నో ఎంట్రీ | Sakshi
Sakshi News home page

నో ఎంట్రీ

Published Thu, Jun 9 2016 8:44 AM

నో ఎంట్రీ

ఘాట్‌రోడ్డు మూసివేతతో వెలవెలబోయిన ఆలయం
ఏడంతస్తులు ఎక్కలేమంటున్న భక్తులు
 
 విజయవాడ : అనుకున్నదే అయ్యింది. దుర్గగుడి అధికారులు పంతం నెగ్గించుకున్నారు. టోల్‌గేటుకు తాళాలు వేశారు. ఇక.. భక్తులు కొండపైకి చేరుకోవాలంటే మల్లికార్జున మహామండపంలోని ఏడో అంతస్తులో వందల మెట్లు ఎక్కి అమ్మవారిని దర్శించుకోవాల్సిందే. లిఫ్టు సదుపాయం ఉన్నా.. అందరికీ ఉపయోగపడని పరిస్థితి.

రెండు రోజులుగా పాత మెట్లమార్గం మీదుగా భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకుంటున్నారు. మంగళవారం నుంచి ఆ ప్రాంతంలో క్లోక్‌రూమ్, సెల్‌ఫోన్ కౌంటర్లు ఏర్పాటుచేశారు. వృద్ధులు, చిన్నపిల్లలతో భక్తులు మహామండపం మెట్లు ఎక్కలేక పాత మెట్లమార్గం వద్ద ఉన్న అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకుని వెనుదిరుగుతున్నారు.
 
ఘాట్‌రోడ్డు వెలవెల
నిత్యం భక్తుల రద్దీతో కళకళలాడే ఘాట్‌రోడ్డును మూసివేయడంతో ఆలయ ప్రాంగణం బుధవారం బోసిపోయింది. పొంగలి షెడ్డు, చెప్పుల స్టాండ్ చివరకు షాపింగ్ కాంప్లెక్స్‌లోని పూజా సామగ్రి దుకాణాల వద్ద నిర్మానుష్య వాతావరణం కనిపించింది. షాపుల్లో సిబ్బంది ఆటలతో కాలక్షేపం చేస్తున్నారు.

భవానీ దీక్ష మండపం తొలగింపు పనులు తుది దశకు చేరుకున్నాయి. ఆలయ పరిపాలన విభాగ భవనం, షాపింగ్ కాంప్లెక్స్ తొలగింపు పనులు రెండు రోజుల్లో ప్రారంభమవుతాయని ఆలయ అధికారులు చెబుతున్నారు. మరోవైపు అన్నదాన భవనం, ప్రసాదాల తయారీ భవనాలను తొలగించేందుకు రూ.70 లక్షలతో అంచనాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement