నో క్యాష్‌

'No cash' boards back at ATMs - Sakshi

బ్యాంకులు, ఏటీఎంలలో నగదు నిల్‌

జిల్లావ్యాప్తంగా 80 శాతం ఏటీఎంలు ఖాళీ

విత్‌డ్రా ఎక్కువ, డిపాజిట్లు తక్కువ

సాక్షి, మచిలీపట్నం/ సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నగదు కష్టాలు తీవ్రమవుతున్నాయి. బ్యాంకుల్లో అవసరమైన మేరకు నగదు డ్రా చేయడం సాధ్యపడట్లేదు. పర్సులో డబ్బు ఖాళీ అయితే ఏటీఎం నుంచి డ్రా చేయాలనుకునే వారి కష్టాలు వర్ణనాతీతం.

ఎందుకీ సమస్య
కృష్ణాజిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకుల ప్రధాన శాఖలు 846 ఉండగా, ఆయా బ్యాంకులకు సంబంధించి 1,051 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 80శాతం ఏటీఎంల్లో నగదు కొరత ఏర్పడింది.
గుంటూరు జిల్లాలో మొత్తం బ్యాంకులు (బ్రాంచీలతో కలిపి) 824 ఉండగా, 870కి పైగా ఏటీఏంలు ఉన్నాయి. ఇందులో 70 శాతం పైగా ఏటీఎంలు పనిచేయట్లేదు. ప్రధాన బ్యాంకులకు సంబంధించిన ఏటీఎంలలో సైతం డబ్బు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో 30 శాతానికి పైగా ఏటీఎంలు శాశ్వతంగా మూతపడ్డాయి. 2016, నవంబర్‌లో కేంద్రం పెద్దనోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కొంతకాలం నగదు కష్టాలు వెంటాడాయి. ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు.

కారణాలివీ..
నగదు కష్టాలకు రెండు కారణాలు ప్రముఖంగా నిలుçస్తున్నాయని బ్యాంకర్లు స్పష్టీకరిస్తున్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి జిల్లాకు నగదు నిల్వలు స్తంభించడం, పార్లమెంట్‌లో ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు ఉండటాన్ని కారణంగా పేర్కొంటున్నారు. దీంతో బ్యాంకు ఖాతాల్లో నగదుపై ఖాతాదారులకు అధికారం ఉండదనే ప్రచారం ప్రస్తుతం బాగా జరుగుతోంది.

రోజూ రూ.కోట్లల్లో లావాదేవీలు
కృష్ణాజిల్లాలో అన్ని బ్యాంకుల్లో కలిపి నిత్యం దాదాపు రూ.200 నుంచి రూ.250 కోట్ల మేర నగదు లావాదేవీలు జరుగుతుంటాయి.  ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, సామాజిక పింఛన్‌దారులకు చెల్లింపులు.. తదితరాలకు ప్రతినెలా మొదటి వారంలో అయితే పెద్ద ఎత్తున నిధులు అవసరమవుతాయి. ఉద్యోగుల వేతనాల చెల్లింపులు అత్యధిక శాతం ఎస్‌బీఏలోనే జరుగుతాయి. ఈ బ్యాంకులకు తొలివారం రూ.300 కోట్లకుపైగా అవసరమని తెలిసింది.
గుంటూరు జిల్లాలోని బ్యాంకుల్లో 2017, అక్టోబర్‌ నాటికి రూ.25,325 కోట్ల డిపాజిట్‌లు ఉండేవి. ప్రతి ఏడాది బ్యాంకుల్లో 15–17 శాతం డిపాజిట్‌లు పెరిగేవి. అయితే, అందులో ఖాతాదారులు ఇప్పటికే 10 శాతం మేర డిపాజిట్‌లు తీసుకున్నారు. జిల్లాలోని బ్యాంకుల్లో రూ.3,382.28 కోట్ల మేర అప్పులు ఉన్నట్లు తెలిసింది. గతంలో ఎన్‌పీఏ (నిర్థారక ఆస్తులు) 1 నుంచి 2 శాతం మాత్రమే ఉండేవి. ప్రస్తుతం వాటి విలువ 13–14 శాతం పెరగటంతో బ్యాంకులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి.

కేవలం విత్‌డ్రాలే..
కరెన్సీ కష్టాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని బ్యాంకు శాఖల్లో నగదు జమ తక్కువగా, చెల్లింపులు (విత్‌డ్రా)లు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో విత్‌డ్రాలకు అవసరమైన మేర నగదు సమకూర్చడం తలనొప్పిగా పరిణమించింది.  ప్రధానంగా రూ.2వేలు, రూ.500 నోట్ల కొరత అధికమైంది. బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రా చేసినప్పుడు వచ్చే రూ.500, రూ.2వేల నోట్లను చాలామంది భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇళ్లల్లోనే దాచుకుంటున్నారు. తిరిగి వాటిని బ్యాంకుల్లో జమ చేసేందుకు సాహసించట్లేదు.

వ్యాపారులే ఆదరువు
ఇతర బ్యాంకులు, శాఖలు.. ప్రైవేట్‌ బ్యాంకులతో మాట్లాడుకుని ఏరోజుకారోజు నగదు సర్దుబాటు చేసుకుంటున్నాయి. పెట్రోల్‌ బంకులు, మద్యం దుకాణాలు, ఆర్టీసీ డిపోలు, కొందరు వ్యాపారుల నుంచి నిత్యం వచ్చే నగదు జమలు ప్రస్తుతం బ్యాంకర్లకు ఆదరువుగా నిలుస్తున్నాయి. పార్లమెంట్‌లో ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు ప్రవేశ పెడుతున్నారనే ప్రచారం, దీనివల్ల బ్యాంకుల్లో నగదుపై ప్రభుత్వానికి అజమాయిషీ ఉంటుందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అధికంగా ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని, ప్రస్తుతం అలాంటిదేమీ లేదని, ఆ బిల్లు అమలు ప్రక్రియ పరిశీలించేందుకు ఇంకా కమిటీని మాత్రమే ఏర్పాటు చేశారని బ్యాంకర్లు చెబుతున్నా.. అది ప్రజల్లో నెలకొన్న అభద్రతాభావాన్ని రూపుమాపడం లేదు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top