
నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు
తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని కమ్మపాళెం ఎంపీటీసీ సభ్యురాలు మాణికల చెంచమ్మ తహసీల్దారు రామకృష్ణ, ఎస్‌ఐ అంజిరెడ్డిల వద్ద శనివారం స్పష్టం చేశారు.
కొడవలూరు: తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని కమ్మపాళెం ఎంపీటీసీ సభ్యురాలు మాణికల చెంచమ్మ తహసీల్దారు రామకృష్ణ, ఎస్‌ఐ అంజిరెడ్డిల వద్ద శనివారం స్పష్టం చేశారు. ఎంపీటీసీ సభ్యురాలు చెంచమ్మను కిడ్నాప్ చేశారని ఆమె భర్త రమణయ్య స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయడం తెల్సిందే. ఈ క్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు చెంచమ్మ స్వతహాగా శనివారం తహసీల్దార్ రామకృష్ణ, ఎస్సై అంజిరెడినిు కలిసి తననెవరూ కిడ్నాప్ చేయలేదంటూ రాతపూర్వకంగా స్టేట్‌మెంట్ ఇచ్చారు. తన భర్త రమణయ్యతో విడిపోయి నాలుగేళ్లయిందని, ఇద్దరం వేర్వేరుగా ఉంటున్నట్లు స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.
ఉద్దేశపూర్వకంగా కొందరు తనపై కిడ్నాప్ కేసు పెట్టించారే తప్ప తననెవరూ కిడ్నాప్ చేయలేదని, బుచ్చిరెడ్డిపాళెంలో ఉంటున్న తన సోదరికి ఆరోగ్యం సక్రమంగా లేకపోతే అక్కడ పది రోజులపాటు ఉండి తిరిగి వచ్చినట్లు చెప్పారు. గ్రామానికి వచ్చిన వెంటనే కిడ్నాప్‌నకు గురైనట్లు కేసు నమోదైన విషయాన్ని తన తల్లి ద్వారా తెలుసుకొని తహసీల్దార్, ఎస్సైకి తెలిపేందుకు వచ్చానన్నారు. ఎంపీటీసీ సభ్యురాలు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ధ్రువీకరించిన తహసీల్దార్ ఆ స్టేట్‌మెంట్ కాపీని ఎస్సైకు పంపారు. ఎంపీటీసీ సభ్యురాలి వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాపా వెంకటేశ్వర్లునాయుడు, మండల కన్వీనర్ వెంకటశేషయ్య, సర్పంచ్ నాగిరెడ్డి రమేష్, యువజన విభాగ జిల్లా కార్యదర్శి రాజేష్‌రెడ్డి, న్యాయవాది శ్యామాచార్యులు ఉన్నారు.