తాతా–మనవడి పోరు


 • రసవత్తరంగా వారసత్వ జగడం

 • (లక్కింశెట్టి శ్రీనివాసరావు)

  అనగనగా ఒక తాత..అతనికో మనవడు..సొంత మనవడు కాదులెండి..వారిద్దరిదీ ఎర్ర‘మెట్ట’ ఏరియానే. అక్కడి నేల స్వభావమేమో కాని తాతకు కాస్తంత కోపమెక్కువే. అయినా మనసు మాత్రం వెన్నపూసేనండోయ్‌. దశాబ్దాలుగా ఆ ప్రాంతాన్ని ఏలుతున్న నాలుగు కుటుంబాల్లో ఆ కుటుంబానిదీ కీలక పాత్రే. అన్నేళ్ల ఏలుబడిలో రాజకీయ వారసత్వం కోసం పోట్లాటలు మొదలయ్యాయి. కుటుంబ పెద్ద తాత ఏలుబడిలో ఉన్న ఆ ఎర్ర‘మెట్ట’రాజ్యంలో పెంచి పోషించిన మనవడి పెత్తనం  పెరిగిపోయింది. ఎంతంటే ఆ పెద్దాయన ఆదేశాలు అమలు కాకూడదనే స్థాయిలో. పైకి మాత్రం ఇద్దరు కలిసే నడుస్తారు, కాదు కాదు నడుస్తున్నట్టు నటిస్తారంతే.

  తాను రాజ్యాధికారం రేసులో ఉన్నానని మనవడు. కుమారుడి కేసు వ్యవహారంలో వెనుక మనవడు ఉన్నాడనేది తాత అనుమానం. ఇంతకంటే ముందు నుంచి తాత, మనవళ్ల మధ్య వివాదం లేదని కాదు. ఆ రాజ్యంలో రూ.12 కోట్లు రహదారి పనుల్లో కమీష¯ŒS విషయంలో తాత, మనవళ్ల మధ్య మనస్పర్థలు గుప్పుమన్నాయి. అది చినికి చినికి గాలివానగా మారి మనవడి రాజకీయకాంక్ష ఆ కుటుంబ వారసత్వ రాజకీయాల్లో ముసలం పుట్టిస్తోంది. ఆ తగువు ఆ కుటుంబంలోనే మరో పెద్దాయన సమక్షంలో లంచాయతీపై ‘పంచాయతీ’ జరిగింది. 

  చెక్‌కు తాత వ్యూహం...

  ఇంతకాలం మనవడి కాని మనవడ్ని తాత అన్ని విధాలా పెంచి పోషించాడు. చిరు వ్యాపారి స్థాయి నుంచి జిల్లాలో అన్ని పరగణాల్లో వందల కోట్ల టర్నోవర్‌తో నడిచే ఆర్థిక సంస్థ పగ్గాలు చేపట్టే వరకు అన్న మాట. తాతకు రెండు దఫాలు రాజ్యాధికారం దక్కడంలో ప్రతి అడుగులో వెనుక ఉండి ఎంతో చేశానని మనవడు ఊరూవాడా చెబుతున్నాడని తాత ఆరోపణ. ఈ విషయం తన వేగుల ద్వారా తెలుసుకున్న ఆయనకు కోపం చిర్రెత్తుకొచ్చింది. తన నీడలో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయి ఇప్పుడు తనకే ఎసరుపెట్టే స్థాయికి వచ్చేశాడని తెలిసొచ్చాక ఇప్పుడు జూలువిదిల్చి మనవడి రాజ్యకాంక్షకు పుల్‌స్టాప్‌ పెట్టాలనేది తాత వ్యూహం.

  ఇంటిపోరుకు ఇదొకటా...

  తన కుమారుల్లో ఇంతవరకు  ఎవరినీ  రాజకీయాల్లో వెంట తిప్పుకోలేదు. ఆ వారసులకు కూడా అంతటి నాయకత్వ లక్షణాలు, రాజ్యకాంక్ష ఉన్నట్టు ఎక్కడా బయటపడలేదు. అలాగని ఇప్పుడు కూడా కళ్లకుగంతలు కట్టుకుంటే వారసుల రాజకీయ భవిష్యత్‌ ఏమి చేద్దామనుకుంటున్నారని ఇంటి పోరు మొదలైంది. దేనినైనా తట్టుకోవచ్చుగానీ ఇంటిపోరును కాదని ముందుకు పోయే ధైర్యం ఎవరు మాత్రం చేస్తారు చెప్పండి. ఈ విషయంలో  రాజ్యాలకు రాజ్యాలే కూలిపోయిన చరిత్ర మనకు తెలియంది కాదు. అందుకే ఆయన కూడా ఒక అడుగు ముందుకేశారు. మనవడికి చెక్‌ పెట్టాలంటే ఏమి చేయాలా అని బురల్రు వేడెక్కుతున్న సమయాన ఆ తాతగారి పుట్టిన రోజు వచ్చింది. అంతకంటే మంచి ముహూర్తం మరొకటి రాదని అంతా భావించారు. మంత్రులు, సేవకులు కొలువుదీరి విషయాన్ని చర్చించుకుంటున్నారు. ఇంతలో మరొక రాజకీయ కుటుంబం నుంచి  పొరుగు రాజ్యాన్ని ఏలుతున్న వయసులో చిన్న, సరిసమానమైన హోదా, రాజకీయ వ్యూహకర్త ఆ పుట్టిన రోజు వేడుకలకు వచ్చారు...అనేకంటే అదీ వ్యూహంలో భాగమేనంటారు ఆంతరంగీకులు.

