
ఫికర్
జిల్లాలోని 41 మండలాల్లో సుమారు 327 మసీదులు, 70 పైగా ఈద్గాలు, 258 దర్గాలు ఉన్నాయి.
♦ ‘రంజాన్ ’ నిధులు ఇంకా బ్యాంకు ఖాతాలోనే
♦ దగ్గర పడుతున్న పండగ
♦ గతేడాది నిధుల్లో రూ.30లక్షలు ఖర్చు చేయని వైనం
♦ ముందస్తు ప్రణాళికలో మైనార్టీ శాఖ విఫలం
♦ ఆందోళన వ్యక్తం చేస్తున్న ముస్లింలు
రంజాన్ పండగకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా, ఖర్చు చేయడంలో సంబంధిత శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలున్నారుు. పండగకు నాలుగైదు రోజులున్నా...నిధుల ఖర్చుకు ఇప్పటి వరకూ ప్రణాళిక సిద్ధం చేయలేదు. రంజాన్ పండగను పురస్కరించుకొని ప్రతి జిల్లాకు ప్రభుత్వం ఏటా రూ. 50 లక్షలు కేటారుుస్తున్నది. గతేడు విడుదలైన నిధుల్లో రూ. 30లక్షలు మిగిలారుు. ఈఏడు విడుదలైన నిధులను ఎలా ఖర్చు చేస్తారో అధికారులకే తెలియూలి.
పాల్వంచ : జిల్లాలోని 41 మండలాల్లో సుమారు 327 మసీదులు, 70 పైగా ఈద్గాలు, 258 దర్గాలు ఉన్నాయి. రంజాన్ మాసం పురస్కరించుకుని మసీదుల్లో, ఈద్గాల్లో మౌలిక వసతులు కల్పనకు రూ.50 లక్షల నిధులు విడుదలయ్యాయి. ఈ నిధులు జిల్లా కలెక్టర్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి జాయింట్ ఖాతాలోకి ఇప్పటికే వచ్చి ఉన్నాయి. మసీదుల్లో నెలకొన్న అవసరాలను గుర్తించడం కోసం మున్సిపాలిటీల్లో కమిషనర్లకు, మండలాల్లో ఎంపీడీఓలకు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారులు ప్రపోజల్స్ పంపాలని సర్క్యూలర్‌ను జారీ చేయాల్సి ఉంది. స్థానిక మసీదుల కమిటీలతో సమావేశం నిర్వహించి మసీదులకు కావాల్సిన తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణాలు, రంగులు వేయడం, విద్యుత్ దీపాలు అలంకరణ, చిన్న చిన్న మరమ్మతులు తదితర పనులపై నివేదిక తయారు చేయాలి. ఇలా కమిషనర్లు, ఎంపీడీఓలు రూపొందించిన నివేదికలు జిల్లా యంత్రాంగానికి చేరాలి. రంజాన్ వేడుకలకు మరో నాలుగు రోజులే మిగిలి ఉండగా, నేటికీ నివేదికలు తెప్పించుకోలేక పోయారు.
గతేడాది మిగిలిపోయిన రూ.30 లక్షలు
గతేడాది జిల్లాకు రూ.50 లక్షల నిధులు విడుదల కాగా అందులో రూ.20 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. ఇంకా రూ.30లక్షల నిధులు మిగిలే ఉన్నాయి. వాటికి తోడు ఈ సారి మరో రూ.50 లక్షల నిధుల విడుదలయ్యాయి. రంజాన్ నెల కంటే నెల రోజుల ముందే తయారు చేయాల్సిన ఈ నివేదికను, పండుగ దగ్గరపడుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి కుముదిని సింగ్‌ను వివరణ కోరగా.. గత వారమే నిధులు వచ్చాయని, మసీదుల్లో మౌలిక అవసరాలను గుర్తించాలని సర్క్యూలర్ జారీ చేస్తామని తెలిపారు. గతేడాది పది మండలాల నుంచే ప్రపోజల్స్ రావడంతో నిధులు మిగిలిపోయాయని పేర్కొన్నారు.