సదుం: ఊరేగింపులో పాల్గొన్న పెద్దిరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి
విఘ్ననాయకుడైన లంబోధరుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. గురువారం పట్టణంలోని ఎన్‌ఎస్‌పేటలోని రామునిగుడి వీధి, అలగన్నగారివీధి, దాసరివీధి, వినాయకులను నిమజ్జనానికి తరలించారు.
పుంగనూరు టౌన్: విఘ్ననాయకుడైన లంబోధరుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. గురువారం పట్టణంలోని ఎన్‌ఎస్‌పేటలోని రామునిగుడి వీధి, అలగన్నగారివీధి, దాసరివీధి, వినాయకులను నిమజ్జనానికి తరలించారు. నిమజ్జనానికి తరలించే ముందు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేశారు. మఠంవీధి బాలవిద్యాగణపతి సేవాసంఘం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం, తీర్థప్రసాదాలు అందించారు. రామునిగుడి వీధిలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూను వేలంపాటలో రూ.7,800కి సురేంద్రరాజు సొంతం చేసుకున్నారు. లడ్డూను భక్తులందరికీ పంచిపెట్టారు. అనంతరం విఘ్ననాయకులను ట్రాక్టర్లలో ఉంచి పిల్లనగ్రోవి, చెక్కభజనలు, కోలాటాలు, బళ్లారి వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకు వెళ్లారు. యువకులు కాషాయవస్త్రాలు ధరించి రంగులు చల్లుకొంటూ, నత్యాలు చేస్తూ నిమజ్జనానికి తీసుకెళ్లారు. దారి పొడవునా మహిళలు ముగ్గులు వేసి మంగళ హారతులతో స్వామివారికి వీడ్కో లు పలికారు. సామూహికంగా బొజ్జగణపయ్యలు పురవీధుల్లో ఊరేగింపుగా రావడంతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.
ఘనంగా వినాయక నిమజ్జనం
జాండ్రపేట(సదుం): మండలంలోని జాండ్రపేటలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి గురువారం సాయంత్రం నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. వినాయకునికి వైఎస్‌ఆర్ సీపీ యువనాయకుడు పెద్దిరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వినాయకుని లడ్డూని వేలం వేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో స్వామివారిని మేళతాళాలతో గ్రామంలో ఊరేగించారు. యువకులు రంగులు చల్లుకుంటూ కోలహలం చేశారు. కార్యక్రమంలో విజయ్, విక్రమ్, రవి, నరసింహులు, శ్రీనివాసులు, భరత్, మణి, ఈశ్వరయ్య, పవన్ తదితరులు పాల్గొన్నారు.
చౌడేపల్లెలో...
చౌడేపల్లె: గాంధీవీధి, బత్తలాపురం రోడ్డులో నెలకొల్పిన వినాయకుడికి గురువారం ఘనంగా వీడ్కోలు పలికారు. 11 రోజులపాటు నెలకొల్పిన బొజ్జగణపయ్యకు ప్రత్యేకపూజలు చేశారు. వినాయకుడిని ట్రాక్టర్‌లో పూల నడుమ ముత్యాల పల్లకిలో స్వామివారిని ముస్తాబు చేశారు. పిల్లనగ్రోవులు, కళాబందాల నడుమ ఊరేగింపు సాగింది. ఊరేగింపు అనంతరం గ్రామానికి సమీపంలోని చెరువులో నిమజ్జనం చేశారు.