సెటిల్‌మెంట్లు చేస్తే చర్యలు తప్పవు

సెటిల్‌మెంట్లు చేస్తే చర్యలు తప్పవు

హోం మంత్రి రాజప్ప హెచ్చరిక 

అమలాపురం టౌన్‌ : న్యాయవాద వృత్తి చేస్తూ కొందరు భూ కబ్జాలు, సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారని, అలాంటి న్యాయవాదులను ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప హెచ్చరించారు. సెటిల్‌మెంట్లు, భూ కబ్జాలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే న్యాయవాదులపై కేసులు నమోదు చేసి జైళ్లకు కూడా పంపుతామని స్పష్టం చేశారు. అమలాపురం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక అసోసియేషన్‌ కార్యాలయ ప్రాంగణంలో పలువురు ప్రజాప్రతినిధులకు ఆదివారం జరిగిన సత్కార సభకు రాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అమలాపురం బార్‌ అసోసియేషన్‌కు ఎంతో ఘన చరిత్ర ఉంది. ఇక్కడ న్యాయవాదులుగా పనిచేసి నేడు న్యాయమూర్తులుగా అనేక మంది ఉన్నత స్థానాల్లో ఉన్నారని రాజప్ప గుర్తు చేశారు. అలాంటి అమలాపురంలో కొంత మంది న్యాయవాదులు సెటిల్‌మెంట్లు, భూకబ్జాలకు పాల్పడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. అమలాపురంలో రౌడీయిజాన్ని అణిచివేశాం, తప్పు ఎవరు చేసినా క్షమించేది లేదన్నారు. రాష్ట్రంలో సెటిల్‌మెంట్లు, భూ కబ్జాలకు ముఖ్యంగా నకిలీ డాక్యుమెంట్లు... నకిలీ రిజస్ట్రేషన్లతో ప్రజలను మోసగిస్తే పోలీసు శాఖ ఉక్కుపాదం మోపుతుందన్నారు. విశాఖపట్నంలో ఈ తరహాలో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటి అణిచివేతకు గతంలో అమలాపురం డీఎస్పీగా పనిచేసిన ప్రస్తుత విశాఖ సీపీ టి.యోగానంద్‌ ప్రత్యేక దర్యాప్తు, విచారణతో అలాంటి నేరాలను అదపు చేస్తున్నారని రాజప్ప గుర్తు చేశారు. బార్‌ అసోసియేషన్‌ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. అందుకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. పేదలకు ఉచిత న్యాయం అందించాలని ఆయన ఆకాంక్షించారు. వాస్తవంగా తప్పులు చేసిన వారికి శిక్ష పడేలా న్యాయవాదులు పనిచేయాలని రాజప్ప సూచించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాజప్పను అసోసియేషన్‌ తరపున ఘనంగా సత్కరించారు. ఆయనతోపాటు శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం, జడ్పీ చైర్మన్‌ నామన రాంబాబు, రాజోలు, అమలాపురం ఎమ్మెల్యేలు గొల్లపల్లి సూర్యారావు, అయితాబత్తుల ఆనందరావు, వైఎస్సార్‌ సీపీ సీజీసీ సభ్యుడు,  మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ ఎమ్మెల్సీ, పీసీసీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు. 

టెంపుల్‌ టూరిజం అభివృద్ధికి ప్రాధాన్యం 


అప్పనపల్లి (మామిడికుదురు) : టెంపుల్‌ టూరిజం అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. రాజప్ప దంపతులు ఆదివారం అప్పనపల్లి శ్రీబాలబాలాజీస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో విజయవాడ, శ్రీశైలం పుణ్యక్షేత్రాలకు ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ ఆలయాలను మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో ఐఏఎస్‌ అధికారులకు అక్కడ నియమించామన్నారు. జిల్లాలో వాడపల్లి, అప్పనపల్లి పుణ్య క్షేత్రాలను కూడా అభివృద్ధి చేయడంతో పాటు స్థానికంగా ఉన్న వనరులను వినియోగించుకుని వీటిని టెంపుల్‌ టూరిజం కేంద్రాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించామన్నారు.లంక గ్రామాలు ముంపు బారిన పడకుండా ఉండేందుకు కాజ్‌వేల ఎత్తు పెంచేలా కార్యాచరణ చేపట్టామన్నారు. తీర గ్రామాలకు సాగునీరు అందించే అప్పనపల్లి ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. రైల్వేలైన్‌ నిర్మాణంలో భాగంగా కోటిపల్లి నదిపై వంతెన నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు. ఈ సీజన్‌లోనే పనులు మొదలు పెట్టేలా చర్యలు తీసుకుంటామని రాజప్ప తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో 20 ఎకరాల విస్తీర్ణంలో అంబేడ్కర్‌ భారీ విగ్రహం ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. పలువురు పార్టీ నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.  


 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top