  మనువడికి ఎసరు...

  మనవడు కాని మనవడికి పొగపెట్టే కథ, రచన అక్కడే జరిగింది. వారసత్వ రాజకీయాల్లోకి అప్పటికప్పుడు వారసులు వచ్చినా కత్తిపట్టి యుద్ధం చేయడానికి ఇంకాస్త  సమయం కావాలని అక్కడకు వచ్చిన వారంతా అనుకున్నారు. అలా అని పెత్తనం చేస్తున్న మనవడ్ని వదిలేస్తే భవిష్యత్‌లో వారసత్వ రాజకీయమని చెప్పుకోవడానికి ఏదీ మిగలదనుకున్నారు. అందుకే తన ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చి దూరమైన సోదరుడు తనయుడుని దగ్గరకు తీసుకోవాలనుకున్నారు. చాలా కాలంగా ఆ ఇద్దరి మధ్య విబేధాలున్నాయనుకోండి. పంచాయతీ ఎన్నికల్లో  ఆ ’బాబు’ నిలబెట్టిన అభ్యర్థి గెలిచి తన తండ్రి సోదరుడు నిలబెట్టిన కేండిడేట్‌ ఓడిపోవడంతోనే వీరి మధ్య దూరం పెరిగింది. ఆ ’బాబు’ కూడా ఒకప్పుడు సామంత రాజుగా చలామణి అయిన వాడే. ఆ బాబును తెరమీద ప్రవేశపెట్టాలనేది ఆ అంతఃపుర నిర్ణయం. ఆ ఆదేశాలు అమలు కోసం అప్పటికప్పుడు ఆ ’బాబు’ను పిలిపించి ఆ పెద్దాయన  చేతిలో చేయి వేసి కలిపించేశారు. ఎందుకంటే సోదరుడు తనయుడు, మనవడి మధ్య ఆధిపత్య పోరు ఈనాటిది కాదు.మనవడికి పొగపెట్టాలంటే సోదరుడి తనయడిని యుద్ధ రంగంలోకి దింపారు. ఈ వ్యూహం వెనుక పొరుగు రాజ్యంలో అగ్రజుడుది ముఖ్య భూమిక. ’తాతకే దగ్గులు నేర్పుతావా అనే సామెతను మరిపించే రీతిలో పెద్దాయన రాజనీతితో మనవడ్ని దూరంచేసే ఎత్తు వేశారు. వరుసకైనా ఆ ఇంటి పేరుతో వచ్చిన రాజకీయ వారసత్వమే పునాది. తాతను మించిన మనవడనిపించుకోవాలనేది ఆ మనవడి  ఆరాటం. తాతే కాదు నా తండ్రి కూడా రాజ్యాధికారం చలాయించిన విషయం మరిచిపోతే ఎలా అంటాడు మనవడు. అందుకే ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ కత్తులకు పదునుపెడుతున్నాడతడు.తాత, మనవలు ఇద్దరూ ఇద్దరే. ఎందుకంటారా...వారిద్దరు కూడా అవసరం కొద్ధీ అటు, ఇటు మూడు పార్టీలు మారిన వారే.

  తాత నీడలో కూడబెట్టింది కొంత, తెలివితేటలో పెంచుకున్నది మరికొంత, మాటలతో ఎదుటి వారిని ఇట్టే కట్టిపడేసే రాజకీయ చతురత, వ్యూహ ప్రతివ్యూహాలు పన్నడంలో ఆ ఎర్ర’మెట్ట’ సీమలో మనవడిని మించిన వాడు లేడంటారు. ఇన్ని కలిసి వచ్చే అంశాలున్న తనదే  ఎప్పటికైనా పై చేయి అంటాడు మనవడు.ఇద్దరు వ్యూహ, ప్రతి వ్యూహాలు పన్నే పని అంతరంగీకులకు అప్పగించారు. అసలు ఏమి జరుగుతుందా చూద్దామని వేగులందించే సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారేమో చూడాలి మరి.

   
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top