ఏకపక్షంగా విభజిస్తే రావణకాష్టమే... | Sakshi
Sakshi News home page

ఏకపక్షంగా విభజిస్తే రావణకాష్టమే...

Published Mon, Sep 12 2016 9:26 PM

ఏకపక్షంగా విభజిస్తే రావణకాష్టమే...

  • పోలీసులు ప్రభుత్వానికి ఏజెంట్లు కాదు..ప్రజల సేవకులు
  • సీపీఐ శాసనసభ పక్ష మాజీ నేత గుండా మల్లేశం
  •  హుస్నాబాద్‌ : జిల్లాల పునర్విభజనలో ప్రజాభీష్టాన్ని గౌరవించక ఏకపక్షంగా వ్యవహరిస్తే రాష్ట్రం రావణకాష్టంగా మారుతుందని సీపీఐ శాసనసభ పక్ష మాజీ నేత గుండా మల్లేశం హెచ్చరించారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన హుస్నాబాద్‌ బంద్‌కు వివిధ పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ భుస్నాబాద్‌ను కరీంనగర్‌లో కొనసాగించాలని ఉద్యమం చేస్తున్న అఖిలపక్ష నాయకులపై పోలీస్‌లు అత్యుత్సాహం చూపి దుశ్చర్యలకు పాల్పడడాన్ని ఖండించారు. పోలీసులు ప్రభుత్వ ఏజెంట్లు కాదని ప్రజాసేవకులని అన్నారు. సిద్దిపేటకు ఇచ్చే ప్రాధాన్యత ఇతర జిల్లాలకు ఇవ్వడంలేదని ఆరోపించారు. సీఎంకు మతిభ్రమించిందని ప్రజలను పిచ్చోళ్ల మాదిరిగా చేస్తున్నాడని అన్నారు.  డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు రాజకీయ జీవితం ఇచ్చిన కరీంనగర్‌ గుండెతో ఆడుకుంటున్నాడనిఅన్నారు. జిల్లాను ఆరు ముక్కలు చేసి చరిత్ర, సంస్కృతి లేకుండా చేస్తున్నాడని పేర్కొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ తలపెట్టిన కొత్త జిల్లాల ప్రక్రియ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా జరిగితే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కరీంనగర్‌ను ముక్కలు చేస్తూ అస్థిత్వం లేకుండా చేస్తున్నాడని అన్నారు. హుస్నాబాద్, కోహెడ మండలాలను కరీంనగర్‌లో కొనసాగించాలని డిమాండ్‌ చేశాడు. సీపీఐ జిల్లా కార్యదర్శి రాంగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయ స్వార్థం కోసం జిల్లాలు, రెవెన్యూ డివిజన్, కొత్త మండలాలను విడగొడుతున్నారని అన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణంలోకి తీసుకొకపోతే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. టీపీసీసీ కార్యదర్శి బొమ్మ శ్రీరాంచక్రవర్తి  మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతుల్లో రిలే దీక్షలు చేపడితే పోలీస్‌లతో టెంట్లు కూల్చివేయించడం, అరెస్ట్‌లు చేయడం బ్లాక్‌ డేగా అభివర్ణించాడు. కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
     
     
     
     

Advertisement
Advertisement