కోట్లు దోచిపెడుతున్నారు | officers single tender on four crore project in ongole Municipal Corporation | Sakshi
Sakshi News home page

కోట్లు దోచిపెడుతున్నారు

Mar 18 2016 5:06 AM | Updated on Sep 28 2018 7:14 PM

కోట్లు దోచిపెడుతున్నారు - Sakshi

కోట్లు దోచిపెడుతున్నారు

జిల్లా కేంద్రం... ఒంగోలు నగరపాలక సంస్థ... దీని పర్యవేక్షణకు

అధికార పార్టీకి తొత్తులుగా అధికారులు
నాలుగున్నర కోట్ల పనులకు సింగిల్ టెండర్
ప్రేక్షకపాత్రలో ప్రత్యేక అధికారి

జిల్లా కేంద్రం... ఒంగోలు నగరపాలక సంస్థ... దీని పర్యవేక్షణకు ఓ కమిషనర్... ఇది చాలదన్నట్టు ఎక్కడ ప్రజాధనం దుర్వినియోగమవుతుందేమోనని పరిరక్షణకు ఐఏఎస్ హోదాలో ఉన్న జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారిగా ఉన్నారు. వీరికితోడు పలు విభాగాలు. ఒక్కో విభాగానికి ఓ అధికారి. వీరికింద వందలాది మంది సిబ్బంది. వీరంతా పన్నుల రూపంలో వచ్చిన ప్రతి పైసాకు పహారా కాస్తున్నారంటే పొరపాటే. ఆశపోతులంతా చేరి మోసుకుపోతున్నా ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. అది ఎలా అంటే... 

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:  కోట్ల రూపాయల పనులు బహిరంగంగా పంచేసుకుంటున్నారు. నగరపాలక సంస్థ తెలుగుదేశం పార్టీ ప్రైవేటు లిమిటెడ్‌గా మారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంజినీరింగ్ టెండర్లలో ఫైవ్‌మెన్ కమిటీ పేరుతో  అధికార పార్టీ చేస్తున్న దందాకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. కాంట్రాక్టర్లను నయానో భయానో బెదిరించి తమ మనుషులచే పనులు చేజిక్కించుకుంటున్నారు. కోట్లాది రూపాయలతో పిలుస్తున్న టెండ‘రింగ్‌ల’ విషయంలో జరుగుతున్న అవకతవకలపై నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి ఏ మాత్రం దృష్టి పెట్టకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా  వ్యవహరిస్తున్నారు. అధికారులే పచ్చచొక్కాలు వేసుకున్న చందంగా వ్యవహరిస్తున్నారని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంజినీరింగ్ అధికారులు ఫోన్లు చేసి ‘ఈ టెండర్లు మీరు వేయద్దు, వేస్తే ఇబ్బంది పడతారని’ బెదిరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.

 గురువారం 11 కోట్ల రూపాయలకు పిలిచిన టెండర్లలో సుమారు నాలుగున్నర కోట్ల రూపాయల పనులను ఫైవ్‌మెన్ కమిటీవారు సూచించినవారు దక్కించుకోవడం దాదాపు ఖరారైంది. మొత్తం 170 పనులకుగాను సుమారు 80 పనులకు సింగిల్ టెండర్లు పడ్డాయి. ఇవన్నీ ఎస్టిమేట్ ధరలకే వేసినట్లు సమాచారం. సీసీ డ్రైన్ పనులకు సంబంధించినవి కావడం గమనార్హం. వీటి వల్ల కార్పొరేషన్‌కు రూ.30 లక్షల వరకూ ఆదాయానికి గండిపడే అవకాశం ఉంది. మిగిలిన పనులకు కాంట్రాక్టర్లు ఫైవ్‌మెన్ కమిటీ వత్తిళ్లను దాటి టెండర్లు వేయడంతో వీటి విషయంలో ఏం చేయాలనేదానిపై తర్జన భర్జన పడుతున్నారు. సొసైటీ కాంట్రాక్టర్లు ఎదురు తిరగడంతో వారికి బిల్లులు ఎలా వస్తాయో చూస్తామంటూ బెదిరింపులకు దిగినట్లు సమాచారం. మిగిలిన పనులకు పోటీ ఉండటంతో 15 నుంచి 20 శాతం వరకూ లెస్ టెండర్లు పడినట్లు తెలిసింది. అసలు ఈ టెండర్లు పిలవడం, రద్దు చేయడం, మళ్లీ విడివిడిగా పిలవడం, సిండికేట్ అవ్వడం, పర్సంటేజీల కోసం డిమాండ్ చేయడం తదితర అంశాలపై స్పెషలాఫీసర్ దృష్టి సారిస్తే జరుగుతున్న అవినీతి బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకాధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్ నగరపాలక సంస్థలో పారిశుద్ధ్యం తప్ప మిగిలిన వాటిని పట్టించుకోకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. టెండర్లు ఎవరు వేయాలనే విషయం కూడా వారే కాంట్రాక్టర్లకు ఫోన్లు చేస్తుండటం వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement