‘టీడీపీ’ వైఫల్యాలపై గడపగడపలో ప్రచారం | tdp government fail | Sakshi
Sakshi News home page

‘టీడీపీ’ వైఫల్యాలపై గడపగడపలో ప్రచారం

Sep 28 2016 2:22 AM | Updated on Aug 10 2018 5:54 PM

‘టీడీపీ’ వైఫల్యాలపై గడపగడపలో ప్రచారం - Sakshi

‘టీడీపీ’ వైఫల్యాలపై గడపగడపలో ప్రచారం

తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను గడపగడపలో విస్తృత ప్రచారం చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు...

కాకినాడ : తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను గడపగడపలో విస్తృత ప్రచారం చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అదే సమయంలో ప్రజలకు పార్టీ అండగా ఉంటుందన్న భరోసాను కూడా కల్పించాలని కోరారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ముమ్మిడివరం నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ సమావేశం మంగళవారం జిల్లా అధ్యక్షుడు కన్నబాబు నివాసంలో జరిగింది.

సమావేశంలో తొలుత ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ మాట్లాడుతూ తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్‌ ఎన్నికల అనంతరం ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ప్రజలను దగా చేసిందని విమర్శించారు. ప్రత్యేక హోదా అంశంలో సైతం మాట తప్పి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలపై నీళ్లు చల్లిందని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు విధానాలు, ప్రభుత్వ వైఫల్యాలను గడపగడపకు వైఎస్సార్‌ కార్యక్రమంలో ప్రజలకు వివరించాలన్నారు. జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ రూపొందించిన ప్రజాబ్యాలెట్‌ను ప్రజలకు పంపిణీ చేసి వాస్తవ పరిస్థితి అర్థమయ్యేలా వివరించాలని పార్టీ శ్రేణులకు వివరించారు. ఓట్ల కోసం ప్రజలను ఏ విధంగా వంచించారో తెలియజెప్పాలని కన్నబాబు కోరారు. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ అన్ని వర్గాల ప్రజలకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అండగా ఉంటుందనే భరోసా ఇవ్వాలని పార్టీ శ్రేణులను కోరారు.

తెలుగుదేశం చేసిన అబద్దపు ప్రచారాలు నమ్మి గెలిపించినప్పటికీ ఇప్పుడు ప్రజలు వాస్తవ పరిస్థితిని అర్థంచేసుకున్నారని పేర్కొన్నారు. త్వరలోనే ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళ్ళరేవు, ఐ.పోలవరం, ముమ్మిడివరం మండలాల్లో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. ముమ్మిడివరం నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ పితాని బాలకృష్ణ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కృషి చేస్తామన్నారు.

కులమతాలకు అతీతంగా పార్టీ పట్లనిబద్ధత, అంకిత భావం కలిగిన వారికి అవకాశం కల్పించి పదవుల్లో నియమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుత్తుల సాయి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి ఏడిద చక్రం, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పెయ్యల చిట్టిబాబు, కాట్రేనికోన ఎంపీపీ ఆకాశం సత్యనారాయణమూర్తి, జిల్లా కార్యదర్శి రేవు మల్లేశ్వరి, తాళ్ళరేవు, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం కన్వీనర్లు, సీనియర్‌ నాయకులు, సుమారు 300 మంది ముమ్మిడివరం నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement