తల్లికి తలకొరివిపై తనయుల తగాదా | sons fight in mother funeral in karimnagar district | Sakshi
Sakshi News home page

తల్లికి తలకొరివిపై తనయుల తగాదా

Nov 21 2015 8:20 PM | Updated on Sep 3 2017 12:49 PM

తల్లి రత్నమ్మకు ఏనాడూ కడుపునిండా ప్రేమ పంచని కొడుకులు ఆఖరికి కొరివిపెట్టే విషయంలోనూ తగువులాడుకున్నారు..

హుస్నాబాద్‌ రూరల్: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామానికి చెందిన నారోజు రత్నమ్మ(90)కు ఏడుగురు సంతానం. ఐదుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. భర్త లక్ష్మీ నర్సయ్య 30 ఏళ్ల కిందట చనిపోగా, అన్నీ తానై పిల్లలందరినీ ఇంటివాళ్లను చేసింది. ఆమె ఆలన చూస్తోన్న చిన్న కొడుకు ఎనిమిదేళ్ల కిందట చనిపోయాడు. అప్పటి నుంచి నలుగురు తలా కొద్ది రోజుల చొప్పున తల్లి బాధ్యతను పంచుకున్నారు. మాటైతే అనుకున్నారుగానీ తల్లి రత్నమ్మకు ఏనాడూ ఇంత బువ్వ పెట్టిన పాపనపోలేదు. దీంతో ఆ కాలంలోనే పోలీసుల్ని ఆశ్రయించిందా తల్లి. పోలీసుల కౌన్సెలింగ్ తర్వాత..

'నాకు ఆస్తిలో వాటా వద్దూ.. అమ్మ కూడా వద్దు' అంటూ పెద్ద కొడుకు రాజమౌళి తెగేసి చెప్పాడు. అప్పట్నుంచి తల్లి బాధ్యత మిగిలిన ముగ్గురు కొడుకులపై పడింది. కొన్నాళ్లకు చిన్న కొడుకు జగదీశ్వర్ ఉపాధి కోసం ఉన్న ఇంటిని అమ్ముకుని కరీంనగర్ కు వలస వెళ్లాడు. మిగిలిన ఇద్దరు కొడుకులు చంద్రమౌళి, కృష్ణయ్యల వద్ద కాలం వెళ్లదీసిన రత్నమ్మ.. శుక్రవారం సాయంత్రం మరణించింది. అప్పుడు మొదలైంది అసలు కథ..

పెద్దన్న రాజమౌళే తల్లికి తలకొరివి పెట్టాలని చిన్న కొడుకు జగదీశ్వర్ వాదనకు దిగటంతో ప్రారంభమైన తగాదా అన్నాతమ్ముళ్ల మధ్య ఆగ్రహావేశాలకు, తోటికోడళ్ల దెప్పిపొడుపులకు కారణమైంది. తల్లిని వదిలి వెళ్లిన నువ్వా నాకు చెప్పేది అని అన్నాతమ్ముళ్లు తిట్టుకుంటే, అంతకు ఏమాత్రం తగ్గకుండా తగువులాడుకున్నారు వారి భార్యామణులు. రత్నమ్మను కడసారి చూసేందుకు వచ్చిన బంధువులు, గ్రామస్తులు.. వీళ్ల పోట్లాట చూసి ఖంగుతిన్నారు.

 

తల్లి శవాన్ని అరుగుమీద పెట్టుకుని ఇలా గొడవపడటం సరికాదని కులపెద్దలు సర్దిచెప్పినా వినిపించుకోలేదా కొడుకులు. గంటలపాటు అలా పోట్లాడుకుంటూనే ఉన్నారు. నా ఇంటివద్దే చనిపోయిందికాబట్టి తల్లికి నేనే కొరివి పెడతానని చంద్రమౌళి అనడంతో ఏర్పాట్లు చకచకాసాగాయి. అప్పుడు కూడా మిగిలిన కొడుకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరికి ఎలాగోలా తల్లికి తలకొరివిపెట్టి కొడుకులు తలోదారి వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement