కత్తిపోట్లు | murder attacks | Sakshi
Sakshi News home page

కత్తిపోట్లు

Sep 11 2016 1:23 AM | Updated on Sep 4 2017 12:58 PM

ఇరగవరం : పైరుపచ్చని సీమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రోజు వ్యవధిలో జరిగిన హత్యాయత్నం ఘటనలు సంచలనం సృష్టించాయి. ఈ రెండు ఘటనలకూ తణుకు నియోజకవర్గం కేంద్రబిందువైంది.

ఇరగవరం : పైరుపచ్చని సీమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రోజు వ్యవధిలో జరిగిన హత్యాయత్నం ఘటనలు సంచలనం సృష్టించాయి. ఈ రెండు ఘటనలకూ తణుకు నియోజకవర్గం కేంద్రబిందువైంది. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం రాత్రి ఓ తోపుడుబండి వ్యాపారిపై దుండగులు కత్తులతో తెగబడగా, శనివారం మధ్యాహ్నం గణేశ్‌ నిమజ్జనంలో చోటుచేసుకున్న ఘర్షణ నేపథ్యంలో ఇరగవరం మండలం యర్రాయి చెరువు ప్రాంతంలో తండ్రీకొడుకులపై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు.
 
తండ్రీకొడుకులపై దాడి 
తండ్రీకొడుకులపై కొందరు కత్తులతో దాడి చేసిన ఘటన ఇరగవరం మండలం కావలిపురం పంచాయతీ పరిధిలోని యర్రాయి చెరువు ప్రాంతంలో సంచలనం సృష్టించింది. బాధితులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం..  యర్రాయి చెరువు ప్రాంతం లో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమ నిమజ్జనోత్సవం శనివారం మధ్యాహ్నం జరిగింది. ఊరేగింపులో గ్రామానికి చెందిన కుక్కల శ్రీరామ చంద్రమూర్తి, ఆయన కుమారుడు చంద్రశేఖర్‌తో జుత్తిగ శ్రీనివాస్, ఆయన కుమారుడు దిలీప్‌ ఘర్షణ పడ్డారు. దీంతో పెద్ద మనుషులు గొడవను సర్దుబాటు చేసి ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించేశారు. దీంతో కోపోద్రిక్తులైన జుత్తిగ శ్రీనివాస్, అతని కుమారుడు దిలీప్‌ వారి సమీప బంధువులైన పితాని శ్రీను, జుత్తిగ శ్రీను, జుత్తిగ గెరటయ్య, జుత్తిగ ఆదినారాయణతో కలిసి కుక్కల శ్రీరామచంద్రమూర్తి ఇంటికి వెళ్లి అతినిపైనా అతని కొడుకు చంద్రశేఖర్‌పైనా విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేశారు. దీంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. అపస్మారక స్థితికి చేరుకున్నారు. వారిద్దరినీ గ్రామస్తులు తణుకు ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రం గా గాయపడిన శ్రీరామచంద్రమూర్తిని మెరుగైన వైద్యం కోసం  తణుకులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అతని కుమారుడు చంద్రశేఖర్‌కు తణుకు ఏరియా ఆస్పత్రిలోనే వైద్యం అందిస్తున్నారు. మెడికో లీగల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇరగవం పోలీసులు తెలిపారు. 
 
తోపుడు బండి వ్యాపారిపై హత్యాయత్నం 
తణుకు : తణుకు పట్టణంలో శుక్రవారం రాత్రి ఓ తోపుడుబండి వ్యాపారిపై హత్యాయత్నం జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ  కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. అసలు ఎవరు దాడి చేశారు? ఎందుకు చేశారు? అనే ప్రశ్నలకు జవాబులు అంతుబట్టడం లేదు. 
ఉండ్రాజవరం మండలం కె.సావరం గ్రామానికి చెందిన కాకర్ల దుర్గాప్రసాద్‌ (35)పై శుక్రవారం అర్ధరాత్రి తణుకు–ఉండ్రాజవరం రోడ్డులో హత్యాయత్నం జరిగింది.  తీవ్రంగా గాయపడిన దుర్గాప్రసాద్‌ను చికిత్స నిమిత్తం తొలుత తణుకు ప్రభుత్వాస్పత్రికి అనంతరం మెరుగైన చికిత్స కోసం రాజమండ్రి ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. సీఐ సీహెచ్‌ రాంబాబు, పట్టణ ఎస్‌ఐ జి.శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఎవరి పని ?
తణుకు పట్టణంలో రోడ్డు పక్కనే తోపుడు బండిపై పండ్లు అమ్మే దుర్గాప్రసాద్‌కు వివాదరహితుడిగా పేరుంది. అతడు రోజూ స్వగ్రామమైన కె.సావరం నుంచి సైకిల్‌పై పట్టణానికి వచ్చి పండ్లు విక్రయించిన అనంతరం తిరిగి రాత్రి ఇంటికి వెళ్తుంటాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఇంటికి వెళ్తున్న సమయంలో వెనుక నుంచి మోటారుసైకిల్‌పై వచ్చిన ఇద్దరు కత్తులతో దుర్గాప్రసాద్‌పై దాడికి తెగబడ్డారు. ముఖాలకు రుమాలలు కట్టుకుని టోపీలు ధరించి ఉన్న వీరు దుర్గాప్రసాద్‌ను విచక్షణారహితంగా నరికేశారు. దుర్గాప్రసాద్‌ కిందపడిపోయాడు. కొద్దిదూరం ముందుకు వెళ్లిన  దుండగులు తిరిగి వెనక్కు వచ్చి మళ్లీ దాడి చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న  క్షతగాత్రుడిని ఆ తర్వాత స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు 108 వాహనంపై తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఉద్దేశపూర్వకంగా, ప్రణాళిక ప్రకారం దుర్గాప్రసాద్‌పై దాడి చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఎందుకు చేశారు? అనేది తెలియరావడంలేదు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్యాయత్నం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో పాత గొడవలు ఉన్నాయా అనేది కూడా ఆరా తీస్తున్నారు. హత్యాయత్నం జరిగిన ప్రాంతంలోని అపార్టుమెంటులో ఉన్న సీసీ కెమెరాతోపాటు, ఉండ్రాజవరం జంక్షన్‌ వద్ద ఉన్న సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. దుర్గాప్రసాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement