తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. సాయంత్రం 6 నుంచి ఉదయం 8వరకు చలి తీవ్రత కొనసాగుతోంది.
- ఆదిలాబాద్‌లో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత
- ఈ సీజన్‌లో ఇదే తక్కువ..
- మెదక్‌లో 9 డిగ్రీలు నమోదు
- జగిత్యాల జిల్లా అయిలాపూర్‌లో చలి తీవ్రతకు వృద్ధురాలి మృతి
- ఏపీలోనూ పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు... చింతపల్లిలో 4 డిగ్రీల నమోదు
సాక్షి, హైదరాబాద్:
రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు చలి తీవ్రత కొనసాగుతోంది. దీంతో ప్రజలు ఆ సమయాల్లో బయటకు రావడానికి వణికిపోతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఈ సీజన్‌లో ఇంత తక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి.
ఆ తర్వాత మెదక్‌లో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హన్మకొండ, హైదరాబాద్, రామగుండంలలో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. హన్మకొండ, ఖమ్మం, నల్లగొండల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు డిగ్రీలు తక్కువగా నమోదు కావడం గమనార్హం. ఖమ్మంలో 12 డిగ్రీలు, నల్లగొండలో 13 డిగ్రీలు కనిష్టంగా నమోదయ్యాయి. వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొని ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రానున్న రోజుల్లో చలి తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు.