
స్వధర్మాన్ని వీడొద్దు
స్వధరాన్ని వీడి పరధర్మాన్ని ఆశ్రయించడం కన్నతల్లిని వదులుకున్నట్టేనని ద్వారకా పీఠాధిపతులు జగద్గురు శంకచార్య స్వరూపనంద సరస్వతి ఉద్భోధించారు.
– జగద్గురు శంకచార్య స్వరూపనంద సరస్వతి
అనంతపురం కల్చరల్ : స్వధరాన్ని వీడి పరధర్మాన్ని ఆశ్రయించడం కన్నతల్లిని వదులుకున్నట్టేనని ద్వారకా పీఠాధిపతులు జగద్గురు శంకచార్య స్వరూపనంద సరస్వతి ఉద్భోధించారు. దక్షిణ భారత దేశ విజయయాత్రలో భాగంగా అనంత పర్యటనకొచ్చిన స్వామీజీ స్థానిక మూడవరోడ్డులోని జీఆర్ ఫంక్షన్ హాలులో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులనుద్దేశించి ఉపన్యసించారు. ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన ధర్మం హిందూధర్మమన్నారు. కర్మకాండ, ఉపాసనకాండ, జ్ఞాన కాండ తదితర అంశాలను ఇతిహాసాల్లోని కథలతో, ఉపమానాలతో వర్ణించిన తీరు అందరిని ఆకట్టుకుంది. హిందూ మతంలో ఐక్యతను తేవడానికి బాల గంగాధర్ తిలక్ చేసిన కషిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
అంతకు ముందు స్వామీజీ దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. నగర మేయర్ స్వరూప, జిల్లా జడ్జి హరిహరనాథశర్మ తదితరులు ప్రత్యేక దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులందుకున్నారు. పుట్టపర్తి నారాయణాచార్యుల మునిమనుమరాలు సాహితీ అయ్యంగార్ అన్నమాచార్య గీతంపై శాస్త్రీయ నత్యంతో స్వామీజీకి స్వాగతం పలికారు. కార్యక్రమంలో అమతానంద స్వామీజీ, రాష్ట్ర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు జ్వాలాపురం శ్రీకాంత్, ఎండోమెంట్ సహాయ కమిషనర్ ఆనంద్, ఈఓ నాగేంద్రరావు, శ్రీనిధి రఘు తదితరులు పాల్గొన్నారు.
సాయి భక్తుల నిరసన∙: ఇదిలా ఉండగా జగద్గురు శంకరాచార్యస్వరూపానంద సరస్వతి షిర్డీసాయిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో బాబా భక్తులు మండిపడ్డారు. సాయి సంఘం ప్రతినిధులు సాయినాథ్ మహరాజ్‌కీ జై అంటూ నిరసన తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని పంపేయడంతో స్వామీజీ తన ఉపన్యాసం కొనసాగించారు.