మదనపల్లెలో జోరుగా ఆన్‌లైన్‌ మట్కా | Online matka in madanapalle | Sakshi
Sakshi News home page

మదనపల్లెలో జోరుగా ఆన్‌లైన్‌ మట్కా

Aug 29 2017 2:24 AM | Updated on Oct 16 2018 2:30 PM

చేనేత కార్మికులు, దినసరి కూలీలే లక్ష్యంగా మదనపల్లె పట్ట ణంలో జోరుగా సాగుతున్న ఆన్‌లైన్‌ మ ట్కా గుట్టు రట్టయింది.

► ఒడిశా కేంద్రంగా ఆన్‌లైన్‌ జూదం
► చేనేత కార్మికులు, కూలీలే లక్ష్యంగా ఎర
► 47 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు
► ఇంటి దొంగలనూ వదిలేది లేదన్న డీఎస్పీ


మదనపల్లె రూరల్‌ : చేనేత కార్మికులు, దినసరి కూలీలే లక్ష్యంగా మదనపల్లె పట్ట ణంలో జోరుగా సాగుతున్న ఆన్‌లైన్‌ మ ట్కా గుట్టు రట్టయింది. ఆన్‌లైన్‌లో వేలాది రూపాయలు మట్కా ఆడుతూ జీవితా లను బుగ్గిచేసుకుంటున్న 47 మందిని సోమవారం అరెస్ట్‌ చేసినట్టు డీఎస్పీ చౌడేశ్వరి తెలిపారు. ఆమె సోమవారం స్థానిక వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లోని సీఐ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. నీరుగట్టువారిపల్లెకు చెందిన ఓ చేనేత కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదుపై జరిపిన పోలీసుల విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు.

ఒడిశా కేంద్రంగా రిజిస్టర్‌ అయిన కపిల్‌ ఆన్‌లైన్‌ మట్కా వెబ్‌సైట్‌లో బ్యాంకు అకౌంటు అనుసంధానంతో యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లతో మట్కా ఆడుతున్నట్లు తెలిసిందన్నారు. దీనిపై విచారణ చేపట్టామన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 21 నుంచి నిందితుల ఫోన్‌ కాల్స్, ఆన్‌లైన్‌ వ్యవహారాలపై నిఘా పెట్టామన్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని 14 రాష్ట్రాల్లో ఈ మట్కా ఆడుతున్నట్టు గుర్తిమన్నారు. మదనపల్లె పట్టణంలో 86 మంది ఈ ఆట ఆడుతున్నట్లు తేలిందన్నారు. రూ.1 నుంచి ఎంత అయినా డబ్బు కట్టి మట్కా ఆడితే రూపాయకు 90 రూపాయలు ఇస్తామని నమ్మిస్తూ మోసం చేస్తున్నారని వివరించారు. కొందరు స్మార్ట్‌ఫోన్లలో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, కూలీల వద్ద డబ్బులు కట్టిస్తూ, లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో 47 మందిపై సెక్షన్‌ 420, ఏపి గేమింగ్‌ యాక్ట్‌ సెక్షన్‌ 9(1)కింద కేసు నమోదుచేసి అరెస్టు చేశామన్నారు.

మట్కా ఆడే విధానం
గూగుల్‌లోకి వెళ్లి కపిల్‌ సత్తా మట్కా అని కొట్టగానే వెబ్‌సైట్‌ వివరాలతో కూడిన సైట్లు, గేమ్‌ ఆడే విధానంపై యూట్యూబ్‌కు సంబంధించిన వీడియో కనిపిస్తా యి. వీటిలో మొదట ఉన్న సత్తా మట్కానెట్‌.కపిల్‌.మట్కా.ఇన్‌.మొబి.కామ్‌పై ఎంటర్‌ చేయగానే కపిల్‌ మట్కా పేరుతో ఆటకు సంబంధించిన వివరాలు, వివిధ రకాల ఆటలు, వాటి టైమింగ్స్‌కు సంబం ధించిన వివరాలు స్క్రీన్‌పై ప్రతక్ష్యమవుతాయి. అందులో ఇచ్చిన వివరాల ప్రకా రం మన వివరాలు నమోదుచేసి, లాగిన్‌ అయ్యాక అందులో మనకు ఫోన్‌ నెంబర్‌ కనిపిస్తుంది.

ఆ నెంబరుకు ఫోన్‌ చేసి మనం ఏ ఆట ఆడాలనుకుంటున్నామో తెలిపితే వారు దానికి సంబం«ధించి రూ.1,000లను తమ అకౌంట్‌ నంబరుకు వేయమంటారు. మనం అందులో డబ్బులు చెల్లించి ఆ రశీదును వాట్సప్‌ ద్వారా వారికి పంపితే నిర్వాహకులు మనకు పాయింట్లు కేటాయిస్తారు. వాటిని ఆధారంగా చేసుకుని సింగిల్‌ నంబర్, డబుల్‌ నంబర్‌ గేమ్‌లలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మనం కట్టిన నెంబర్‌కు మట్కా తగిలితే మన అకౌంట్‌కు దానికి సంబంధించిన మొత్తానికి పాయింట్లు యాడ్‌ అవుతాయి. లేకుంటే మన పాయింట్లు తగ్గుతూ వస్తాయి. మనం గెలిచిన పాయింట్లకు సంబంధించిన డబ్బులు మనం రిజిస్టర్‌ చేసిన బ్యాంకు ఖాతాకు జమ అవుతాయి.

ఇంటి దొంగలను వదిలే ప్రసక్తిలేదు
మట్కా వ్యవహారంలో కొంతమంది పో లీసులు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు తెలిసిందని డీఎస్పీ తెలి పారు. ఈ కేసు విషయంలో ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తి లేదని చెప్పారు. విచారణలో పోలీసుల పాత్ర ఉందని తెలిసినా, ఎవరైనా సమాచారం అందించినా చర్యలు తీసుకుంటామన్నారు. గేమింగ్‌ యాక్ట్‌ సెక్షన్‌ 9(1)కింద కేసులు నమోదైతే ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాల ఎంపికకు అనర్హులు అవుతారని చెప్పారు. మట్కా, ఆన్‌లైన్‌ పేకాట, ఇతర జూదాలు ఆడే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement