రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ జగన్‌మోహన్‌రెడ్డిపైన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా నిందలు మోపడం సరైన పద్ధతి కాదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడలోని తన నివాస గృహంలో ఆదివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు
-
చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు ధ్వజం
కాకినాడ రూరల్ :
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ జగన్‌మోహన్‌రెడ్డిపైన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా నిందలు మోపడం సరైన పద్ధతి కాదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడలోని తన నివాస గృహంలో ఆదివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టుగా చంద్రబాబు మాట్లాడే భాష, ఆరోపణలు ఉండాలన్నారు. పట్టిసీమ కాలువకు గండి పడితే దానికి వైఎస్సార్ సీపీ కారణం మన్నట్టు మాట్లాడడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. తుని రైలు కాల్చివేత ఘటనలో రాయలసీమకు చెందిన వారి హస్తం ఉందని చెప్పిన చంద్రబాబు ఆ తరువాత ఈ జిల్లా వారిపైనే కేసులు బనాయించార ని గుర్తుచేశారు. ఏదైనా ఘటన జరిగినపుడు సీఎం ప్రభుత్వ యంత్రాంగంతో విచారణ జరిపించాక అందుకు కారకులెవరో తేల్చాలని అన్నారు. అలాంటిదేమీ లేకుండా ఎక్కడ ఏది జరిగినా అది జగన్‌మోహన్‌రెడ్డే కారణమంటూ ఎంతకాలం విపక్షం మీద విమర్శలు చేస్తూ కాలం వెళ్లదీస్తారని ప్రశ్నించారు.
ప్రభుత్వ సమర్థతపై నమ్మకం లేకే..
కృష్ణా పుష్కరాలకు జనం రాకపోతే ఆ తప్పు జగన్‌దే అన్నట్టు సీఎం చంద్రబాబు మాట్లాడడాన్ని కన్నబాబు తప్పుపట్టారు. గోదావరి పుష్కరాల తొలిరోజు 29 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటతో యాత్రికులు భయభ్రాంతులయ్యారన్నారు. పుష్కరాల నిర్వహణపై ప్రభుత్వ సమర్థతపై ప్రజలకు నమ్మకం లేకపోవడం వల్లే కృష్ణా పుష్కరాలకు జనం రావడం లేదని గమనించాలని కన్నబాబు స్పష్టం చేశారు. అమరావతిపై ప్రముఖ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్ సుప్రీం కోర్టులో కేసు వేసినందున ఆయనను ఉన్మాదిగా చంద్రబాబు మాట్లాడడం అభ్యంతరకరమన్నారు. గతంలో పలు అంశాలపై టీడీపీ కోర్టులకు వెళ్లిన సంఘటనలు లేవా? అని ప్రశ్నించారు.