూచించినట్లు తెలుస్తోంది. దీనికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి మెట్రో వాటర్ వర్క్సు బోర్డు ఎండీకి ఫోన్ చేసి సింగూరు నుంచి నీళ్లు తోడటం నిలిపివేయాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. వట్టిపోయిన మంజీరా నది

 గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం రోజుకు 120 ఎంజీడీ (మిలియన్ గ్యాలన్స్ పర్‌డే)నీటిని, దుబ్బాక, సంగారెడ్డి, గజ్వేల్, మెదక్ పటాన్‌చెరు,నియోజక వర్గాల దాహాన్ని తీర్చేందుకు, పరిశ్రమల అవసరాల కోసం మరో 50 ఎంజీడీ నీటిని సింగూరు ప్రాజెక్టు నుంచి నిత్యం విడుదల చేస్తున్నారు. నీటిని సరఫరా చేసే క్రమంలో మరో కనీసం 10 ఎంజీడీల జలం వృథా అవుతుందని అంచనా. ఈ లెక్కన చూస్తే రోజుకు 180ఎంజీడీ నీటిని సింగూరు నుంచి తోడేస్తున్నారు. 30 రోజులకు ఒక టీఎంసీలను  తాగు అవసరాల కోసం వాడుకుంటున్నారు. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో నీటిమట్టం  కూడా పూర్తిగా అడుగంటి పోయింది.తాజా లెక్కల ప్రకారం సింగూరు ప్రాజెక్టులో 1.45 టీఎంసీ నీళ్లు మాత్రమే ఉన్నాయి. దీనిలో 0.05 టీఎంసీ నీళ్లు బురదగా ఉంటాయి. దీంతో నికరంగా కనిపించే ది 0.9 టీఎంసీల నీళ్లు మాత్రమే. అయితే ఈ జలాలు కేవలం 15 నుంచి 20 రోజుల వరకు మాత్రమే సరిపోతాయి. సంగారెడ్డి మండలం కల్పగూరులోని మంజీరా రిజర్వాయర్ సైతం డెడ్‌స్టోరేజీ కంటే కిందిస్థాయికి చేరుకుంది. ప్రాజెక్టులో ఎఫ్‌ఆర్‌ఎల్ 3 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రస్తుతమైతే కేవలం 0.5 టీఎంసీల జలం మాత్రమే ప్రాజెక్టులో ఉన్నాయి. దీంతో ఇక్కడి నుంచి జంటనగరాలకు తాగునీటిని సరఫరా చేసే పరిస్థితి కానరావటంలేదు.

 

 బోర్లు అద్దెకు తీసుకోండి : హరీశ్‌రావు

 నీటి సమస్యను తీర్చేందుకు రైతుల వద్ద నుంచి  వ్యవసాయ బోర్లు అద్దెకు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఈ బోర్లకు  పైపులైన్లు బిగించి నేరుగా నీటి ట్యాంకర్లలోకి నీళ్లు ఎక్కించి పంపిణీ చేయాలని సూచించారు. బోర్లు అద్దెకు దొరకని చోట వెంటనే బోర్లు వేయించాలని, అవకాశం ఉన్న చోట వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. వాటర్ ట్యాంకర్ల కిరాయి పెంచుతూ ప్రతిపాదనలు సిద్ధం చేసి తనకు పంపాలని సూచించారు. మరో 6 నెలల్లో వాటర్ గ్రిడ్ జలాలు కొన్ని ప్రాంతాలకు అందుతాయన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top