భీమవరంలో ఉద్రిక్తత | Sakshi
Sakshi News home page

భీమవరంలో ఉద్రిక్తత

Published Thu, Jul 13 2017 12:43 AM

భీమవరంలో ఉద్రిక్తత

భీమవరం టౌన్‌  :  గరగపర్రు ఘటనలో దళితులకు న్యాయం చేయాలంటూ సీపీఎం, సీపీఐ, కేవీపీఎస్‌తోపాటు వివిధ ప్రజా సంఘాలు చేపట్టిన చలో భీమవరం కార్యక్రమం బుధవారం భీమవరంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ ముందుగానే పోలీసులు ప్రకటించినా.. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యక్రమం నిర్వహించి తీరుతామని ఉద్యమకారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉద్యమం వేదిక భీమవరం పాతబస్టాండ్‌ను పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఏలూరు నుంచి ప్రత్యేక పోలీసు బలగాలను దింపారు. గరగపర్రు నుంచి దళితులు, చుట్టు పక్కల నుంచి ఉద్యమకారులు పాతబస్టాండ్‌కు చేరుకోకుండా ఉద్యమ వేదికకు నాలుగు దిక్కులా పోలీసులు మోహరించారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి మెంటేవారితోట నుంచి శ్మశానం మీదుగా యనమదుర్రు డ్రెయిన్‌  గట్టువెంబడి ఆందోళనకారులు ఒక్క ఉదుటున అంబేడ్కర్‌ సెంటర్‌కు చేరుకుని అక్కడ పోలీసులను తోసుకుని పరుగుపరుగున డప్పులు వాయిస్తూ పాతబస్టాండ్‌ వద్దకు చేరుకున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, రాష్ట్ర కమిటీ సభ్యుడు మంతెన సీతారాం, నాయకులు బి.బలరాం, జేఎన్‌వీ గోపాలన్, బీవీ వర్మ మరో 30 మందికిపైగా ఉద్యమకారులు అక్కడికి చేరుకుని గరగపర్రు దళితులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ముందుకు కదలనివ్వకుండా పోలీసులు వలయంగా చుట్టుముట్టారు. దీంతో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తదితరులు రోడ్డుపైన పడుకుని నిరసన తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ ఎన్‌ .మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు వారందరినీ బలవంతంగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వ్యాన్లలో ఎక్కించారు. అందరినీ వ్యాన్లలో ఎక్కించి కాళ్ల పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. తరువాత సీపీఐ జిల్లా కార్యదర్శి డేగ ప్రభాకర్, పట్టణ కార్యదర్శి ఎం.సీతారాం ప్రసాద్‌ ఆధ్వర్యంలో మరికొందరు అక్కడికి చేరుకున్నారు. భీమవరం పట్టణాన్ని పోలీసులు పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకుని ఎటువంటి అశాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement