దస్తావేజు నకళ్లు కనిపిస్తున్నాయి!


సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్(ఐజీఆర్‌ఎస్)లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు గురువారం మళ్లీ ప్రత్యక్షమయ్యాయి. సర్కారీ పెద్దలు బినామీ పేర్లతో సాగించిన ‘రాజధాని దురాక్రమణ’ను ‘సాక్షి’ బుధవారం సాక్ష్యాధారాలతోసహా బట్టబయలు చేయడం, ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ప్రభుత్వం తక్షణమే స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ అధికారిక వెబ్‌సైట్ ఐజీఆర్‌ఎస్‌లో డాక్యుమెంట్లు(దస్తావేజు నకళ్లు) కనిపించకుండా బ్లాక్ చేయించడం తెలిసిందే.తన డెరైక్షన్‌లో తన కుమారుడు లోకేశ్, మంత్రివర్గ సహచరులు సూత్రధారులుగా వారి బినామీలు పాత్రధారులుగా సాగించిన అతి భారీ కుంభకోణానికి సమాధానం చెప్పుకోలేకపోయిన ఏపీ సీఎం చంద్రబాబు డాక్యుమెంట్లు ఎలా బయటికొచ్చాయంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఐజీఆర్‌ఎస్ వెబ్‌సైట్‌లో దస్తావేజు నకళ్లు కనిపించకుండా అధికారులు బ్లాక్ చేశారు. దీంతో బుధవారం ఉదయం 11 గంటల నుంచి ఈ వెబ్‌సైట్‌లో ఏ డాక్యుమెంటు నంబరు ఎంటర్ చేసినా ‘మీరు కోరిన దస్తావేజు నకళ్లు అందుబాటులో లేవు.. తర్వాత ప్రయత్నించండి...’ అనే సమాచారమే ప్రత్యక్షమైంది. ఈ వైనాన్ని ‘సర్కారు వెబ్‌సైట్‌లో డాక్యుమెంట్లు ఢమాల్’ శీర్షికతో సాక్షి వెల్లడించింది. ఈ నేపథ్యంలో తీవ్ర తర్జనభర్జనలు పడిన అధికారులు నష్ట నివారణ చర్యల్లో భాగంగా వెబ్‌సైట్‌లో దస్తావేజు నకళ్లు కనిపించేలా సర్వీసును గురువారం పునరుద్ధరించారు. పునరుద్ధరణ వెనుక పెద్ద కథ..

 వెబ్‌సైట్‌లో డాక్యుమెంట్లను బ్లాక్‌లో పెట్టడం.. తదుపరి పునరుద్ధరించడం వెనుక పెద్దకథే నడిచింది. దీనిపై కొందరు అధికారులు న్యాయ నిపుణులతోనూ మాట్లాడారు. ‘వెబ్‌సైట్‌లో డాక్యుమెంట్లు కనపడటంవల్ల కలిగే నష్టం పెద్దగా ఉండదు. పెపైచ్చు బినామీ పేర్లతో లావాదేవీలైనందున ఇబ్బందే లేదు. అలాగాక వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయడంవల్ల ఎక్కువ నష్టం కలుగుతుంది. పబ్లిక్ డాక్యుమెంట్లను బ్లాక్ చేశారనే అపప్రద ప్రభుత్వంపై పడుతుంది. పెపైచ్చు ఎవరైనా కోర్టుకెళ్లినా తర్వాత మళ్లీ దస్తావేజు నకళ్లను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తేవాల్సి వస్తుంది. అప్పుడు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టే ప్రయత్నం చేసిందనే చెడ్డపేరు వస్తుంది. కాబట్టి ఏదో పొరపాటున తప్పు చేశాం. ఒక్కరోజే బ్లాక్‌చేసినందున సాంకేతిక లోపమని చెప్పి తప్పును కప్పిపుచ్చుకోవచ్చు’ అని న్యాయకోవిదులు సలహాఇచ్చారు. దీంతో అధికారులు ఐజీఆర్‌ఎస్‌లో దస్తావేజు నకళ్ల వెబ్‌సైట్‌ను పునరుద్ధరించినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top