సర్వ నిర్లక్ష్యం ! | ssa officers negligance | Sakshi
Sakshi News home page

సర్వ నిర్లక్ష్యం !

Jul 12 2017 10:33 PM | Updated on Sep 5 2017 3:52 PM

సర్వ నిర్లక్ష్యం !

సర్వ నిర్లక్ష్యం !

చదవడంలో వెనుకబడితే చదువులో వెనుకబడినట్టే. తరగతి స్థాయికి తగిన సామర్థ్యం సాధించాలంటే మాతృభాషలో కనీస అభ్యసన స్థాయి ఉండాలి.

– ఎస్‌ఎస్‌ఏ కార్యాలయం దాటని ‘సవరణాత్మక బోధన’
– గోడౌన్‌లోనే మూలుగుతున్న పుస్తకాలు
– పట్టించుకోని అధికారులు

అనంతపురం ఎడ్యుకేషన్‌ : చదవడంలో వెనుకబడితే చదువులో వెనుకబడినట్టే. తరగతి స్థాయికి తగిన సామర్థ్యం సాధించాలంటే మాతృభాషలో కనీస అభ్యసన స్థాయి ఉండాలి. వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ఈ నిజాలు వెలుగు చూశాయి. పిల్లలు తరగతులు మారుతున్నారు తప్ప.. చాలా మందికి కనీసం చదవడం, రాయడం కూడా రావడం లేదు. ఇక గణితంలో మరీ అధ్వానంగా ఉన్నారని సర్వే గణాంకాలు చెబుతున్నాయి.  విద్యార్థులు కనీస అభ్యసన స్థాయిలకు చేరుకునేవిధంగా ‘సరవణాత్మక బోధన’ (రెమిడియల్‌ టీచింగ్‌) అనే  కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేసేందుకు సిద్ధమైంది. 1–5 తరగతుల్లో ‘సీ’ గ్రేడు విద్యార్థులు, 6–9 తరగతుల్లో డీ–1, డీ–2 గ్రేడుల విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా నిష్ణాతులైన ఉపాధ్యాయులతో వంద రోజుల పాటు ఒక క్రమ పద్ధతిలో నేర్చుకునే విధంగా ప్రణాళిక రూపొందించారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో కరదీపికలు ముద్రించి అన్ని జిల్లాకు పంపిణీ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా అమలులో అధికారులు చేతులెత్తేశారు.

ఎస్‌ఎస్‌ఏ కార్యాలయం దాటని కరదీపికలు
1–5 తరగతులకు తెలుగు, గణితం, ఇంగ్లీష్‌ సబ్జెక్టులపై కరదీపికలు వచ్చాయి. అలాగే 6–9 తరగతులకు తెలుగు, ఇంగ్లీష్‌ సబ్జెక్టులపై కరదీపికలు వచ్చాయి. ఇప్పటికీ 20 రోజులు పైబడుతున్నా కరదీపికలు ఎస్‌ఎస్‌ఏ కార్యాలయం గడప దాటడం లేదు. వచ్చినవన్నీ గోడౌన్‌లో భద్రపరిచి అధికారులు చేతులు దులుపుకున్నారు.

ప్రారంభం ఎప్పుడో ?
ఈ కార్యక్రమాన్ని పాఠశాలు పునఃప్రారంభం రోజు నుంచే అమలు చేయాల్సి ఉంది. అంటే షెడ్యూలు ప్రకారం ఇప్పటికి 31 రోజులు గడిచి ఉండాలి. కానీ ఇప్పటిదాకా కనీసం కరదీపికలు స్కూళ్లకు చేరలేదు.

విద్యార్థుల ఎంపిక గందరగోళమే
ప్రాథమిక స్థాయిలో సీ గ్రేడు, ఉన్నత స్థాయిలో డీ–1, డీ–2 గ్రేడు విద్యార్థులను ఎంపిక చేయడం అధికారులకు గందరగోళంగా మారింది. వాస్తవానికి ఆయా స్కూళ్ల వారిగా విద్యార్థుల గ్రేడింగ్‌ను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. వాటి ఆధారంగా పిల్లల సంఖ్యను తీసుకుంటే వచ్చిన కరదీపికలు చాలవని భావిస్తున్న అధికారులు ఇష్టానుసారంగా ఎంపిక చేసినట్లు తెలిసింది. ఒక స్కూల్లో ఒక్కో సబ్జెక్టులో ఒక్కో విధంగా గ్రేడింగ్‌ వచ్చి ఉంటుంది. కానీ అధికారులు మాత్రం సగటున గ్రేడింగ్‌ తీసుకుంటున్నట్లు తెలిసింది.

నేడు ఎస్పీడీ బృందం రాక
ఎస్‌ఎస్‌ఏలో ఇటీవల వెలుగుచూసిన అక్రమాలపై మరోసారి విచారించేందుకు స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ (ఎస్పీడీ) బృందం రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించనుంది. ఇందులో భాగంగా గురువారం ఎస్‌ఎస్‌ఏ కార్యాలయానికి రానున్నారు. వివిధ పథకాల అమలులో జరుగుతున్న జాప్యాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్న ఎస్పీడీ బృందం ‘సవరణాత్మక బోధన’ నిర్లక్ష్యంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Advertisement
Advertisement