కొలువు కోసం పరుగు | Sakshi
Sakshi News home page

కొలువు కోసం పరుగు

Published Thu, Dec 1 2016 10:45 PM

కొలువు కోసం పరుగు - Sakshi

 ఏలూరు అర్బన్‌  : కానిస్టేబుల్‌ కొలువు కోసం అభ్యర్థులు పరుగుతీశారు. గురువారం స్థానిక  అమీనాపేట పోలీసు పెరేడ్‌ గ్రౌండ్స్‌లో కానిస్టేబుల్‌ పోస్టుల రాతపరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు గురువారం దేహదారుఢ్య పరీక్షలు జరిగాయి. ఉదయం ఆరుగంటలకు ఈ పరీక్షలను ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ ప్రారంభించారు. పరీక్షల ప్రక్రియను జిల్లా అడిషనల్‌ ఎస్పీ ఎన్‌.చంద్రశేఖర్‌ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అడిషన్‌ ఎస్పీ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. వారం రోజుల పాటు జరిగే ఈ పరీక్షల్లో 6,213మంది అభ్యర్థులు పాల్గొనాల్సి ఉందన్నారు. మొదటి రోజు 800 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 578 మంది మాత్రమే హాజరయ్యారని పేర్కొన్నారు. వారిలో 67 మంది విద్యార్హతల ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీసుకురాలేకపోవడంతో వారికి మరో అవకాశం ఇచ్చామని,  వారు ఈ నెల 5న పరీక్షకు హాజరు కావచ్చని వివరించారు. అభ్యర్థుల 100, 1600 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌ సామర్థ్యం పరీక్షించనున్నట్టు వివరించారు.  వారంలో వీటిని పూర్తిచేయాల్సి ఉన్నందున శుక్రవారం నుంచి వేయి మంది అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్టు వివరించారు. ప్రస్తుతం ఏ కారణం చేతనైనా ప్రతిభ కనబరచలేకపోయిన వారికి మరో అవకాశం ఇస్తామని అడిషనల్‌ ఎస్పీ చంద్రశేఖర్‌ చెప్పారు. 
 సీసీ కెమెరాల నిఘాలో పోటీలు
దేహదారుఢ్య పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసం పెరేడ్‌ గ్రౌండ్స్‌లో అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు రేడియో ఫ్రీకెన్సీ ఐడెంటిటీ డివైస్‌లు ఇచ్చి పోటీలు నిర్వహించారు. దీనివల్ల అభ్యర్థులు తమ లక్ష్యాలను ఎంత సమయంలో పూర్తి చేశారనే  అంశాన్ని అన్‌లైన్‌ విధానంలో నమోదు చేశారు.
 
 

Advertisement
Advertisement