నీరు-చెట్టులో రూ.150 కోట్ల అవినీతి | Rs.150 cr fraud in neeru chettu programme | Sakshi
Sakshi News home page

నీరు-చెట్టులో రూ.150 కోట్ల అవినీతి

Jul 21 2016 8:08 AM | Updated on May 29 2018 2:42 PM

తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన నీరు, చెట్టు కార్యక్రమంలో రూ.150 కోట్ల మేర అవినీతి, అక్రమాలు జరిగాయని వైఎస్సార్‌సీపీ జిల్లా నాయకుడు మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు.

అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి నిధులు డ్రా
అధికార పార్టీ నేతల దాష్టీకానికి నిదర్శనమిది..
అక్రమాలు వెలుగులోకి వచ్చినా కలెక్టర్ చర్యలు తీసుకోలేదు..
విజిలెన్స్ దృష్టికి తీసుకెళ్లాం
 వైఎస్సార్‌సీపీ జిల్లా నాయకుడు మజ్జి శ్రీనివాసరావు

 
విజయనగరం క్రైం : తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన నీరు, చెట్టు కార్యక్రమంలో రూ.150 కోట్ల మేర అవినీతి, అక్రమాలు జరిగాయని వైఎస్సార్‌సీపీ జిల్లా నాయకుడు మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. తక్షణమే వాటిపై విజిలెన్స్ తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సత్య కార్యాలయంలో ఏర్పాటు  చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమం పూర్తిగా అవినీతిమయమైందన్నారు. జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం డివిజన్లలో రూ.150కోట్ల మేర దేశం పార్టీ నేతలు దర్జాగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.
 
 జిల్లాలో ఒక తెలుగుదేశం నాయకుడు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి నిధులు స్వాహా చేశాడన్నారు. అధికార పార్టీ నేతల దాష్టీకానికి ఇది నిదర్శనమన్నారు. ఈ సంఘటన వెలుగులోకి  వచ్చినా కలెక్టరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దేశం నేతల అక్రమ దోపిడీని ఇప్పటికే విజిలెన్సు అధికారుల దృష్టికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లిందని చెప్పారు. పార్టీ నేత యడ్ల రమణమూర్తి మాట్లాడుతూ.. విజయనగరం నియోజకవర్గంలో అభివృద్ధి వెతికినా కనిపించడం లేదని విమర్శించారు.
 
 కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు, ఎమ్మెల్యే  మీసాలగీత, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణలు పట్టణంలో అభివృద్ధి వెలిగిపోతోందని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పట్టణంలోని గంటస్తంభం నుంచి కన్యకాపరమేశ్వరి ఆలయం వరకు రోడ్డు ఇప్పటికీ విస్తరణ జరగలేదని గుర్తు చేశారు. పట్టణంలో సమస్యలపై కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు సమీక్షిస్తే మంచిదని సూచించారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పిళ్లా విజయ్‌కుమార్, యువజ విభాగం రాష్ట్ర కార్యదర్శి అవనాపు విజయ్, నాయకులు ఉప్పు ప్రకాష్, గాడు అప్పారావు, పిన్నింటి చంద్రమౌళి, పిలకా శ్రీనివాస్, కరుమజ్జి సాయికుమార్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement