అమ్మో.. బందరు ఎంఈవో పోస్టా..! | Orders received recruitment hm | Sakshi
Sakshi News home page

అమ్మో.. బందరు ఎంఈవో పోస్టా..!

Mar 3 2016 12:57 AM | Updated on Oct 9 2018 7:52 PM

మండల విద్యాశాఖాధికారి పోస్టు తమకు కావాలంటే తమకు కావాలని పోటీపడడం సహజం.

నియామక ఉత్తర్వులు అందుకోని హెచ్‌ఎం
మాకొద్దంటూ నేతలు చుట్టూ ప్రదక్షిణలు

 
మచిలీపట్నం : మండల విద్యాశాఖాధికారి పోస్టు తమకు కావాలంటే తమకు కావాలని పోటీపడడం సహజం. కానీ బందరు మండలంలో పరిస్థితి ఇందుకు భిన్నం. ఎంఈవో పోస్టులో తమను నియమించవద్దంటూ ప్రధానోపాధ్యాయు లు రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దీంతో భర్తీ ప్రక్రియ రోజురోజుకు వివాదాస్పదమవుతోంది. మండలంలో తొమ్మిది ఉన్నత పాఠశాలలుండగా ఇక్కడి హెచ్‌ఎంలకు ఎంఈవో పోస్టు వచ్చే అవకాశం ఉందని తెలియగానే మెడికల్ లీవ్‌లు పెట్టి వెళ్లిపోతున్నారు.
 
నాలుగు నెలలుగా ఖాళీ
 నాలుగు నెలలుగా ఎంఈవో పోస్టు ఖాళీగా ఉంటోంది. గతేడాది నవంబరులో ఇన్‌చార్జ్ ఎంఈవోగా స్టీవెన్‌సన్‌ను నియమించారు. తనకు ఆరోగ్యం బాగోలేదనే కారణం చూపి ఆయన మెడికల్ లీవ్ పెట్టారు. మిగిలిన ఎనిమిది ఉన్నత పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు తమను ఎంఈవోగా ఎక్కడ నియమిస్తారోనని మెడికల్ లీవ్ పెట్టి వెళ్లిపోయారు. ఉపాధ్యాయుల వేతనాలు ఇవ్వడంలో జాప్యం జరగడం తదితర అంశాల నేపథ్యంలో మండలంలోని తొమ్మిది ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలంతా మెడికల్ లీవ్‌లో వెళ్లడం అప్పట్లో వివాదాస్పదమైంది. వీరి లీవ్‌లు ఎంతవరకు సమంజసమని జిల్లా మెడికల్ బోర్డుకు డీఈవో రిఫర్ చేసినా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. ఎంఈవో లేకపోవడంతో ఉపాధ్యాయులకు నవంబరు, డిసెంబర్ల వేతనాలు అందకపోవడంతో మచిలీపట్నం డీవైఈవో గిరికుమారికి ఎంఈవో గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇటీవల విద్యాశాఖ ఆర్జేడీ కార్యాలయం నుంచి ఎంఈవోల నియామకానికి సంబంధించి సీనియర్ ఉపాధ్యాయుల జాబితాలను పంపాలని కోరారు. దీంతో డీఈవో చిట్టిపాలెం జెడ్పీ స్కూల్ హెచ్‌ఎం స్టీవెన్‌సన్ పేరును ప్రతిపాదించగా ఎంఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న స్టీవెన్‌సన్ ఎంఈ వో బాధ్యతలు స్వీకరించడానికి తనకు ఆరోగ్యం బాగోలేదనే సాకు చూపుతూ ఉత్తర్వులు అందుకోకపోవడం చర్చనీయాంశమైంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ద్వారా స్టీవెన్‌సన్ తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నట్లు ఉపాధ్యాయులు చెప్పుకుంటున్నారు. కాగా ఎంఈవో బాధ్యతల నుంచి తప్పించాలని గిరికుమారి ఎంపీని ఆశ్రయించి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్ సమస్యను పరిష్కరించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement